Chapadu
-
వైఎస్సార్ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ఆగివున్న లారీని టెంపో వాహనం ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన వైఎస్సార్ జిల్లాలోని చాపాడు వద్ద శుక్రవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. తిరుపతికి వెళ్లి ప్రొద్దుటూరుకు తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదంలో మృతి చెందిన వారిని అనూష (35), ఓబుళమ్మ (50), రామలక్ష్మి (55) గా పోలీసులు గుర్తించారు. తీవ్రంగా గాయపడిన మరో 8 మందిని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
గర్భిణులకు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు
చాపాడు: గర్భిణులు క్రమం తప్పకుండా ప్రతి నెలా వైద్య పరీక్షలు చేయించుకునేలా అవగాహన కల్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి నాగరాజు పీహెచ్సీ సిబ్బందికి సూచించారు. చాపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం వైద్యాధికారి రాజేష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ వైద్య శిబిరాన్ని డీఎంహెచ్ఓ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి నెలా వైద్య శిబిరం నిర్వహించి గర్భిణులకు అవసరమైన పరీక్షలు చేసి రక్త హీనత నివారణకు తీసుకోవాల్సిన పోషక ఆహారం తదితర అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ఏఎన్సీ రిజిస్ట్రేషన్, తల్లీబిడ్డ ఎంసీపీ కార్డులలో వివరాలు నమోదు చేయాలని, వైద్య సిబ్బంది రోజూ బయోమెట్రిక్ హాజరు వేయాలన్నారు. జిల్లా ఎన్సీడీ, ఆర్బీఎస్కే జిల్లా అధికారి వెంకటశివ, జిల్లా పీఎంఎంవీవై జిల్లా కో ఆర్డినేటర్ విజయ్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు సురక్షితం ఖాజీపేట: గర్భిణులు ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు చేయించుకోవడం సురక్షితమని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి నాగరాజు అన్నారు. ఖాజీపేట పీహెచ్‌సీని గురువారం ఆయన పరిశీలించారు. ఆసుపత్రిలో జరిగిన కాన్పుల సంఖ్యపై అధికారులతో ఆరా తీశారు. రికార్డులను పరిశీలించారు. వైద్యాధికారి డాక్టర్ బాలకొండ్రాయుడు, ఆరోగ్య విస్తరణ అధికారి రాఘవయ్య పాల్గొన్నారు. -
ఆది అత్యుత్సాహం.. డీఎస్పీ ఓవర్ యాక్షన్
సాక్షి, చాపాడు: రాష్ట్ర మంత్రి, టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి మండలంలోని చిన్నగురువళూరు పోలింగ్ కేంద్రం వద్ద అత్యుత్సాహం ప్రదర్శించగా.. ప్రొద్దుటూరు డీఎస్పీ శ్రీనివాసరావు ఓవర్ యాక్షన్ చేశారు. వివరాల్లోకి వెళితే.. చాపాడు మండలంలోని నక్కలదిన్నె, అనంతపురం, తిప్పిరెడ్డిపల్లె, చిన్నగురువళూరు గ్రామాల్లో ఏజెంట్లను మంత్రి ఆదినారాయణరెడ్డి, మైదుకూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్ స్వయంగా తన కార్లలో తీసుకువచ్చి కూర్చోబెట్టారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి అత్తగారి ఊరైన చిన్నగురువళూరు గ్రామంలో కూర్చోబెట్టేందుకు ఇద్దరు మహిళా ఏజెంట్లను తీసుకొచ్చారు. నిబంధనల ప్రకారం పోలింగ్‌ముందు రోజే ఏజెంట్లు వివరాలు ఇవ్వాల్సి ఉండగా టీడీపీ వర్గీయులు ఇవ్వలేదు. ఈ నేపథ్యం లో ఆది, పుట్టా తీసుకువచ్చిన సదరు ఏజెంట్లను