Old bridge
-
Kruger National Park: ట్రైన్ రిసార్ట్
చుట్టూ పచ్చని పచ్చికబయళ్లు, వన్యప్రాణులు. నాలుగు అడుగులేస్తే మన కోసమే ప్రత్యేకంగా ఈతకొలను. ఇంకాస్త పక్కకెళితే ప్రకృతి రమణీయతను చూసేందుకు విడిగా వ్యూ డెక్కులు, మనం ఉన్నచోటు కిందే ఉరకలెత్తుతూ సాగే నది, సకల సౌకర్యాలతో సిద్ధంగా ఉన్న విలాసవంతమైన గది. ప్రకృతి ఒడిలో ఆహ్లాదకర జీవనానికి చిరునామాగా నిలిచే ఇలాంటి చోట కొంతకాలమైనా గడపాలని ఎంతో మంది ఆశ పడతారు. అలాంటి ప్రకృతి ప్రేమికుల కోసం ఒక రైలును సర్వాంగసుందరంగా తీర్చిదిద్ది ఒక పాత వంతెనపై హోటల్‌గా మార్చారు. ప్రపంచ వారసత్వ సంపదల్లో ఒకటిగా పేరొందిన దక్షిణాఫ్రికాలోని క్రూగర్ జాతీయ వనంలో ఈ ‘ది ట్రైన్ ఆన్ ది బ్రిడ్జ్’ హోటల్ ఉంది. ఈ కదలని రైలు అరుదైన అనుభూతిని పంచుతుంది. ఇందులో పర్యాటకుల కోసం అన్ని సౌకర్యాలతో 31 సూట్లు సిద్ధంచేశారు. అన్ని రకాల వంటకాలతోపాటు స్థానిక రుచులనూ ఆస్వాదించవచ్చు. గైడ్ల సాయంతో అడవిలోకెళ్లి స్వేచ్ఛగా సింహం, చిరుతపులి, ఏనుగు, నీటిగుర్రం, అడవి బర్రెలను దగ్గర్నుంచి చూసిరావచ్చు. ఒక ట్విన్(జంట)రూమ్‌లో పర్యాటకులు ఒక రాత్రి గడపాలంటే ఒక మనిషికి దాదాపు రూ.44,000 రుసుము వసూలుచేస్తారు. 100 ఏళ్లకు పైబడిన ఈ వంతెనపై గతంలో స్టీమ్ రైళ్లు నడిచేవి. వారసత్వంగా నిలిచిన ఈ వన వంతెనను విభిన్నంగా వినియోగిద్దామని ఈ హోటల్‌కు రూపకల్పన చేశామని మోట్సామయీ టూరిజం గ్రూప్ సీఈవో జెరీ మబేనా చెప్పారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కాలగర్భంలోకి 154 ఏళ్ల నాటి వంతెన
సాక్షి, ముంబై: ఛత్రపతి శివాజీ మహరాజ్ టర్మీనస్ (సీఎస్ఎంటీ)– మసీద్ బందర్ స్టేషన్ల మధ్యనున్న 154 ఏళ్ల పురాతనమైన కర్నాక్ వంతెన కాలగర్భంలో కలిసిపోయింది. శనివారం రాత్రి 11 గంటల నుంచి ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత అంటే సోమవారం తెల్లవారుజాము రెండు గంటల వరకు 27 గంటలు జంబో బ్లాక్ తీసుకున్నప్పటికీ 16 గంటల్లోనే కూల్చీవేత పనులు పూర్తిచేశారు. ఆ తరువాత సాంకేతిక సిబ్బంది రంగంలోకి దిగారు. 25 వోల్టేజీల విద్యుత్ ప్రవహించే ఓవర్ హెడ్ వైరు, సిగ్నల్స్, ఇతర సాంకేతిక పనులు సరిచేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు. దీంతో ఆదివారం సాయంత్రం నుంచి లోకల్ రైళ్ల రాకపోకలు మెల్లమెల్లగా పునరుద్ధరించారు. ఎట్టకేలకు 19 గంటల తరువాత సెంట్రల్ రైల్వే మార్గంలో ఆదివారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో సీఎస్ఎంటీ నుంచి థానే దిశగా, హార్బర్ మార్గంలో మొదటి రైలు 5.52 గంటలకు సీఎస్ఎంటీ నుంచి పన్వేల్ దిశగా నెమ్మదిగా బయలు దేరింది. బ్లాక్ కారణంగా సోమవారం ఉదయం ముంబైకి చేరుకోవల్సిన అనేక దూరప్రాంతాల ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాలేకపోయాయి. దీంతో కొన్ని రైళ్లు సోమవారం కూడా రద్దయ్యాయి. సిబ్బందికి సెలవులు రద్దు... జంబో బ్లాక్ కారణంగా శని, ఆదివారాలు రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్), రైల్వే పోలీసులు, ముంబై పోలీసుల వారంతపు సెలవులు రద్దు చేశారు. సాధారణంగా ప్రతీరోజు సెంట్రల్ రైల్వే మార్గంలో ప్రతీరోజు 1,810 లోకల్ రైళ్లు తిరుగుతాయి. కాని జంబో బ్లాక్ కారణంగా ఆదివారం 1,096 ట్రిపులు రద్దయ్యాయి. అదేవిధంగా 36 దూరప్రాంతాల మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లు రద్దుచేయగా 68 ఎక్స్‌ప్రెస్ రైళ్లను దాదర్ టర్మీనస్, లోకమాన్య తిలక్ (కుర్లా) టర్మీనస్, థానే, కల్యాణ్, కసారా, నాసిక్, కర్జత్, పుణే తదితర ప్రధాన స్టేషన్లలో రద్దుచేసి అటునుంచి తిరిగి పంపించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా శని, ఆదివారాలు 27 గంటలపాటు జంబో బ్లాక్ తీసుకోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వ కార్యాలయాలతోపాటు ప్రైవేటు వాణిజ్య, వ్యాపార, విద్యా సంస్ధలకు, సెలవు ఉంటుంది. దీంతో ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్ధులు ఇబ్బందులు పడరు. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయట పడవద్దని రైల్వే అధికారులు సూచనలు సైతం జారీ చేశారు. కానీ ప్రస్తుతం పెళ్లిల సీజన్ కావడంతో అనేక మంది ఆదివారం షాపింగులకోసం ఇళ్ల నుంచి బయటపడ్డారు. జంబో బ్లాక్ విషయం తెలియక కొందరు పర్యాటకులు రోడ్డు మార్గం ద్వారా ముంబైకి చేరుకున్నారు. కాని ముంబైకి చేరుకున్నాక ఇబ్బందులు పడక తప్పలేదు. అనేక లోకల్ రైళ్ల ట్రిప్పులు రద్దు కావడంతో ప్రధాన స్టేషన్ల ప్లాట్‌ఫారాలపై ఇసుకపోస్తే రాలనంత జనాలు ఉన్నారు. ప్రయాణికులను నియంత్రించడానికి రైల్వే పోలీసులకు తల ప్రాణం తోకకు వచ్చింది. ముఖ్యంగా బైకళ, వడాల రోడ్ స్టేషన్లో లోకల్ రైళ్లను షార్ట్ టర్మానేట్ చేశారు. వచి్చన రైళ్లను అటునుంచి తిరిగి పంపించడంతో ప్లాట్ఫారాలన్నీ ప్రయాణికులతో కిక్కిరిసిపోయాయి. ఏ రైలు, ఎటు పోతుందో తెలియక ఉరుకులు పరుగులు తీశారు. రద్దీ ఉండే కీలకమైన స్టేషన్ల నుంచి బెస్ట్ బస్సులు నడిపినప్పటికీ అవి ఎటూ చాలకుండా పోయాయి. ఆదివారం అర్ధరాత్రి వరకు డ్రైవర్లు, కండక్టర్లు విశ్రాంతి లేకుండా విధులు నిర్వహించారు. తగినంత సిబ్బంది లేకపోవడంతో బెస్ట్ సంస్ధ పూర్తి స్ధాయిలో బస్సులు నడపలేకపోయింది. అయినప్పటికీ 80 శాతం ప్రయాణికులను తమ గమ్యస్ధానాలకు చేరవేసింది. రైల్వే స్టేషన్ల బయట బెస్ట్ బస్సులతో పాటు రైళ్ల రాకపోకల తాజా వివరాలు వెల్లడించేందుకు అన్ని ప్రధాన స్టేషన్లలో అనౌన్స్మెంట్ సిస్టం ఏర్పాటు చేశారు. దీంతో ప్రయాణికులకు, పర్యాటకులకు కొంత ఊరట లభించింది. అత్యంత పురాతనమైన వంతెన... దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంలో పశ్చిమ–తూర్పు ప్రాంతాలను కలిపేందుకు వందేళ్లకు ముందు బ్రిటీష్ కాలంలో నిర్మించిన పురాతన వంతనలే ఉన్నాయి. ప్రస్తుతం అవి శిథిలావస్ధకు చేరుకోవడంతో దశలవారీగా వాటిని కూల్చివేయాలని రైల్వే నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా సెంట్రల్ రైల్వే మార్గంపై ఉన్న పురాతన వంతెనల్లో కర్నాక్ వంతెన ఆగ్రస్ధానంలో ఉంది. కర్నాక్ వంతెన నిర్మాణ పనులు 1858లో ప్రారంభం కాగా 1868లో పూర్తయ్యాయి. ఈ వంతెన పూర్తి చేయడానికి మొత్తం పదేళ్ల సమయం పట్టింది. ఆ సమయంలో జెమ్స్ రివేట్ కర్నాక్ గవర్నర్‌గా పనిచేశారు. దీంతో ఈ వంతెనకు కర్నాక్గా నామకరణ జరిగింది. సెంట్రల్ రైల్వే మార్గంలో ఉన్న వివిధ పాత వంతెనల్లో ఇదే అత్యంత పురాతనమైనదిగా గుర్తింపు పొందింది. అక్కడ ఈ వంతెన పేరు ఇంగ్లీష్, హిందీ, మరాఠీ భాషాల్లో రాసి ఉంది. కూల్చివేత పనులు ఇలా... 50 మీటర్ల పొడవు, 18.8 మీటర్ల వెడల్పు ఉన్న ఈ వంతెనను పూర్తిగా నేల మట్టం చేయడానికి 400 మందికిపైగా కార్మికులు, 100 మందికిపైగా సూపర్వైజర్లు, సాంకేతిక సిబ్బంది, 35 మంది రైల్వే అధికారులు, 42 మంది రైల్వే పోలీసులు, 350 టన్నుల సామర్థ్యం గల 3 భారీ క్రేన్లు, 500 టన్నుల సామర్థ్యం గల ఒక క్రేన్, 300 మందికిపైగా గ్యాస్ కట్టర్లు, ఆరు టవర్ వ్యాగన్లు వినియోగించాల్సి వచ్చింది. ఈ వంతెనపై ఉన్న ఇనుప రాడ్లు, ప్లేట్లు ఇలా మొత్తం 44 ముక్కలు చేశారు. ఇందులో ఒక్కో ఇనుప ముక్క బరువు 10–12 టన్నులు ఉండగా మరికొన్ని 14–16 టన్నుల బరువున్నాయి. ఇందులో కొన్ని ముక్కలను ఒకేసారి పక్కకు నెట్టడానికి 350 టన్నుల సామర్థ్యంగల క్రేన్ల సాయం తీసుకున్నారు. కేవలం ఈ ముక్కలన్నీ పక్కకు నెట్టడానికి ఏకంగా ఎనిమిది గంటల సమయం పట్టింది. వంతెన శిథిలాలను తరలించేందుకు 50పైగా ట్రక్కులు, టిప్పర్లను వినియోగించారు. -
పోటెత్తిన వరద : వంతెన మూసివేత
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది ప్రమాదస్ధాయిని మించి ప్రవహిస్తుండటంతో లోహ పులిగా పేరొందిన పాత ఇనుప బ్రిడ్జిపై వాహన రాకపోకలను సోమవారం మధ్యాహ్నం నుంచి నిలిపివేశారు. యమున నదిలో ప్రమాదస్ధాయి 205.33 మీటర్లు కాగా నది ప్రవాహం 205.20 మీటర్లకు చేరడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. యమున నది ప్రవాహం మరింత పెరుగుతుందనే అంచనాలతో పురాతన ఇనుప వంతెనను మూసివేయాలని జిల్లా మేజిస్ర్టేట్ ఉత్తర్వులు జారీ చేశారని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ట్వీట్ చేశారు. హర్యానాలోని హత్నికుండ్ బ్యారేజ్ నుంచి వరద నీటిని విడుదల చేసిన తర్వాత యమునా నదికి వరద ప్రవాహం పోటెత్తింది. మరోవైపు వరద తీవ్రతతో ఢిల్లీలో చేపట్టాల్సిన చర్యలపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఉన్నతాధికారులతో సమీక్షించారు. -
అదుపు తప్పితే అంతే మరి
సీతారామాపురం(చాపాడు) : మండలంలోని అల్లాడుపల్లె దేవళాలు వద్దకు వెళ్లే సీతారామాపురం–అల్లాడుపల్లె మధ్యగల కుందూనదిపై ఉన్న పాత వంతెనకు ఇరువైపులా రక్షణ కరువైంది. ఏ క్షణాన ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అక్కడ నెలకొంది. దీంతో వంతెనపై ప్రయాణించే వాహనంలోని వారు అదుపు తప్పితే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం వంతెన ఇరువైపులా రక్షణగా చిన్నపాటి పోస్ట్‌లు(సిమెంట్ దిమ్మెలు) మాత్రం ఏర్పాటు చేశారు. ఒక దిమ్మెకు మరో దిమ్మెకు ఖాళీ వ్యత్యాసం ఎక్కువగా ఉంది. వీటిలో కూడా చాలా వరకు దిమ్మెలు దెబ్బతిన్నాయి. సైకిల్, ద్విచక్ర వాహనదారులకు, ఆటోల వారికి ఇవి ఏ విధంగాను రక్షణగా లేవనటంలో సందేహం లేదు. ఇప్పటికే పలు రకాలైన వాహనాలు ఢీ కొనటంతో దిమ్మెలు దెబ్బతిన్నాయి. ఈ వంతెనపై బస్సులు, ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లు, ఆటోలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. మండలంలోని అల్లాడుపల్లె, సీతారామాపురం, చిన్నగురువళూరు, పెద్ద గురువళూరు, గ్రామాలతో పాటు ఖాజీపేట మండలంలోని సన్నుపల్లె, మిడుతూరు, ఏటూరు, కమలాపురం మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు కూడా ఎక్కువగా ఈ దారిన ప్రయాణిస్తుంటూరు. ఏ మాత్రం అదుపు తప్పినా వాహనం కుందూనదిలో పడిపోయే ప్రమాదం ఉంది. కుందూనదిలో ఏడాదిలో అధిక రోజులు నీటి ప్రవాహం ఉంటుంది. నీరు లేకపోయినా వంతెనపై 10 అడుగులకు పైగా లోతు ఉండటంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వంతెనపై రక్షణ గోడ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
నో ఎంట్రీ..
