అగస్సీ సరసన జొకోవిచ్
ప్రపంచ టెన్నిస్ రెండో ర్యాంకర్ నొవాక్ జొకోవిచ్ (సెర్బియా) ఈ ఏడాది తన ఖాతాలో తొలి టైటిల్‌ను జమచేసుకున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం అర్ధరాత్రి దాటాక జరిగిన ఇండియన్ వెల్స్ మాస్టర్స్ సిరీస్ టోర్నమెంట్ ఫైనల్లో జొకోవిచ్ 3-6, 6-3, 7-6 (7/5)తో రోజర్ ఫెడరర్ (స్విట్జర్లాండ్)ను ఓడించాడు.
జొకోవిచ్ కెరీర్లో ఓవరాల్‌గా ఇది 42వ టైటిల్. ఇందులో 17 మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ ఉన్నాయి. ఈ క్రమంలో అత్యధికంగా మాస్టర్స్ సిరీస్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారుల జాబితాలో ఆండ్రీ అగస్సీ (అమరికా) సరసన జొకోవిచ్ మూడో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో రాఫెల్ నాదల్ (26 టైటిల్స్), ఫెడరర్ (21 టైటిల్స్) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఫెడరర్‌తో జరిగిన ఫైనల్లో జొకోవిచ్ మూడో సెట్లో 4-5తో వెనుకబడ్డాడు. పదో గేమ్‌లో తన సర్వీస్ నిలబెట్టుకొని ఉంటే ఫెడరర్‌కు టైటిల్ దక్కేది. అయితే పదో గేమ్‌లో ఫెడరర్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ స్కోరును సమం చేశాడు. ఆ తర్వాత టైబ్రేక్‌లోనూ పైచేయి సాధించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
విజేతగా నిలిచిన జొకోవిచ్‌కు 10 లక్షల డాలర్ల (రూ. 6 కోట్ల 9 లక్షలు) ప్రైజ్‌మనీ, 1000 ర్యాంకింగ్ పాయింట్లు... రన్నరప్ ఫెడరర్‌కు 5 లక్షల డాలర్ల (రూ. 3 కోట్ల 4 లక్షలు) ప్రైజ్‌మనీ, 600 ర్యాంకింగ్ పాయింట్లు లభించాయి