కూర్చోడానికి పోలింగ్ ఆఫీసరు నిరాకరించారు. దీంతో మంత్రి ఆది అత్యుత్సాహం ప్రదర్శించారు. కలెక్టర్‌తో, రిటర్నింగ్ అధికారితో మాట్లాడమని తన ఫోను ఇవ్వగా పోలింగ్ సిబ్బంది నిరాకరించారు. నిబంధనలకు వ్యతిరేకంగా చేయలేమని చెప్పిన పోలింగ్ అధికారులు గంట సేపటి తర్వాత రిటర్నింగ్ అధికారి చెప్పారనే సాకుతో ఏజెంట్లను నియమించారు. అప్పటికే పోలింగ్ కేంద్రం వద్ద మంత్రి ఆది అధికారులపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో రంగ ప్రవేశం చేసిన స్పెషల్ పార్టీ పోలీసులు కలుగజేసుకుని మంత్రి ఆది, అభ్యర్థి పుట్టాలను పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లాలని హుకూం జారీ చేశారు. దీంతో మంత్రి ఆది పోలీసు సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. ఇదే క్రమంలో ప్రొద్దుటూరు డీఎస్పీ శ్రీనివాసరావు సైతం చిన్నగురువళూరు పోలింగ్ కేంద్రానికి చేరుకుని అక్కడి స్పెషల్ పోలీసులపై నోరు పారేసుకున్నారు. తెలుగు రాని వారిని పెడితే ఇదే ఇబ్బందన్నారు. దీనిపై అక్కడున్న స్థానిక సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రంలో ఇబ్బంది కలిగిస్తున్నారనే బయటికి పంపించాల్సి వచ్చిందన్నారు. అనంతరం దీంతో ఖంగుతున్న మంత్రి ఆది, అభ్యర్థి పుట్టా కాసేపటికి వెనుదిరిగి వెళ్లిపోయారు. -
బద్ధలైన ‘పుట్టా’ కంచుకోట
సాక్షి, నెర్రవాడ(చాపాడు): టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్‌కు కంచుకోటగా మారిన మండలంలోని నెర్రవాడలో తమ సామాజిక వర్గీయులైనా యాదవులు ఈ ఎన్నికల్లో షాక్ ఇవ్వనున్నారు. పుట్టా తీరును వ్యతిరేకిస్తూ, వైఎస్ జగన్‌పై ఇష్టంతో 35 యాదవ కుటుంబీకులు గురువారం ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. రావాలి జగన్.. కావాలి జగన్ కార్యక్రమంలో భాగంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మేకల శేఖర్, లంకెల జయరాములు, చల్లా గంగన్న, చల్లా శ్రీనివాసులు, పెద్ద వీరయ్య, చల్లా గంగాధర్, పిట్టి నరసింహులు, శ్రీనివాసులు, బండారు సుబ్బయ్య, చింతల సుబ్బరాయుడు, కదిరేపల్లె శ్రీను, పిట్టి శ్రీనివాసులు, లంకెల రామచంద్రయ్య, కురాకు మాధవ, ఇరగబోయిన లక్షుమయ్య, గొగ్గి ఓబులేసు, గాలి బాబు, శివలింగమయ్య, పిట్టి అంజన ప్రసాద్, ప్రకాశ్, ఓబులేసు, గొగ్గి మల్లేషు, సాయి, చింతల బీరేష్, పిట్టి సాయికుమార్, పిట్టి కాశి, చల్లా పెద్ద గంగన్న, చల్లా వెంకటరమణ, మందాల నారాయణ, బండారు చిన్న సుబ్బయ్య, చల్లా చిన్నవీరయ్య, పిట్టి నరసింహులు పార్టీలో చేరారు. అనంతరం ఎమ్మెల్యేతో పాటు తనయుడు నాగిరెడ్డి ఇంటింటికి తిరిగి ఫ్యాను గుర్తుకు ఓటేయాలని ప్రజలను కోరారు.కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రాజశేఖరరెడ్డి, జెడ్పీటీసీ ఎస్సార్ బాలనరసింహారెడ్డి, మండల నాయకులు లక్షుమయ్య, ఉప ఎంపీపీ నరసింహారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మదీనా దస్తగిరి, రాష్ట్ర, జిల్లా కార్యదర్శులు శశిథర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి, సీనియర్ నాయకులు మడూరు ప్రతాప్‌రెడ్డి, గురివిరెడ్డి, నారాయణరెడ్డి, శ్రీమన్నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పార్టీ మారిన వారిని వదలను ..
