ఫ్రీగా వస్తే..
ఫ్రీగా వస్తే..
Published Sun, Jan 1 2017 10:36 PM | Last Updated on Tue, Sep 5 2017 12:08 AM
చాపాడు: ఫ్రీగా వస్తే ఫినాయిల్ అయినా తాగుతారు అంటూ కొందరిని ఉద్దేశించి అంటుంటాం.. అవును అలాంటి సంఘటనే ఇది.. డీజిల్ ట్యాంకర్ బోల్తా పడి డ్రైవర్.. క్లీనర్ ఆసుపత్రి పాలైతే.. అయ్యో..పాపం అంటూ సానుభూతి చూపాల్సింది పోయి.. మీరేమైపోతే మాకేం.. అంటూ కొందరు కక్కుర్తిపరులు బోల్తాపడిన డీజిల్ ట్యాంకర్ నుంచి డీజిల్‌ను ఎత్తుకుపోవడం మొదలుపెట్టారు. ఒకరిని చూసి మరొకరు.. ఇలా డీజిల్ తీసుకెళ్లే వారి సంఖ్య క్రమక్రమంగా పెరిగింది. ఈ దృశ్యాన్ని చూసి ఆ దారిన వెళ్లేవారు సైతం మేమేం తక్కువ తిన్నామా అంటూ వారికి అందుబాటులో ఉన్న క్యాన్లు, బాటిళ్లలో డీజిల్‌ను తీసుకుని వెళ్లారు. కొందరు లీటరు బాటిల్ తెచ్చుకుంటే మరికొందరు ఐదులీటర్లు.. ఇంకొందరు ఏకంగా 20 లీటర్ల క్యాన్లు.. ప్లాస్టిక్ బిందెలు తీసుకొచ్చి డీజిల్ తీసుకెళ్లారు. శనివారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో చాపాడు మండలం నాగులపల్లె వద్ద డీజిల్ ట్యాంకర్ బోల్తాపడిన సంఘటనలో డ్రైవర్, క్లీనర్ ఆసుపత్రి పాలు కాగా, ఇలా కొందరు డీజిల్ ఎత్తుకెళ్లారు. ఆ తర్వాత విషయం తెలుసుకున్న ఎస్‌ఐ శివశంకర్ అక్కడ పోలీసులను నియమించడంతో డీజిల్ ఎత్తుకెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు.
Advertisement
Advertisement