World Wrestling Federation
-
భారత రెజ్లింగ్ సమాఖ్యకు (WFI) షాక్.. సభ్యత్వం రద్దు
విశ్వవేదికపై భారత్‌కు అవమానం జరిగింది. యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య(UWW).. భారత రెజ్లింగ్ సమాఖ్య(WFI) సభ్యత్వాన్ని రద్దు చేసింది. సకాలంలో ఎన్నికలు నిర్వహించడంలో డబ్ల్యూఎఫ్ఐ విఫలమైనందుకు చర్యలు తీసుకున్నట్లు యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య ప్రకటించింది. యూడబ్ల్యూడబ్ల్యూ తీసుకున్న ఈ నిర్ణయంతో త్వరలో (సెప్టెంబర్ 16 నుంచి) ప్రారంభంకానున్న ఒలింపిక్ క్వాలిఫైయింగ్ వరల్డ్ ఛాంపియన్షిప్స్ పోటీల్లో భారత అథ్లెట్లుగా తటస్థ అథ్లెట్లుగా (భారత్ ట్యాగ్‌లైన్ లేకుండా) బరిలోకి దిగాల్సి ఉంటుంది. కాగా, డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై స్టార్ మహిళా రెజ్లర్లు చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో డబ్ల్యూఎఫ్ఐ వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. బ్రిజ్‌భూషణ్‌ను పదవి నుంచి తప్పించాలని రెజ్లర్లు తారాస్థాయిలో ఆందోళనలకు దిగడంతో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ డబ్ల్యూఎఫ్ఐ ప్యానెల్‌ను రద్దు చేసింది. ఆ తర్వాత డబ్ల్యూఎఫ్ఐ నిర్వహణ బాధ్యతను అడ్‌హక్ కమిటీకి అప్పగించింది. అయితే అడ్‌హక్ కమిటీ ఆధ్వర్యంలో ఎన్నికల నిర్వహణకు వరుసగా అవాంతరాలు ఎదురవుతూ వచ్చాయి. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాది (2023) మే 7న ఎలక్షన్స్ జరగాల్సి ఉండింది. అయితే అప్పుడు క్రీడా మంత్రిత్వ శాఖ ఎన్నికలను నిలిపి వేసింది. ఆతర్వాత చాలా తేదీలు మారుతూ వచ్చాయి. ఈ మధ్యలో ఓటు హక్కు కోసం పలు సంఘాలు కోర్టుకెక్కాయి. చివరగా ఆగస్టు 12న ఎన్నికలు నిర్వహిస్తామని అడ్‌హక్ కమిటీ ప్రకటించగా.. పంజాబ్-హర్యానా హైకోర్టు ఈ ఎన్నికలపై స్టే విధించింది. దీంతో ఎన్నికలు మరోసారి వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ సమాఖ్య.. భారత రెజ్లింగ్ సమాఖ్యపై వేటు వేసింది. -
'45 రోజుల్లో ఎన్నికలు నిర్వహించకపోతే వేటు తప్పదు'
స్విట్జర్లాండ్: భారత స్టార్ రెజ్లర్లపై పోలీసు చర్యను ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) తీవ్రంగా ఖండించింది. టాప్స్టార్లపై పోలీసు జులుంపై విచారం వ్యక్తం చేసింది. తమ సమాఖ్య కొన్ని నెలలుగా భారత్‌లోని రెజ్లర్ల నిరసన కార్యక్రమాలను నిశితంగా గమనిస్తోందని తెలిపింది. లైంగిక వేధింపులకు పాల్పడిన భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ను అరెస్టు చేయాలనే డిమాండ్‌తో ఒలింపిక్, ఆసియా క్రీడల పతక విజేతలు సాక్షి మలిక్, వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియా తదితరులు చేస్తున్న నిరసన తమ దృష్టికి వచ్చిందని యూడబ్ల్యూడబ్ల్యూ ఈ సందర్భంగా తెలిపింది. గతంలో ప్రకటించినట్లుగా 45 రోజుల్లోగా డబ్ల్యూఎఫ్ఐకి ఎన్నికలు నిర్వహించి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేయకపోతే సస్పెన్షన్ వేటు తప్పదని ఈ సందర్భంగా ప్రపంచ సమాఖ్య హెచ్చరించింది. -
సుశీల్ కుమార్ ఎక్కడ?