సాక్షి, చాపాడు : అధికారంలో ఉన్నప్పుడు టీడీపీలోకి వచ్చి ఇప్పుడు పార్టీ మారుతున్న వారిపై కక్ష సాధిస్తానని టీడీపీ నియోజకవర్గ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్ అన్నారు. మీరు నమ్ముకుని వెళుతున్న నాయకులు ఈ ఎన్నికల్లో మాత్రమే ఉంటారని.. తానే మరో 20 ఏళ్ల వరకు పోటీలో ఉంటానని ఎవరినీ వదలిపెట్టనన్నారు. మండలకేంద్రమైన చాపాడులో ఆదివారం టీడీపీ కార్యాలయం ప్రారంభించిన పుట్టా మాట్లాడుతూ ఒక పార్టీలో ఉంటూ మరొక పార్టీలోకి మారడం తప్పని తనను నమ్మించి పార్టీలోకి చేరిన వారు ఇప్పుడు నాకు సినిమా చూపిస్తున్నారని, తాను కూడా పది సినిమాలు చూపిస్తానన్నారు. మొదట్లో తెలియక తప్పులు చేశానని, ఇప్పుడు రాజకీయాల గురించి తెలుసుకున్నానన్నారు. ఎన్నికల్లో దేనికైనా సిద్ధంగా ఉన్నానన్నారు. వైఎస్సార్సీపీలోకి వెళుతున్నారని కారణాలు అడిగితే బంధువులు అని, కార్యకర్తలంటూ కథలు చెబుతున్నారని పార్టీలోకి వచ్చేటప్పుడు తెలియదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు వెంకటసుబ్బారెడ్డి, రవిశంకర్‌రెడ్డి, గోసుల కృష్ణారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, లక్ష్మీనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అదుపు తప్పితే అంతే మరి
సీతారామాపురం(చాపాడు) : మండలంలోని అల్లాడుపల్లె దేవళాలు వద్దకు వెళ్లే సీతారామాపురం–అల్లాడుపల్లె మధ్యగల కుందూనదిపై ఉన్న పాత వంతెనకు ఇరువైపులా రక్షణ కరువైంది. ఏ క్షణాన ఎలాంటి ప్రమాదం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి అక్కడ నెలకొంది. దీంతో వంతెనపై ప్రయాణించే వాహనంలోని వారు అదుపు తప్పితే పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం వంతెన ఇరువైపులా రక్షణగా చిన్నపాటి పోస్ట్‌లు(సిమెంట్ దిమ్మెలు) మాత్రం ఏర్పాటు చేశారు. ఒక దిమ్మెకు మరో దిమ్మెకు ఖాళీ వ్యత్యాసం ఎక్కువగా ఉంది. వీటిలో కూడా చాలా వరకు దిమ్మెలు దెబ్బతిన్నాయి. సైకిల్, ద్విచక్ర వాహనదారులకు, ఆటోల వారికి ఇవి ఏ విధంగాను రక్షణగా లేవనటంలో సందేహం లేదు. ఇప్పటికే పలు రకాలైన వాహనాలు ఢీ కొనటంతో దిమ్మెలు దెబ్బతిన్నాయి. ఈ వంతెనపై బస్సులు, ట్రాక్టర్లు, ఎద్దుల బండ్లు, ఆటోలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. మండలంలోని అల్లాడుపల్లె, సీతారామాపురం, చిన్నగురువళూరు, పెద్ద గురువళూరు, గ్రామాలతో పాటు ఖాజీపేట మండలంలోని సన్నుపల్లె, మిడుతూరు, ఏటూరు, కమలాపురం మండలంలోని పలు గ్రామాలకు చెందిన ప్రజలు కూడా ఎక్కువగా ఈ దారిన ప్రయాణిస్తుంటూరు. ఏ మాత్రం అదుపు తప్పినా వాహనం కుందూనదిలో పడిపోయే ప్రమాదం ఉంది. కుందూనదిలో ఏడాదిలో అధిక రోజులు నీటి ప్రవాహం ఉంటుంది. నీరు లేకపోయినా వంతెనపై 10 అడుగులకు పైగా లోతు ఉండటంతో ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వంతెనపై రక్షణ గోడ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
రైతును బూటు కాలితో తంతావా..?
► ఎస్ఐ తీరుపై ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆగ్రహం ► అవినీతే ఎస్ఐ ధ్యేయం అంటూ మండిపాటు చాపాడు: దేశానికి అన్నం పెట్టే రైతులంటే అంత చులకనా.. ఏ నేరం చేయకపోయినా అన్యాయంగా, విచక్షణా రహితం గా బూటు కాలితో తంతావా.. అంటూ చాపాడు ఎస్ఐ శివశంకర్‌పై మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంతో పాటు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్న ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాను పండించిన కూరగాయలను విక్రయించుకునేందుకు మోటార్ బైకుపై వెళుతున్న రైతు రామచంద్రారెడ్డిని ఎస్ఐ బూటు కాలితో తన్నడం దారుణమన్నారు. రైతు వద్ద వాహనానికి సంబంధించిన ఆర్సీ, లైసెన్స్ ఉన్నప్పటికీ దురుసుగా ప్రవర్తించడం, అసభ్యపదజాలంతో దూషించడం మంచి పద్ధతి కాదన్నారు. ఎదుటివారి కుటుంబీకులను ఉద్దేశించి దూషించే సమయంలో తమ కుటుంబం గురించి కూడా ఆలోచించాలని ఆయన హితవు పలికారు. మండలానికి వచ్చిన రెండేళ్లలో ఎస్ఐ లక్షలాది రూపాయలు అక్రమంగా సంపాదించాడని, ప్రతి రోజూ ఇసుక ట్రాక్టర్ల ద్వారా అక్రమ వసూళ్లు చేస్తున్నాడని ఆరోపించారు. తిప్పిరెడ్డిపల్లె, రాజుపాళెం ప్రాంతాల నుంచి ప్రతి రోజూ వెళుతున్న 100 ఇసుక ట్రాక్టర్ల నుంచి ట్రాక్టర్‌కు రూ.500 చొప్పున వసూలు చేస్తున్నాడని ఆయన అన్నారు. డబ్బులు ఇవ్వకపోతే సంబంధిత ట్రాక్టర్ల యజమానులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తాడన్నారు. ఇలా ప్రతి నెలా రూ.10 లక్షల నుంచి రూ.15లక్షల వరకు అక్రమంగా సంపాదిస్తున్నాడని, సంపాదనే లక్ష్యంగా అన్యాయంగా విధులు నిర్వర్తిస్తున్నాడని ధ్వజమెత్తారు. అనేక చోట్ల ఏసీబీ అధికారులు అవినీతి అధికారులను పట్టుకుంటున్నారని, ఎస్ఐపై నిఘా పెట్టి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఇలాంటి ఎస్ఐలను ప్రజల మధ్యలో పెట్టకుండా ఎక్కడికైనా లూప్ లైన్ లో పంపాలని కోరారు. ఎస్ఐపై పోలీసు ఉన్నతాధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. -
నీరు– చెట్టు పనుల పరిశీలన
టీఓపల్లె(చాపాడు): మండలంలోని టీఓపల్లె పంచాయతీలో జరిగిన నీరు-చెట్టు పనులను మంగళవారం కడపకు చెందిన విజిలెన్స్ అధికారులు పరిశీలించినట్లు కేసీ కెనాల్ డీఈఈ జిలానీ బాషా తెలిపారు. గత ఏడాది జూన్, జూలై మాసాల్లో నిర్మించిన చెక్ డ్యాంలు, కల్వర్టులు, ప్రొటెక్షన్ వాల్ వంటి పనులపై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ అధికారుల బృందంతో పరిశీలించామన్నారు. పనులు వివరాలను ఉన్నతాధికారులకు నివేదించనున్నామని డీఈఈ చెప్పారు. -