నిడదవోలు : మండలంలోని సమిశ్రగూడెం గ్రామంలో పశ్చిమ డెల్టా ప్రధాన కాలువపై బ్రిటీష్ హయాంలో 1932లో నిర్మించిన పురాతన వంతెనపై భారీ వాహనాల రాకపోకలపై అధికారులు నిషేధం విధించారు. సోమవారం ఉదయం 10 గంటల నుంచి భారీ వామనాలను పూర్తిగా నిషేధిస్తున్నట్టు ఆర్అండ్బీ ఏఈ డి.నందకిశోర్ తెలిపారు. భారీ లోడు వాహనాలు వెళ్తే వంతెన కూలిపోయే ప్రమాదం పొంచి ఉందని ఇటీవల హైదారాబాద్ నుంచి స్రైయోరంట్ సంస్థకు చెందిన నలుగురు బృదం సభ్యులు నివేదికలు అందించారు. నిపుణుల హెచ్చరికల నేపథ్యంలో ఆర్‌అంబీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలు చేపట్టారు. పురాతన వంతెనపై 10 టన్నులకు మించి లోడు వాహనాలను పూర్తిగా నిషేధించారు. వంతెనపై గంటకు 15 కిలోమీటర్లకు మించి ఎటువంటి వాహనాలు వెళ్లరాదని హెచ్చరించారు. వంతెన ముఖద్వారంలో 10 అడుగుల దూరంలో ఐరన్ గడ్డర్( స్టాపర్)ల ఏర్పాటు పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అదేవిధంగా నిడదవోలు పట్టణంలో రైల్వే ఓవర్ బ్రిడ్జి ముఖద్వారంలో ఐరన్ స్టాపర్లను ఏర్పాటు చేయనున్నారు. వాహనాల దారి మళ్లింపు ఇలా... నిడదవోలు మండలం సమిశ్రగూడెం వంతెన వద్ద ఇరుకు, భారీ వాహనాలు నిషేధించడంతో పాటు బరువు 10 టన్నులు, వేగ పరిమితి గంటకు 15 కిలోమీటర్లు మాత్రమేనని హెచ్చరిక బోర్డులను ఆర్అండ్బీ అధికారులు ఏర్పాటు చేశారు. అదే విధంగా కొవ్వూరు మండలం పంగిడి, తాడేపల్లిగూడెం మండలం ప్రత్తిపాడు జంక్షన్లో నిడదవోలు వైపుగా భారీ వాహనాలు రాకుండా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. రాజమండ్రి, కొవ్వూరు నుంచి తాడేపల్లిగూడెం వైపుగా వెళ్లే వాహనాలు సమిశ్రగూడెం వంతెన ఎడమ వైపు నుంచి డి,ముప్పవరం, కానూరు, పెరవలి, తణుకు మీదుగా మళ్లిస్తారు. అదేవిధంగా తాడేపల్లిగూడెం నుంచి రాజమండ్రికి వెళ్లాల్సిన భారీ వాహనాలు ప్రత్తిపాడు నుంచి తణుకు, రావులపాలెం మీదుగా రాజమండ్రి చేరుకోవచ్చును. -
కూలిన పురాతన బ్రిడ్జి
కామారెడ్డి: కామారెడ్డి జిల్లాలోని నిజాంసాగర్ మండలం హసన్‌పల్లి గ్రామ శివారులో ఓ పురాతన బ్రిడ్జి కూలింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులతో పాటు రెండు ఎద్దులకు తీవ్ర గాయాలయ్యాయి. గ్రామానికి చెందిన సాయిలు, సాయి అనే ఇద్దరు వ్యక్తులు పశువులను తోలుకుంటూ బ్రిడ్జి పై నుంచి వెళ్తున్నసమయంలో ఒక్కసారిగా బ్రిడ్జి కూలిపోయింది.. ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని ఆస్పత్రికి తరలించారు. -
రాష్ట్రంలో బంగీ జంప్!
