![Delhi Most Polluted Capital in World, Finds Air Report - Sakshi](/styles/webp/s3/article_images/2022/03/23/india.jpg.webp?itok=MDTPaRb-)
న్యూఢిల్లీ: ప్రపంచ దేశ రాజధానుల్లో అత్యంత కలుషిత నగరంగా ఢిల్లీ నిలిచింది. ప్రపంచ నగరాల్లో వాయునాణ్యతను పరిశీలించి స్విస్ సంస్థ ఐక్యూ ఎయిర్ తయారు చేసే జాబితాలో అత్యంత అధమ వాయు నాణ్యత ఉన్న టాప్ 100లో 63 నగరాలు భారత్‌లోనే ఉన్నాయి. వీటిలో సగానికి పైగా నగరాలు ఉత్తరాదిన ఢిల్లీ పరిసరాల్లోనే ఉండటం గమనార్హం. అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ టాప్ ప్లేస్‌లో ఉండటం వరుసగా ఇది నాలుగోసారి. భారత్‌లో ఒక్క నగరంలో కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారిత వాయు నాణ్యత ప్రమాణాలు( క్యూబిక్ మీటర్‌కు 5 మైక్రోగ్రాములు) లేవని వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్– 2021 తెలిపింది. జాబితా తయారీకి 117 దేశాల్లోని 6,475 నగరాల్లో వాయు నాణ్యత (పీఎం 2.5– పర్టిక్యులేట్ మాటర్ 2.5 స్థాయి)ను సంస్థ పరిశీలించింది.
కలుషిత రాజధానుల్లో ఢిల్లీ తర్వాత ఢాకా (బంగ్లాదేశ్), జమేనా (చాడ్ రిపబ్లిక్), దుషంబె (తజికిస్తాన్), మస్కట్ (ఒమన్) నిలిచాయి. ఢిల్లీ పీఎం 2.5 స్థాయి క్రితంతో పోలిస్తే 14.6 శాతం పెరిగినట్లు నివేదిక తెలిపింది. ఢిల్లీ గాలిలో కాలుష్య స్థాయి క్యూబిక్ మీటర్‌కు 96.4 మైక్రోగ్రాములుగా నమోదైంది. భారత్ సరాసరి వార్షిక పీఎం 2.5 స్థాయి 2021లో క్యూబిక్ మీటర్‌కు 58.1 మైక్రో గ్రాములకు చేరిందని నివేదిక తెలిపింది. కరోనా సమయంలో లాక్‌డౌన్‌తో దేశ వాయునాణ్యత మెరుగైందని, కానీ 2021కల్లా వాయు నాణ్యత తిరిగి 2019 స్థాయికి పడిపోయిందని పేర్కొంది. దేశంలో 48 శాతం నగరాల్లో వాయు నాణ్యత క్యూబిక్ మీటర్‌కు 50 మైక్రో గ్రాములను దాటిందని తెలిపింది.
చదవండి: (రసాయన దాడి ఖాయం: బైడెన్)
పది మనవే.. ప్రపంచ టాప్ 15 కలుషిత నగరాల్లో పది నగరాలు భారత్‌లోనే ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత కలుషిత నగరంగా రాజస్తాన్‌లోని భివాడీ నగరం నిలిచింది. ఈ నగరంలో పీఎం 2.5 స్థాయి 106.2 మైక్రోగ్రామ్/క్యూబిక్ మీటర్‌గా నమోదైంది. తర్వాత స్థానాల్లో యూపీకి చెందిన ఘజియాబాద్, చైనాకు చెందిన హోటాన్, ఢిల్లీ, జాన్‌పూర్, పాక్‌లోని ఫైసలాబాద్ నిలిచాయి. దేశాల వారీగా చూస్తే అత్యంత కాలుష్య దేశంగా పీఎం 2.5 స్థాయి 76.9 మైక్రోగ్రామ్/క్యూబిక్‌మీటర్‌తో బంగ్లాదేశ్ నిలిచింది. తర్వాత స్థానాల్లో చాడ్, పాక్, తజికిస్తాన్, ఇండియా ఉన్నాయి. వాయుకాలుష్యం శ్వాసకోశ ఇబ్బందులు, అలెర్జీల నుంచి క్యాన్సర్ తదితరాలకు దారితీస్తుంది.
చదవండి: (మార్లిన్ మన్రో చిత్రానికి భారీ ధర.. అక్షరాలా రూ.1521కోట్లా..!)
నాలుగో స్థానంలో హైదరాబాద్
ప్రపంచ వాయు నాణ్యతా నివేదిక 2021 ప్రకారం భారత్‌లో అత్యంత కలుషిత నగరాల జాబితాలో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై తర్వాత హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. నగరంలో పీఎం 2.5 స్థాయిలు 2020లో క్యూబిక్ మీటర్‌కు 34.7 మైక్రోగ్రామ్ ఉండగా, 2021కి 39.4కు పెరిగినట్లు నివేదిక తెలిపింది. నగరంలో వాయు కాలుష్యం పెరుగుదలకు ప్రత్యేక కారణాలను నివేదిక పేర్కొనలేదు. కానీ పెరుగుతున్న వాహన విక్రయాలు కాలుష్య పెరుగుదలకు దోహదం చేస్తున్నాయని వ్యాఖ్యానించింది. హైదరాబాద్‌లో అధికారిక లెక్కల ప్రకారం 60 లక్షల వాహనాలున్నాయి. ఈ నివేదిక ప్రభుత్వాలకు కనువిప్పు కావాలని గ్రీన్ పీస్ ఇండియా సంస్థ మేనేజర్ అవినాశ్ వ్యాఖ్యానించారు. దేశీయ వాహన విక్రయాలు పెరుగుతూ పోతున్న తరుణంలో దేశ వాయు నాణ్యత మరింత దిగజారే ప్రమాదం ఉందని, ప్రభుత్వాలు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంప్రదాయ ఇంధన వనరుల స్థానంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కేవలం 3 శాతం నగరాలు మాత్రమే డబ్లు్యహెచ్‌ఓ ప్రమాణాలకు అనుగుణంగా వాయునాణ్యతతో ఉన్నాయని నివేదిక తెలిపింది. దేశాల వారీగా చూస్తే ఏ ఒక్క దేశంలో కూడా వాయు నాణ్యత నిర్ధిష్ట ప్రమాణాలకు అనుగుణంగా లేదని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment