రక్షణ గోడకు నోచుకోక ప్రమాదకరంగా ఉన్న కుందూనది పాత వంతెన
సీతారామాపురం(చాపాడు) : మండలంలోని అల్లాడుపల్లె దేవళాలు వద్దకు వెళ్లే సీతారామాపురం–అల్లాడుపల్లె మధ్యగల కుందూనదిపై ఉన్న పాత వంతెనకు ఇరువైపులా రక్షణ కరువైంది. ఏ క్షణాన ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అక్కడ నెలకొంది. దీంతో వంతెనపై ప్రయాణించే వాహనంలోని వారు అదుపు తప్పితే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం వంతెన ఇరువైపులా రక్షణగా చిన్నపాటి పోస్ట్‌లు(సిమెంట్ దిమ్మెలు) మాత్రం ఏర్పాటు చేశారు. ఒక దిమ్మెకు మరో దిమ్మెకు ఖాళీ వ్యత్యాసం ఎక్కువగా ఉంది. వీటిలో కూడా చాలా వరకు దిమ్మెలు దెబ్బతిన్నాయి. సైకిల్, ద్విచక్ర వాహనదారులకు, ఆటోల వారికి ఇవి ఏ విధంగాను రక్షణగా లేవనటంలో సందేహం లేదు.
ఇప్పటికే పలు రకాలైన వాహనాలు ఢీ కొనటంతో దిమ్మెలు దెబ్బతిన్నాయి. ఈ వంతెనపై బస్సులు, ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లు, ఆటోలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. మండలంలోని అల్లాడుపల్లె, సీతారామాపురం, చిన్నగురువళూరు, పెద్ద గురువళూరు, గ్రామాలతో పాటు ఖాజీపేట మండలంలోని సన్నుపల్లె, మిడుతూరు, ఏటూరు, కమలాపురం మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు కూడా ఎక్కువగా ఈ దారిన ప్రయాణిస్తుంటూరు.
ఏ మాత్రం అదుపు తప్పినా వాహనం కుందూనదిలో పడిపోయే ప్రమాదం ఉంది. కుందూనదిలో ఏడాదిలో అధిక రోజులు నీటి ప్రవాహం ఉంటుంది. నీరు లేకపోయినా వంతెనపై 10 అడుగులకు పైగా లోతు ఉండటంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వంతెనపై రక్షణ గోడ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment