చుట్టూ పచ్చని పచ్చికబయళ్లు, వన్యప్రాణులు. నాలుగు అడుగులేస్తే మన కోసమే ప్రత్యేకంగా ఈతకొలను. ఇంకాస్త పక్కకెళితే ప్రకృతి రమణీయతను చూసేందుకు విడిగా వ్యూ డెక్కులు, మనం ఉన్నచోటు కిందే ఉరకలెత్తుతూ సాగే నది, సకల సౌకర్యాలతో సిద్ధంగా ఉన్న విలాసవంతమైన గది. ప్రకృతి ఒడిలో ఆహ్లాదకర జీవనానికి చిరునామాగా నిలిచే ఇలాంటి చోట కొంతకాలమైనా గడపాలని ఎంతో మంది ఆశ పడతారు.
అలాంటి ప్రకృతి ప్రేమికుల కోసం ఒక రైలును సర్వాంగసుందరంగా తీర్చిదిద్ది ఒక పాత వంతెనపై హోటల్‌గా మార్చారు. ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా పేరొందిన దక్షిణాఫ్రికాలోని క్రూగర్ జాతీయ వనంలో ఈ ‘ది ట్రైన్ ఆన్ ది బ్రిడ్జ్’ హోటల్ ఉంది. ఈ కదలని రైలు అరుదైన అనుభూతిని పంచుతుంది. ఇందులో పర్యాటకుల కోసం అన్ని సౌకర్యాలతో 31 సూట్‌లు సిద్ధంచేశారు. అన్ని రకాల వంటకాలతోపాటు స్థానిక రుచులనూ ఆస్వాదించవచ్చు.
గైడ్‌ల సాయంతో అడవిలోకెళ్లి స్వేచ్ఛగా సింహం, చిరుతపులి, ఏనుగు, నీటిగుర్రం, అడవి బర్రెలను దగ్గర్నుంచి చూసిరావచ్చు. ఒక ట్విన్(జంట)రూమ్‌లో పర్యాటకులు ఒక రాత్రి గడపాలంటే ఒక మనిషికి దాదాపు రూ.44,000 రుసుము వసూలుచేస్తారు. 100 ఏళ్లకు పైబడిన ఈ వంతెనపై గతంలో స్టీమ్ రైళ్లు నడిచేవి. వారసత్వంగా నిలిచిన ఈ వన వంతెనను విభిన్నంగా వినియోగిద్దామని ఈ హోటల్‌కు రూపకల్పన చేశామని మోట్సామయీ టూరిజం గ్రూప్ సీఈవో జెరీ మబేనా చెప్పారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment