పోలెండ్
చరిత్ర: 10వ శతాబ్దం నుండి తన ఉనికిని చాటుకుంటూ వస్తున్న పోలెండ్ దేశం అనేక శతాబ్దాలపాటు వలసవాదుల అధిపత్యంలో మగ్గింది. దేశ సరిహద్దులు బలహీనంగా ఉండడం వల్ల ఇతర దేశాల వాళ్లు చాలా సులువుగా దేశంలోకి ప్రవేశించేవారు. 18వ శతాబ్దంలో ప్రపంచ పటం నుండి పోలెండ్ మాయమైపోయింది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత పోలెండ్ తిరిగి తన ఉనికిని చాటుకుంటూ వస్తోంది. హిట్లర్ సేనలు పోలెండ్‌ను తన అధీనంలోకి తీసుకొని రెండో ప్రపంచ యుద్ధం దాకా అధిపత్యాన్ని కొనసాగించింది. ఈ రెండు యుద్ధాల సమయంలో వేలాదిమంది పౌరులు, అధికారులు ఊచకోతకు గురయ్యారు. అటు రష్యా, ఇటు జర్మనీ సేనల మధ్య పోలెండ్ ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. పోలిష్ హోమ్ ఆర్మీ ప్రాణాలకు తెగించి దేశాన్ని తిరిగి తమ అధీనంలోకి తెచ్చుకుంది.
1. మాసూరియన్ సరస్సులు: పోలెండ్ దేశంలో దాదాపు 3000 సరస్సులు ఉన్నాయి. ముఖ్యంగా మాసూరియా సరస్సు యాత్రికులకు స్వర్గం లాంటిది. దట్టమైన అడవులు, సరస్సులను కలిసే చిన్న చిన్న నదులతో ప్రయాణికులకు ఎంతో అందంగా కనబడుతుంది. ఈ సరస్సు పోలెండ్ దేశానికి ఉత్తరంలో, లిథువేనియా, రష్యా దేశాల సరిహద్దులలో ఉంది. ఇక్కడ అందమైన గుహలు, అందమైన చర్చిలు, గతరాజుల నివాస భవనాలు ఎన్నో కనబడతాయి. ఈ ప్రదేశమే ఒకప్పుడు హిట్లర్ యుద్ధకేంద్రంగా వెలుగొందింది.
2. స్లోవిన్‌స్కీ ఇసుక తిన్నెలు: దేశానికి ఉత్తర భాగంలో స్లోవెన్‌స్కీ జాతీయ పార్కులో ఈ ఇసుక తిన్నెలు దర్శనమిస్తాయి. ఎవరో తీర్చిదిద్దినట్లుగా కనబడే ఈ ఇసుక తిన్నెలు చూపరులను ఎంతో ఆశ్చర్యానికి గురిచేస్తాయి. పక్కనే బాల్టిక్ సముద్రం ప్రశాంతంగా కనబడుతుంది. ఈ ఇసుక తిన్నెలు గాలి వీచడం ద్వారా ఏర్పడతాయి. ఇవి ఒక్కొక్కసారి 30 మీటర్లు ఎత్తు వరకు ఏర్పడతాయి.
3. క్రాకోవ్ నగరం: పోలెండ్ దేశంలో ఉన్న అత్యంత పురాతన నగరాలలో ఇది ఒకటి. ఇది విస్తులా నదీతీరంలో నిర్మింపబడింది. లెస్సర్ పోలెండ్ ప్రాంతంలో ఉంది. క్రీ.శ. 7వ శతాబ్దంలో ఇది మొదటగా నిర్మింపబడిందని చరిత్ర చెబుతోంది. 9వ శతాబ్దంలో స్లావోనిక్ యూరప్ దేశాలతో గొప్ప వ్యాపార కేంద్రంగా విలసిల్లింది. ఇక్కడ ఎనిమిది మిలియన్లకు పైగా జనాభా ఉంది.
1978లో ఈ నగరాన్ని యునెస్కో సంస్థ ప్రపంచ వారసత్వ నగరంగా ప్రకటించింది. ఈ నగరంలో వావెల్ కెథడ్రాల్, రాయల్ కేజిల్, ఎప్పుడూ నిండుగా పారుతూ ఉండే విస్తులా నది, సెయింట్ మేరీస్ బాసిలికా, జగిలోనియన్ విశ్వవిద్యాలయం, క్లాత్‌హల్, ప్యాలస్ ఆర్ట్, కనోనిక్జా వీధి, పావిలాన్ విస్పియన్‌స్కీ... ఇంకా మరెన్నో చూడదగ్గ స్థలాలు ఉన్నాయి.
4. వార్సా: ఇది పోలెండ్ దేశానికి రాజధాని. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ నగరం అభివృద్ధిలో ఊపందుకుంది. ఐరోపా దేశాలలో గొప్ప టూరిస్ట్ నగరంగా ప్రసిద్ధి చెందింది. ప్రతి ఏటా లక్షలాది మంది ఈ నగర సందర్శనకు వస్తూ ఉంటారు. నగరం మధ్య నుండి విస్తులా నది పారుతూ ఉంటుంది. 13వ శతాబ్దంలో ఈ నగరం నిర్మించబడిందని చరిత్ర చెబుతోంది. నగరంలో చాలావరకు భవనాలు నాలుగైదు అంతస్తుల్లో రంగుల్లో కనబడతాయి. నగరంలోని పురాతన మార్కెట్ స్థలం అత్యంత పురాతనమైంది. ఇక్కడ అన్ని రకాల వస్తువులు లభ్యమవుతాయి. నగరంలో ఐరోపా సంస్కృతి బాగా కనబడుతుంది. నగరంలో ఓల్డ్‌టౌన్, రాయల్‌రూట్, చోపిన్ మ్యూజియం, జ్యుయిస్ ఘెట్టో మొదలైన ఎన్నోప్రదేశాలు చూపరులను ఆకట్టుకుంటాయి.
5. వ్రోక్లా ద్వీపకల్పాల నగరం: వ్రోక్లా నగరం లోయర్ సిలేసియా ప్రాంతానికి రాజధాని. ఈ నగరం చిన్న చిన్న ద్వీపాల సముదాయం. ఒక్కొక్క ద్వీపాన్ని కలపడానికి ఒక బ్రిడ్జి చొప్పున నగరం మొత్తంలో 100కు పైగా బ్రిడ్జిలు కనబడతాయి. ఇది దేశానికి దక్షిణ-పశ్చిమ భాగంలో ఉంది. ఇదొక పురాతన నగరం. ఇక్కడే ఓద్రా నది ప్రవహిస్తుంది. దీని ఉపనదులే ఈ నగరాన్ని చిన్న చిన్న ద్వీపాలుగా మార్చేశాయి. ఈ నగరంలో మొత్తం 25 మ్యూజియంలు ఉన్నాయి. సెయింట్ జాన్ కెథడ్రాల్, నగరాన్ని ఆనుకొని సుడెటెన్ పర్వతాలు పరుచుకొని ఉండి చూడడానికి ఎంతో ఆహ్లాదంగా ఉంటాయి.