నీరు–చెట్టు పనుల పరిశీలన
టీఓపల్లె(చాపాడు): మండలంలోని టీఓపల్లె పంచాయతీలో జరిగిన నీరు-చెట్టు పనులను మంగళవారం కడపకు చెందిన విజిలెన్స్ అధికారులు పరిశీలించినట్లు కేసీ కెనాల్ డీఈఈ జిలానీ బాషా తెలిపారు. గత ఏడాది జూన్, జూలై మాసాల్లో నిర్మించిన చెక్ డ్యాంలు, కల్వర్టులు, ప్రొటెక్షన్ వాల్ వంటి పనులపై ఫిర్యాదులు రావడంతో విజిలెన్స్ అధికారుల బృందంతో పరిశీలించామన్నారు. పనులు వివరాలను ఉన్నతాధికారులకు నివేదించనున్నామని డీఈఈ చెప్పారు. -
ఫ్రీగా వస్తే..
చాపాడు: ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగుతారు అంటూ కొందరిని ఉద్దేశించి అంటుంటాం.. అవును అలాంటి సంఘటనే ఇది.. డీజిల్ ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్.. క్లీనర్ ఆసుపత్రి పాలైతే.. అయ్యో..పాపం అంటూ సానుభూతి చూపాల్సింది పోయి.. మీరేమైపోతే మాకేం.. అంటూ కొందరు కక్కుర్తిపరులు బోల్తాపడిన డీజిల్ ట్యాంకర్ నుంచి డీజిల్‌ను ఎత్తుకుపోవడం మొదలుపెట్టారు. ఒకరిని చూసి మరొకరు.. ఇలా డీజిల్ తీసుకెళ్లే వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగింది. ఈ దృశ్యాన్ని చూసి ఆ దారిన వెళ్లేవారు సైతం మేమేం తక్కువ తిన్నామా అంటూ వారికి అందుబాటులో ఉన్న క్యాన్లు, బాటిళ్లలో డీజిల్‌ను తీసుకుని వెళ్లారు. కొందరు లీటరు బాటిల్ తెచ్చుకుంటే మరికొందరు ఐదులీటర్లు.. ఇంకొందరు ఏకంగా 20 లీటర్ల క్యాన్లు.. ప్లాస్టిక్ బిందెలు తీసుకొచ్చి డీజిల్ తీసుకెళ్లారు. శనివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో చాపాడు మండలం నాగులపల్లె వద్ద డీజిల్ ట్యాంకర్ బోల్తాపడిన సంఘటనలో డ్రైవర్, క్లీనర్ ఆసుపత్రి పాలు కాగా, ఇలా కొందరు డీజిల్ ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న ఎస్ఐ శివశంకర్ అక్కడ పోలీసులను నియమించడంతో డీజిల్ ఎత్తుకెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. -
ఆరిపోయిన ఇంటి దీపం
సీతారామాపురం(చాపాడు): ఆ యువకులు దీపావళి పర్వదినాన్ని ఆనందంగా జరుపుకోవాలనుకున్నారు. అందరూ కలిసి కుందూనది ఒడ్డున విందు ఏర్పాటు చేసుకున్నారు. ఆ తర్వాత సరదాగా ఈత కొట్టేందుకు నదిలోకి దిగారు. వీరిలో ఓ యువకుడు నీటి గుంతలో ఇరుక్కోగా.. అతన్ని రక్షించేందుకు మరో యువకుడు ప్రయత్నించాడు. ఇద్దరూ నీటిలో గల్లంతయ్యారు. సోమవారం మధ్యాహ్నం ఓ యువకుడి మృతదేహం లభ్యం కాగా, మరో యువకుడి కోసం గాలింపు కొనసాగుతోంది. సెల్ఫీ తీసుకున్నారు.. గల్లంతయ్యారు.. చాపాడు మండలంలోని సీతారామాపురం గ్రామానికి చెందిన ఉండేల శ్రీనాథరెడ్డి, బొర్రా తరుణ్‌రెడ్డి, వీరి తమ్ముళ్లు సురేంద్ర, వంశీలతో పాటు రాజా, సునీల్, సురేష్, లోకేశ్వర్‌రెడ్డి, ప్రసాద్, చాపాడుకు చెందిన ఉప్పలూరి వినోద్, చియ్యపాడుకు చెందిన ఓంకార్‌లతో పాటు మరొకరు కలసి 12 మంది కుందూనది ఒడ్డున ఆదివారం విందు ఏర్పాటు చేసుకున్నారు. మధ్యాహ్నం 2గంటలకు అందరూ కలిసి భోజనం చేస్తూ ’సెల్ఫీ’ తీసుకున్నారు. తర్వాత నదిలో ఈత కొట్టాలనుకున్నారు. తొలుత ఐదారు మంది నదిలో దిగి అవతలి ఒడ్డుకు చేరుకున్నారు. ఈ క్రమంలో వరుణ్‌కుమార్‌రెడ్డి ముందు వెళుతుండగా, వెనకాలే వస్తున్న సరిగా ఈత రాని శ్రీనాథరెడ్డి నదిలో ఇరుక్కున్నాడు. దీన్ని గమనించిన వరుణ్ స్నేహితుడి కోసం వెనక్కు వెళ్లి రక్షించే క్రమంలో ఇద్దరూ నదిలో గల్లంతయ్యారు. ఒడ్డున ఉండి గమనించిన వీరిద్దరి తమ్ముళ్లు సురేంద్ర, వంశీలు గట్టిగా కేకలు వేశారు. నది అవతలవైపు ఉన్న వారందరూ నదిలోకి వచ్చి గాలించినా ఫలితం లేదు. సోమవారం ఉదయం నుంచి గ్రామస్తులు నదిలో వెతకగా మ«ధ్యాహ్నం 12గంటల ప్రాంతంలో శ్రీనాథ్‌రెడ్డి మృత దేహం కనిపించింది. వరుణ్‌కుమార్ రెడ్డి ఆచూకి లభ్యం కాలేదు. చాపాడు ఎస్ఐ శివశంకర్ కేసు నమోదు చేసుకున్నారు. తహసీల్దార్ పుల్లారెడ్డి, వీఆర్వో మాబుహుస్సే పరిస్థితిని ఆరా తీశారు. ఆ ఇద్దరూ రెండు కుటుంబాల్లో పెద్ద కుమారులే.. నదిలో గల్లంతైన ఇద్దరు యువకులిద్దరూ వారి కుటుంబాల్లో పెద్ద కొడుకులు. ఉండేల రమణారెడ్డి కుమారుడు శ్రీనాథరెడ్డి మైదుకూరులోని కడప రోడ్డులో సెల్ పాయింట్ నిర్వహిస్తూ కుటుంబానికి ఆసరాగా ఉన్నాడు. బొర్రు వెంకటేశ్వర్‌రెడ్డి పెద్ద కుమారుడైన వరుణ్‌కుమార్‌రెడ్డి ఇటీవల ఎంబిఏ పూర్తి చేసుకుని నాలుగు నెలల క్రితమే బెంగళూరులో ఓ సాప్‌్టవేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. దీపావళి పండుగ కోసం స్వగ్రామానికి వచ్చాడు. వారి తమ్ముళ్ల కళ్ల ముందే వీరు నదిలో గల్లంతు కావడంతో ఆ రెండు కుటుంబాలతో పాటు గ్రామం శోకసంద్రంలో నిండిపోయింది. -
ఏడుగురు ఎర్ర స్మగ్లర్ల అరెస్ట్