న్యూఢిల్లీ: రెజ్లింగ్ స్టార్, ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన ఏకైక భారతీయుడైన సుశీల్ కుమార్ పరారీ వ్యవహారం సీరియస్‌గా మారింది. యువ రెజ్లర్ సాగర్ రాణా హత్యోదంతానికి సంబంధించి సుశీల్‌పై ఢిల్లీ పోలీసులు ‘లుక్ అవుట్’ నోటీసులు జారీ చేశారు. గత మంగళవారం ఘటన జరిగిన తర్వాత ఎవరికీ అందుబాటులో లేని సుశీల్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఆదివారం సాయంత్రం ‘లుక్ అవుట్’ నోటీసు ఇచ్చినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు స్పష్టం చేశారు. పోలీసు ఎఫ్ఐఆర్లో సుశీల్ పేరు ఉండటంతో అతడిని పట్టుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించి విఫలమయ్యామని వారు చెప్పారు. ఢిల్లీ–ఎన్సీఆర్తో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా సుశీల్ కోసం వెతికామని వెల్లడించారు. ఈ ఘటనలో బాధితుల స్టేట్మెంట్ను పోలీసులు ఇప్పటికే రికార్డు చేశారు. ఛత్రశాల్ స్టేడియం పార్కింగ్ వద్ద ఇరు వర్గాలు కొట్టుకున్న ఘటనలో 23 ఏళ్ల జాతీయ మాజీ జూనియర్ చాంపియన్ సాగర్ రాణా తీవ్రంగా గాయపడి ఆపై మృతి చెందాడు. ఆ సమయంలో సుశీల్ అక్కడే ఉన్నాడని సాక్షులు చెప్పారు. తన గురించి బహిరంగంగా చెడుగా మాట్లాడుతున్న రాణాకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో అతని ఇంటినుంచి లాక్కొని వచ్చి మరీ సుశీల్, అతని అనుచరులు కొట్టారని కూడా మరికొందరు సాక్ష్యమిచ్చారు. రెజ్లింగ్ పరువు పోయింది: డబ్ల్యూఎఫ్ఐ రెండు ఒలింపిక్ పతకాలతో పాటు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఏకైక భారతీయుడైన సుశీల్ కుమార్ ఇప్పుడు హత్య కేసులో పరారీలో ఉండటం దురదృష్టకరమని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ అన్నారు. ఒకప్పుడు ఒంటి చేత్తో భారత రెజ్లింగ్ స్థాయిని పెంచి ఎందరితో ఆదర్శంగా నిలిచిన సుశీల్ ఇలా కావడం బాధగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తాజా ఘటన సుశీల్‌కు వ్యక్తిగతంగానే కాకుండా భారత రెజ్లింగ్ మొత్తానికి చెడ్డ పేరు తెచ్చిందని తోమర్ అభిప్రాయ పడ్డారు. రెజ్లర్లు అంటే గూండాలనే భావన మళ్లీ నెలకొంటుందని తోమర్ ఆందోళన వ్యక్తం చేశారు. -
ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య నుంచి లైన్ క్లియర్
భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ రియో వెళ్లేందుకు మరో కీలక అడ్డంకి తొలగింది. ఒలింపిక్స్‌లో పాల్గొనేందుకు ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య (యూడబ్ల్యూడబ్ల్యూ) అనుమతి ఇచ్చింది. ‘నాడా’ విచారణలో నిర్దోషిగా తేలిన వెంటనే భారత రెజ్లింగ్ సమాఖ్య యూడబ్ల్యూడబ్ల్యూకు లేఖ రాసింది. ‘ఒలింపిక్స్ సహా ఏ ఇతర అంతర్జాతీయ పోటీల్లోనైనా నర్సింగ్ పాల్గొనవచ్చు. అతను చాలా ముందుగా ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు’ అని యూడబ్ల్యూడబ్ల్యూ ప్రకటించింది. మరో వైపు ‘వాడా’నుంచి స్పందన రావాల్సి ఉన్నా... ప్రస్తుతానికి రియో బయల్దేరేందుకు నర్సింగ్ సిద్ధమయ్యాడు. -
కండలరాణి అనుమానాస్పద మృతి!
ప్రపంచ ప్రఖ్యాత మహిళా రెజ్లర్ జోన్ లారెర్ (46) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందింది. వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్టైన్మెంట్ (డబ్ల్యూడబ్ల్యూఈ)లో చెయ్నా పేరుతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న ఆమె బుధవారం కాలిఫోర్నియాలోని తన నివాసంలో విగతజీవిగా కనిపించింది. మాదక ద్రవ్యాలు అతిగా తీసుకోవడం వల్లే ఆమె మృతిచెంది ఉంటుందని భావిస్తున్నారు. చెయ్నా చనిపోయిన విషయాన్ని ఆమె ట్విట్టర్ అధికారిక పేజీలో ప్రకటించారు. 1997లో కండలరాణిగా డబ్ల్యూడబ్ల్యూఈలో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆమె ఎన్నో సంచలనాలు సృష్టించింది. అప్పట్లో డబ్ల్యూడబ్ల్యూఈ పేరు.. వరల్డ్ రెజింగ్ల్ ఫెడరేషన్ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్)గా ఉండేది. ఈ కుస్తీ క్రీడలో ట్రిపుల్ హెచ్‌గా పేరొందిన పాల్ మైఖేల్ లావెస్క్యూతో కలిసి అద్భుతమైన పోరాట పటిమ చూపెట్టింది. తనదైన పంచులతో ప్రత్యర్థలకు హడల్ పుట్టించి 2001 సంవత్సరంలో వుమెన్ చాంపియన్ షిప్ సాధించింది. అంతర్జాతీయ ర్లెజింగ్ చాంపియన్ షిప్ సాధించిన మొదటి మహిళగా చెయ్నా చరిత్ర సృష్టించింది. 1999లో, 2000లో వరుసగా ఆమె రెండుసార్లు ఇంటర్ కాంటినెంటల్ చాంపియన్‌షిప్ ను సొంతం చేసుకుంది. ఆమె మృతి పట్ల అభిమానులు, సాటి ర్లెజింగ్ క్రీడాకారులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.