చిన్నగురుళూరు పీఎస్‌లో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న మంత్రి ఆది, పుట్టా
సాక్షి, చాపాడు: రాష్ట్ర మంత్రి, టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి ఆదినారాయణరెడ్డి మండలంలోని చిన్నగురువళూరు పోలింగ్ కేంద్రం వద్ద అత్యుత్సాహం ప్రదర్శించగా.. ప్రొద్దుటూరు డీఎస్పీ శ్రీనివాసరావు ఓవర్ యాక్షన్ చేశారు. వివరాల్లోకి వెళితే.. చాపాడు మండలంలోని నక్కలదిన్నె, అనంతపురం, తిప్పిరెడ్డిపల్లె, చిన్నగురువళూరు గ్రామాల్లో ఏజెంట్లను మంత్రి ఆదినారాయణరెడ్డి, మైదుకూరు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పుట్టా సుధాకర్‌యాదవ్ స్వయంగా తన కార్లలో తీసుకువచ్చి కూర్చోబెట్టారు. ఈ క్రమంలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి అత్తగారి ఊరైన చిన్నగురువళూరు గ్రామంలో కూర్చోబెట్టేందుకు ఇద్దరు మహిళా ఏజెంట్లను తీసుకొచ్చారు. నిబంధనల ప్రకారం పోలింగ్‌ముందు రోజే ఏజెంట్లు వివరాలు ఇవ్వాల్సి ఉండగా టీడీపీ వర్గీయులు ఇవ్వలేదు.
ఈ నేపథ్యం లో ఆది, పుట్టా తీసుకువచ్చిన సదరు ఏజెంట్లను కూర్చోడానికి పోలింగ్ ఆఫీసరు నిరాకరించారు. దీంతో మంత్రి ఆది అత్యుత్సాహం ప్రదర్శించారు. కలెక్టర్‌తో, రిటర్నింగ్ అధికారితో మాట్లాడమని తన ఫోను ఇవ్వగా పోలింగ్ సిబ్బంది నిరాకరించారు. నిబంధనలకు వ్యతిరేకంగా చేయలేమని చెప్పిన పోలింగ్ అధికారులు గంట సేపటి తర్వాత రిటర్నింగ్ అధికారి చెప్పారనే సాకుతో ఏజెంట్లను నియమించారు. అప్పటికే పోలింగ్ కేంద్రం వద్ద మంత్రి ఆది అధికారులపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో రంగ ప్రవేశం చేసిన స్పెషల్ పార్టీ పోలీసులు కలుగజేసుకుని మంత్రి ఆది, అభ్యర్థి పుట్టాలను పోలింగ్ కేంద్రం నుంచి వెళ్లాలని హుకూం జారీ చేశారు. దీంతో మంత్రి ఆది పోలీసు సిబ్బందిపై దురుసుగా ప్రవర్తించారు. ఇదే క్రమంలో ప్రొద్దుటూరు డీఎస్పీ శ్రీనివాసరావు సైతం చిన్నగురువళూరు పోలింగ్ కేంద్రానికి చేరుకుని అక్కడి స్పెషల్ పోలీసులపై నోరు పారేసుకున్నారు. తెలుగు రాని వారిని పెడితే ఇదే ఇబ్బందన్నారు. దీనిపై అక్కడున్న స్థానిక సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలింగ్ కేంద్రంలో ఇబ్బంది కలిగిస్తున్నారనే బయటికి పంపించాల్సి వచ్చిందన్నారు. అనంతరం దీంతో ఖంగుతున్న మంత్రి ఆది, అభ్యర్థి పుట్టా కాసేపటికి వెనుదిరిగి వెళ్లిపోయారు.
Comments
Please login to add a commentAdd a comment