విషాదం | The tragedy | Sakshi
Sakshi News home page

విషాదం

Published Mon, Sep 22 2014 2:27 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

విషాదం - Sakshi

విషాదం

చాపాడు: మండల పరిధిలోని చాపాడు-వెదురూరు మధ్య ఉన్న కొత్తరాజుపేట గ్రామం వద్ద ఆదివారం మధ్యాహ్నం ఎదురెదురుగా వస్తున్న ఆటో-బైక్ ఢీ కొని మండలంలోని కుచ్చుపాప గ్రామానికి చెందిన రైతు నంద్యాల కృష్ణయ్య(57), తూర్పు అనంతపురం గ్రామానికి చెందిన ఆర్టీపీపీ ఉద్యోగి కుండ గంగయ్య(32), బీటెక్ విద్యార్థి మైలా హరికృష్ణ(22) దుర్మరణం చెందారు. వీరితో పాటు అనంతపురం గ్రామానికి చెందిన వీరభద్రుడు(23), నక్కలదిన్నెకు చెందిన రమేష్(34)అనే వ్యక్తులు గాయపడ్డారు. అనంతపురం గ్రామానికి చెందిన మైలా రాజగోపాల్-గంగమ్మల రెండో కుమారుడు హరికృష్ణ ప్రొద్దుటూరులోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ విద్యార్థి ఆదివారం మధ్యాహ్నం ఆర్టీపీపీలో ఉద్యోగం చేస్తున్న ఇదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు కుండ గంగయ్యను బైక్‌పై బస్టాప్ వద్ద వదిలేందుకు చాపాడుకు బయలుదేరారు. ఇదే సమయంలో కుచ్చుపాప గ్రామానికి చెందిన రైతు నంద్యాల కృష్ణయ్య ఎరువుల కోసం చాపాడుకు వచ్చి తిరిగి ఆటోలో గ్రామానికి బయలుదేరాడు. ఈ క్రమంలో రాజువారిపేట వద్ద ఎదురెదురుగా వస్తున్న బైక్, ఆటోలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో బైక్‌పై పడింది. దీంతో బైక్‌పై ఉన్న ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. ఆటోలో ఉన్న ఎరువుల బస్తాలు రైతు కృష్ణయ్యపై పడ్డాయి. అతన్ని ఆటో నుంచి బయటికి తీసుకురాగా కొద్ది నిమిషాలలో మృతి చెందాడు. ఇతనితో పాటు ఆటోలో ప్రయాణిస్తున్న వీరభద్రుడు, రమేష్‌లకు గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ భాస్కర్‌రెడ్డి, ఎస్‌ఐ గిరిబాబులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసుకుని మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అంతకుముందే గాయపడిన వారిని చికిత్స నిమిత్తం అదే ఆసుపత్రికి తీసుకెళ్లారు.
  బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న హరికృష్ణ చనిపోవటంతో తల్లిదండ్రులు గంగయ్య, గంగ మ్మల వేదన వర్ణనాతీతంగా మారింది.
  కుండ గంగయ్య అనంతపురం గ్రామంలోని పోతులూరయ్య కూతురిని వివాహం చేసుకుని అక్కడే గత కొన్నేళ్లుగా నివాసం ఉంటూ ఆర్టీపీపీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం ఉద్యోగరీత్యా వెళుతూ మృతి చెందటంతో భార్య సౌదామణి, ఏడేళ్ల, ఐదేళ్ల కుమారులు చంద్రమౌలి, కిషోర్‌లు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
  వ్యవసాయం చేసుకుని కుటుంబాని పోషిస్తున్న రైతు కృష్ణయ్య ఎరువుల కోసం వచ్చి మృత్యువాత పడటంతో అతని కుమారులు, భార్య విలపించారు.
 ప్రమాద స్థలం వద్ద వైఎస్సార్‌సీపీ
 నాయకులు
 మండలంలోని కొత్తరాజువారిపేట గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న ఆయా ప్రాంతాల వైఎస్సార్‌సీపీ నాయకులు సంఘటనా స్థలం వద్దకు చేరుకొని పలు రకాలైన సహాయక చర్యలు చేపట్టారు. మండల బీసీ కన్వీనర్ బిర్రు రామచంద్రయ్య, నక్కలదిన్నెకు చెందిన మహేశ్వరరెడ్డి, అనంతపురం గ్రామానికి  చెందిన సీవీ సుబ్బారెడ్డి, జయరామిరెడ్డి, కుచ్చుపాప మాజీ సర్పంచ్ లక్షుమయ్య, రాజువారిపేటకు చెందిన జయసుబ్బారెడ్డిలతో పాటు ఇంకా పలువురు మృతులు, గాయపడిన వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement