రైతును బూటు కాలితో తంతావా..?
► ఎస్‌ఐ తీరుపై ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆగ్రహం
► అవినీతే ఎస్‌ఐ ధ్యేయం అంటూ మండిపాటు
చాపాడు: దేశానికి అన్నం పెట్టే రైతులంటే అంత చులకనా.. ఏ నేరం చేయకపోయినా అన్యాయంగా, విచక్షణా రహితం గా బూటు కాలితో తంతావా.. అంటూ చాపాడు ఎస్ఐ శివశంకర్‌పై మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేయడంతో పాటు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్న ఎస్‌ఐపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాను పండించిన కూరగాయలను విక్రయించుకునేందుకు మోటార్ బైకుపై వెళుతున్న రైతు రామచంద్రారెడ్డిని ఎస్‌ఐ బూటు కాలితో తన్నడం దారుణమన్నారు.
రైతు వద్ద వాహనానికి సంబంధించిన ఆర్సీ, లైసెన్స్ ఉన్నప్పటికీ దురుసుగా ప్రవర్తించడం, అసభ్యపదజాలంతో దూషించడం మంచి పద్ధతి కాదన్నారు. ఎదుటివారి కుటుంబీకులను ఉద్దేశించి దూషించే సమయంలో తమ కుటుంబం గురించి కూడా ఆలోచించాలని ఆయన హితవు పలికారు. మండలానికి వచ్చిన రెండేళ్లలో ఎస్‌ఐ లక్షలాది రూపాయలు అక్రమంగా సంపాదించాడని, ప్రతి రోజూ ఇసుక ట్రాక్టర్ల ద్వారా అక్రమ వసూళ్లు చేస్తున్నాడని ఆరోపించారు. తిప్పిరెడ్డిపల్లె, రాజుపాళెం ప్రాంతాల నుంచి ప్రతి రోజూ వెళుతున్న 100 ఇసుక ట్రాక్టర్ల నుంచి ట్రాక్టర్‌కు రూ.500 చొప్పున వసూలు చేస్తున్నాడని ఆయన అన్నారు.
డబ్బులు ఇవ్వకపోతే సంబంధిత ట్రాక్టర్ల యజమానులపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తాడన్నారు. ఇలా ప్రతి నెలా రూ.10 లక్షల నుంచి రూ.15లక్షల వరకు అక్రమంగా సంపాదిస్తున్నాడని, సంపాదనే లక్ష్యంగా అన్యాయంగా విధులు నిర్వర్తిస్తున్నాడని ధ్వజమెత్తారు. అనేక చోట్ల ఏసీబీ అధికారులు అవినీతి అధికారులను పట్టుకుంటున్నారని, ఎస్‌ఐపై నిఘా పెట్టి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఇలాంటి ఎస్ఐలను ప్రజల మధ్యలో పెట్టకుండా ఎక్కడికైనా లూప్ లైన్ లో పంపాలని కోరారు. ఎస్ఐపై పోలీసు ఉన్నతాధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.