Wrestler Sushil
-
రెజ్లర్ సుశీల్‌పై ఎఫ్ఐఆర్
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత సుశీల్ కుమార్‌తో పాటు అతడి మద్దతు దారులపై ఢిల్లీ పోలీసులు శనివారం ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. కామన్వెల్త్ గేమ్స్‌లో పాల్గొనే భారత రెజ్లర్ల సెలెక్షన్ ట్రయల్స్ సందర్భంగా శుక్రవారం సుశీల్, మరో రెజ్లర్ ప్రవీణ్ రాణా మద్దతుదారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. వివాదం కెమెరాల్లో రికార్డయి పోలీసుల వరకు చేరింది. ఈ నేపథ్యంలో సుశీల్, అతని మద్దతుదారులపై ఐపీసీ సెక్షన్ 341 (తప్పుడు పద్ధతుల్లో అడ్డుకోవడం), సెక్షన్ 323 (ఉద్దేశపూర్వకంగా కించపరచడం) కింద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ట్రయల్స్‌లో భాగంగా సెమీఫైనల్ బౌట్ అనంతరం సుశీల్ మద్దతుదారులు తనపై, తన అన్నయ్యపై దాడి చేసి చంపుతామని బెదిరించినట్లు ప్రవీణ్ రాణా ఆరోపించిన సంగతి తెలిసిందే. మరోవైపు ఎఫ్ఐఆర్ నమోదును ఢిల్లీ సెంట్రల్ డీసీపీ మన్‌దీప్‌సింగ్ రణ్‌ధవా ధ్రువీకరించారు. ఘటనపై విచారణ జరుపుతున్నట్లు తెలిపారు. -
రెజ్లర్ సుశీల్ ఆశలు ఆవిరి
► ట్రయల్స్‌పై పిటిషన్ కొట్టివేత ► నర్సింగ్కు తొలగిన అడ్డంకి న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు న్యాయ పోరాటం చేస్తున్న రెజ్లర్ సుశీల్ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. నర్సింగ్ యాదవ్‌తో తనకు సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో కొన్ని వారాలుగా కొనసాగుతున్న వివాదానికి ముగింపు లభించినట్టయ్యింది. కోర్టు నిర్ణయంతో సుశీల్ ఒలింపిక్స్ ఆశలు ఆవిరి కాగా అటు నర్సింగ్ యాదవ్‌కు లైన్ క్లియర్ అయినట్టే. ఇప్పుడు ట్రయల్స్ నిర్వహిస్తే నర్సింగ్ యాదవ్ అవకాశాలు ప్రమాదంలో పడతాయని, అంతిమంగా దేశం నష్టపోతుందని కోర్టు అభిప్రాయపడింది. 66కేజీ విభాగంలో సుశీల్ అంతర్జాతీయంగా అనేక పతకాలు సాధించాడని, అయితే 74కేజీ విభాగంలో అతడిని ఒలింపిక్స్‌కు పంపలేమని జడ్జి మన్మోహన్ అన్నారు. ‘ట్రయల్స్ నిర్వహించి గెలిచిన వారిని రియోకు పంపాలని సుశీల్ కోరడం న్యాయ విరుద్ధం. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలవాలంటే కండ బలం సరిపోదు. బుద్ధి బలం కూడా కీలకమే. చివరి నిమిషంలో జరిగిన ఎంపిక ఆటగాడి మానసిక సన్నాహకాలను చెడగొడుతుంది. క్వాలిఫికేషన్ ఈవెంట్ ముగిశాక ఇప్పుడు ట్రయల్స్ కోరడం సబబు కాదు. నర్సింగ్ యాదవ్ బెర్త్ సాధించాక అప్పటి నుంచి సన్నాహకాల్లో ఉన్నాడు. అందుకే దేశం తరఫున అతడే ఉత్తమ పోటీదారుడు. జాతి ప్రయోజనార్ధం సుశీల్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం’ అని జడ్జి స్పష్టం చేశారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్ఐ) తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదని కోర్టు తేల్చింది. డబ్ల్యుఎఫ్ఐ ఉపాధ్యక్షుడికి నోటీసు: తప్పుడు అఫిడవిట్ సమర్పించిన డబ్ల్యుఎఫ్ఐ సీనియర్ ఉపాధ్యక్షుడు రాజ్ సింగ్‌కు నోటీసు జారీ చేసింది. అసత్య కథనాలపై ఎందుకు చర్య తీసుకోరాదో ఈనెల 29లోగా సమాధానమివ్వాలని పేర్కొంది. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌కు 48కేజీ గ్రీకో రోమన్ విభాగంలో రెజ్లర్‌ను పంపేందుకు ట్రయల్స్ నిర్వహించామని, ఆ సమయంలో తానే ప్రధాన కోచ్‌గా ఉన్నానని రాజ్ సింగ్ తన అఫిడవిట్లో పేర్కొన్నారు. అయితే అప్పుడు ట్రయల్స్ నిర్వహించలేదని, రాజ్ సింగ్ కూడా కోచ్‌గా లేరని సమాఖ్య కోర్టుకు తెలిపింది. డబుల్ బెంచ్‌కు అప్పీల్ చేస్తాం’: ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైన రెజ్లర్ సుశీల్ ఆఖరి ప్రయత్నంగా అదే కోర్టులో డబుల్ బెంచ్‌కు అప్పీల్ చేసుకోనున్నాడు. అయితే అంతకన్నా ముందు మరోసారి రెజ్లింగ్ సమాఖ్యను కలవాలని నిర్ణయించుకున్నాడు. ‘ట్రయల్స్ నిర్వహించాల్సిందిగా చివరిసారిగా డబ్ల్యుఎఫ్‌ఐని అడగనున్నాం. ఒకవేళ ఇది కార్యరూపం దాల్చకపోతే డబుల్ బెంచ్‌కు అప్పీల్ చేస్తాం’ అని తన సన్నిహిత వర్గాలు తెలిపాయి. -
సుశీల్‌కు నిరాశే!
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ బెర్త్ విషయంలో రెజ్లర్ సుశీల్ కుమార్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. నర్సింగ్ యాదవ్‌తో ట్రయల్స్ నిర్వహించాలన్న అతని వాదనను భారత రెజ్లింగ్ సమాఖ్య ) పెద్దగా పట్టించుకోలేదు. పైగా కోర్టు హియరింగ్ 27న జరిగే వరకూ జాతీయ క్యాంప్‌నకు కూడా సుశీల్ అనుమతించబోమని తెలిపింది. ఒలింపిక్ బెర్త్ సాధించిన నర్సింగ్‌నే పోటీలకు పంపనున్నట్లు సంకేతాలిచ్చింది. సమస్యను పరిష్కరించేందుకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన సమాఖ్య ప్రత్యేక కమిటీ బుధవారం సుశీల్‌తో సమావేశమైంది. ‘మేం సుశీల్‌కు ఒక్కటే చెప్పాం. అంతర్జాతీయ వేదికపై భారత రెజ్లింగ్ గుర్తింపు తెచ్చిన నిన్ను మర్చిపోలేం. దాన్ని మేం గౌరవిస్తాం. అయితే ఇక్కడ మరో రెజ్లర్ ఒలింపిక్ బెర్త్‌ను సాధించిపెట్టాడు. అలాగే నిలకడగా రాణిస్తున్నాడు. కాబట్టి అతన్ని గుర్తించకపోవడం కూడా సరైంది కాదు’ అని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్ పేర్కొన్నారు.