- ఏడు దుంగలు స్వాధీనం దువ్వూరు(చాపాడు): మండల పరిధిలోని కృష్ణంపల్లె వద్ద గురువారం ఉదయం ఎర్రచందనం తరలించేందుకు సిద్ధంగా ఉన్న ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఏడు దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు మైదుకూరు రూరల్ సీఐ నాగభూషణం తెలిపారు. నంద్యాల, మైదుకూరు,చెన్నై ప్రాంతాలకు చెందిన స్మగ్లర్లు అడవుల్లో ఎర్రచందనం దుంగలను నరికి కృష్ణంపల్లె వద్ద గల నారాయణస్వామి గుడి వద్ద సిద్ధంగా ఉండగా, ముందస్తు సమాచారంతో పోలీసులు దాడి చేశారన్నారు. పట్టుబడిన వారిలో దువ్వూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన వినోద్, చింతకుంటకు చెందిన జిలానీబాషా, రాజుపాళెం మండలం కూలూరు కొట్టాలకు చెందిన ప్రభాకర్, బీమఠం మండలం రేకలకుంటకు చెందిన నారాయణ, సోమయాజులపల్లెకు చెందిన శీర్ల సిద్దయ్య, గోపవరం మండలం లెక్కలవారిపల్లెకు చెందిన కొప్పల శ్రీరాములతో పాటు దువ్వూరు ఎస్సీ కాలనీకి చెందిన మరో వ్యక్తి ఉన్నారన్నారు. వీరిందరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు సీఐ చెప్పారు. -
రేషన్ బియ్యం పట్టివేత
చాపాడు: వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం కుందూ సమీపంలో అక్రమంగా తరలిస్తున్న 24 బస్తాల రేషన్ బియ్యాన్ని ఎంఆర్ఓ జ్ఞానమూర్తి సోమవారం సాయంత్రం పట్టుకున్నారు. ప్రొద్దుటూరుకు చెందిన శ్రీరాములు అనే వ్యక్తి 24 బస్తాల రేషన్ బియ్యాన్ని బద్వేలుకు ఆటోలో తరలిస్తుండగా పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న బియ్యం బస్తాలను పోలీసు స్టేషన్‌కు తరలించి శ్రీరాములుపై కేసు నమోదు చేశారు. -
కుందూ నదిలో మృతదేహం
చాపాడు : వైఎస్సార్ జిల్లా చాపాడు మండలం సీతారాంపురం గ్రామం వద్ద కుందూ నదిలో ఓ గుర్తు తెలియని మృతదేహం శనివారం వెలుగు చూసింది. మూటలో కట్టి ఉన్న మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఎవరో హత్య చేసి మృతదేహాన్ని వదిలేసి వెళ్లి ఉంటారని భావిస్తున్నారు. -
విషాదం
చాపాడు: మండల పరిధిలోని చాపాడు-వెదురూరు మధ్య ఉన్న కొత్తరాజుపేట గ్రామం వద్ద ఆదివారం మధ్యాహ్నం ఎదురెదురుగా వస్తున్న ఆటో-బైక్ ఢీ కొని మండలంలోని కుచ్చుపాప గ్రామానికి చెందిన రైతు నంద్యాల కృష్ణయ్య(57), తూర్పు అనంతపురం గ్రామానికి చెందిన ఆర్టీపీపీ ఉద్యోగి కుండ గంగయ్య(32), బీటెక్ విద్యార్థి మైలా హరికృష్ణ(22) దుర్మరణం చెందారు. వీరితో పాటు అనంతపురం గ్రామానికి చెందిన వీరభద్రుడు(23), నక్కలదిన్నెకు చెందిన రమేష్(34)అనే వ్యక్తులు గాయపడ్డారు. అనంతపురం గ్రామానికి చెందిన మైలా రాజగోపాల్-గంగమ్మల రెండో కుమారుడు హరికృష్ణ ప్రొద్దుటూరులోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ విద్యార్థి ఆదివారం మధ్యాహ్నం ఆర్టీపీపీలో ఉద్యోగం చేస్తున్న ఇదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు కుండ గంగయ్యను బైక్‌పై బస్టాప్ వద్ద వదిలేందుకు చాపాడుకు బయలుదేరారు. ఇదే సమయంలో కుచ్చుపాప గ్రామానికి చెందిన రైతు నంద్యాల కృష్ణయ్య ఎరువుల కోసం చాపాడుకు వచ్చి తిరిగి ఆటోలో గ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో రాజువారిపేట వద్ద ఎదురెదురుగా వస్తున్న బైక్, ఆటోలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో బైక్‌పై పడింది. దీంతో బైక్‌పై ఉన్న ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ఉన్న ఎరువుల బస్తాలు రైతు కృష్ణయ్యపై పడ్డాయి. అతన్ని ఆటో నుంచి బయటికి తీసుకురాగా కొద్ది నిమిషాలలో మృతి చెందాడు. ఇతనితో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న వీరభద్రుడు, రమేష్‌లకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్ఐ గిరిబాబులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అంతకుముందే గాయపడిన వారిని చికిత్స నిమిత్తం అదే ఆసుపత్రికి తీసుకెళ్లారు. బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న హరికృష్ణ చనిపోవటంతో తల్లిదండ్రులు గంగయ్య, గంగ మ్మల వేదన వర్ణనాతీతంగా మారింది. కుండ గంగయ్య అనంతపురం గ్రామంలోని పోతులూరయ్య కూతురిని వివాహం చేసుకుని అక్కడే గత కొన్నేళ్లుగా నివాసం ఉంటూ ఆర్టీపీపీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం ఉద్యోగరీత్యా వెళుతూ మృతి చెందటంతో భార్య సౌదామణి, ఏడేళ్ల, ఐదేళ్ల కుమారులు చంద్రమౌలి, కిషోర్‌లు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. వ్యవసాయం చేసుకుని కుటుంబాని పోషిస్తున్న రైతు కృష్ణయ్య ఎరువుల కోసం వచ్చి మృత్యువాత పడటంతో అతని కుమారులు, భార్య విలపించారు. ప్రమాద స్థలం వద్ద వైఎస్సార్సీపీ నాయకులు మండలంలోని కొత్తరాజువారిపేట గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న ఆయా ప్రాంతాల వైఎస్సార్సీపీ నాయకులు సంఘటనా స్థలం వద్దకు చేరుకొని పలు రకాలైన సహాయక చర్యలు చేపట్టారు. మండల బీసీ కన్వీనర్ బిర్రు రామచంద్రయ్య, నక్కలదిన్నెకు చెందిన మహేశ్వరరెడ్డి, అనంతపురం గ్రామానికి చెందిన సీవీ సుబ్బారెడ్డి, జయరామిరెడ్డి, కుచ్చుపాప మాజీ సర్పంచ్ లక్షుమయ్య, రాజువారిపేటకు చెందిన జయసుబ్బారెడ్డిలతో పాటు ఇంకా పలువురు మృతులు, గాయపడిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.