సాక్షి, హైదరాబాద్: బంగీ జంప్.. నడుముకు తాడులాంటి దాన్ని కట్టుకుని అంతెత్తు నుంచి కింద ఉన్న నీటిలోకి దూకే ఓ సాహస విన్యాసం. మన దేశంలో అంతగా ప్రాచుర్యంలో లేనప్పటికీ విదేశాల్లో పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకునే సాహస క్రీడ. ఇప్పుడలాంటి అద్భుత అవకాశం మన రాష్ట్రంలో అందుబాటులోకి వస్తోంది. అయితే, విదేశాల్లో ఉన్నట్టుగా ఏ కొండ అంచు నుంచో దూకేలా మాత్రం కాదు. అలనాడు నిజాం జమానాలో రూపుదిద్దుకుని వయసైపోయి ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న ఓ పురాతన వంతెన పైనుంచి. సాహస క్రీడలంటే ఎంతో ఆసక్తి చూపే యువతను ఆకట్టుకునేందుకు రాష్ట్రంలో అడ్వెంచర్ టూరిజంను అభివృద్ధి చేయాలనుకున్న ప్రభుత్వం.. ఈ వంతెనను అందుకు వేదిక చేసుకోవాలని నిర్ణయించింది. ఆర్మూరు-నిర్మల్ మధ్య సోన్ వద్ద గోదావరిపై 1936లో ఓ భారీ వంతెనను నిర్మించారు. కిలోమీటరుకు మించిన పొడవున్న ఈ వంతెన నిర్మాణ కౌశలం కూడా కళాత్మకంగా ఉంటుంది. ఇంతకాలం సేవలందించిన ఈ వంతెన వయసైపోయిందన్న ఉద్దేశంతో ప్రభుత్వం దానికి సమాంతరంగా కొత్త వంతెనను నిర్మించి వినియోగంలోకి తెచ్చింది. ప్రస్తుతం పాత వంతెన మీదుగా వాహనాలను అనుమతించడం లేదు. కానీ ఇప్పటికీ అది పటిష్టంగానే ఉంది. దిగువన గోదావరి, చుట్టూ అందమైన ప్రకృతి, కళాత్మకంగా నిర్మితమై ఉన్న ఆ వంతెనను సాహస క్రీడలకు వినియోగించుకోవాలని ఇటీవల పర్యాటక శాఖ భావించింది. దీనికి ప్రభుత్వం అనుమతించడంతో కార్యాచరణకు సిద్ధమైంది. ఆ వంతెన మీదుగా నదిలోకి మినీ బంగీ జంపింగ్‌కు అవకాశం కల్పించాలని తాజాగా నిర్ణయించారు. దీంతోపాటు వంతెన దిగువన నుంచి పైకి రాక్ క్లైంబింగ్లాంటివి ఏర్పాటు చేయనున్నారు. వంతెన మీద ఆ ప్రాంత సంప్రదాయాల్ని ప్రతిబింబించే ప్రదర్శనలు, చేతి వృత్తుల ఉత్పత్తులతో ప్రదర్శనలు, ఇతర మేళాలు ఏర్పాటు చేయనున్నారు. దాని మీదుగా కేవలం సైక్లిస్టులు, పాదచారులను మాత్రమే అనుమతించాలని నిర్ణయించారు. త్వరలో వీటిని అందుబాటులోకి తేనున్నారు. పర్యాటక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం గురువారం ఆ వంతెన ప్రాంతాన్ని సందర్శించి స్థానిక అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. ప్రస్తుతం దిగువన గోదావరిలో నీళ్లు లేవు. వచ్చే వానాకాలంలో నీళ్లు చేరిన తర్వాత అవి ఎప్పుడూ నిల్వ ఉండేలా దిగువన మినీ రబ్బర్ డ్యాం నిర్మించే యోచనలో ఉన్నారు.