పరిపాలనా విభాగాలు: దేశాన్ని పరిపాలనా సౌలభ్యం కోసం 16 ప్రాంతాలుగా విభజించారు. ప్రాంతాన్ని పోలెండ్ భాషలో ‘వైవోడేషిప్’ అంటారు. ఈ 16 ప్రాంతాలను తిరిగి 379 పోవియట్‌లుగా, వీటిని మళ్ళీ 2478 జిమినాస్‌లుగా విభజించారు. పోలిష్ భాష నోరు తిరగనంత కఠినంగా ఉంటుంది. ఆ పేర్లను ఇంగ్లిష్‌లోకి తర్జుమా చేసి చెప్పుకుంటే బాగుంటుంది. 16 ప్రాంతాలు... గ్రేటర్ పోలెండ్, కువాయియణ్-పొమెరేనియన్, వెస్సర్ పోలెండ్, లోడ్జ్, లోయర్ సిలేసియన్, లుబ్లిన్, లుబుజ్, మాసోవియన్, ఒపోలే, పోడ్లాస్కీ, పోమరేనియన్, సిలేసియన్, సబ్‌కార్ఫాథియన్, స్వీటోక్రిజస్కీ. వార్మియన్-మాసూరియన్, వెస్ట్‌పోమరేనియన్. దేశంలో మొత్తం 20 పెద్ద నగరాలు, పట్టణాలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి... వార్సా, క్రాకో, లోడ్జ్, వరోక్లా, పోజ్నన్, జిడాన్సక్, సెజెసిన్, బిడ్‌గోసెజ్, లుబ్లిన్, కటోవైస్, బైలిస్టాక్, జిడినియా, జెస్లోకోవా, రాడోమ్, సోస్నావిక్, టోరున్, కీలెస్, గ్లివైస్, జెస్జోన్, జబ్రెజ్.
ప్రజలు - సంస్కృతి: పోలెండ్ దేశానికి వెయ్యి సంవత్సరాల చరిత్ర ఉంది. ఎక్కువగా యూరోపియన్ సంస్కృతి కనబడుతుంది. ఇక్కడ మత సహనం అధికం. ప్రజలందరికీ సమానమైన హక్కులు ఉంటాయి. స్త్రీ, పురుష సమానత్వాన్ని పాటిస్తారు. ఉంది. పోలెండ్ ప్రజలను పోల్స్ అంటారు. దాదాపు 98 శాతం ప్రజలు పోలిష్ భాషను మాట్లాడతారు. దేశంలో జర్మన్లు, ఉక్రేనియన్లు, బెలారూసియ+న్లు, జిప్సీలు, లిధువేనియన్‌లు, జ్యుయిష్‌లు కూడా ఉన్నారు. ఇలా దేశంలో విభిన్న దేశాలకు చెందిన వారు ఉండడం వల్ల దేశమంతటా విభిన్నమైన సంస్కృతి, సంప్రదాయాలు కనబడతాయి.
నైసర్గిక స్వరూపం
ఖండం - ఐరోపా
వైశాల్యం - 3,12,679 చ.కి.మీ.
జనాభా - 3,84,83,957 (తాజా అంచనాల ప్రకారం),
రాజధాని- వార్సా, కరెన్సీ - పోలిష్ జోలోటీ,
ప్రభుత్వం - పార్లమెంటరీ రిపబ్లిక్, అధికారిక భాష- పోలిష్,
మతం - 97 శాతం క్రైస్తవులు,
సరిహద్దులు - బాల్టిక్ సముద్రం, రష్యా, తూర్పు జర్మనీ, చెకోస్లోవేకియా,
స్వాతంత్య్ర దినాలు - కమ్యూనిస్ట్ పోలెండ్ - 8 ఏప్రిల్ 1945, రిపబ్లిక్ ఆఫ్ పోలెండ్ - 13 సెప్టెంబర్ 1989,
పంటలు- తృణధాన్యాలు, చెరకు, నూనెగింజలు, బంగాళదుంపలు,
ఖనిజాలు- బొగ్గు, సల్ఫర్, రాగి, జింకు, సీసం, ఇనుము,
పరిశ్రమలు - యంత్రభాగాలు, బొగ్గు, రసాయనాలు, పెట్రోలియం శుద్ధి, ఆహార ఉత్పత్తులు,
వాతావరణం - జనవరిలో -5 నుండి 0 (సున్న) డిగ్రీలు, 15 నుండి 25 డిగ్రీలు జూలైలో