రెజ్లర్ సుశీల్ ఆశలు ఆవిరి
► ట్రయల్స్‌పై పిటిషన్ కొట్టివేత
► నర్సింగ్‌కు తొలగిన అడ్డంకి
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు న్యాయ పోరాటం చేస్తున్న రెజ్లర్ సుశీల్ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. నర్సింగ్ యాదవ్‌తో తనకు సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో కొన్ని వారాలుగా కొనసాగుతున్న వివాదానికి ముగింపు లభించినట్టయ్యింది. కోర్టు నిర్ణయంతో సుశీల్ ఒలింపిక్స్ ఆశలు ఆవిరి కాగా అటు నర్సింగ్ యాదవ్‌కు లైన్ క్లియర్ అయినట్టే. ఇప్పుడు ట్రయల్స్ నిర్వహిస్తే నర్సింగ్ యాదవ్ అవకాశాలు ప్రమాదంలో పడతాయని, అంతిమంగా దేశం నష్టపోతుందని కోర్టు అభిప్రాయపడింది. 66కేజీ విభాగంలో సుశీల్ అంతర్జాతీయంగా అనేక పతకాలు సాధించాడని, అయితే 74కేజీ విభాగంలో అతడిని ఒలింపిక్స్‌కు పంపలేమని జడ్జి మన్‌మోహన్ అన్నారు.
‘ట్రయల్స్ నిర్వహించి గెలిచిన వారిని రియోకు పంపాలని సుశీల్ కోరడం న్యాయ విరుద్ధం. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలవాలంటే కండ బలం సరిపోదు. బుద్ధి బలం కూడా కీలకమే. చివరి నిమిషంలో జరిగిన ఎంపిక ఆటగాడి మానసిక సన్నాహకాలను చెడగొడుతుంది. క్వాలిఫికేషన్ ఈవెంట్ ముగిశాక ఇప్పుడు ట్రయల్స్ కోరడం సబబు కాదు. నర్సింగ్ యాదవ్ బెర్త్ సాధించాక అప్పటి నుంచి సన్నాహకాల్లో ఉన్నాడు. అందుకే దేశం తరఫున అతడే ఉత్తమ పోటీదారుడు. జాతి ప్రయోజనార్ధం సుశీల్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం’ అని జడ్జి స్పష్టం చేశారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్‌ఐ) తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదని కోర్టు తేల్చింది.
డబ్ల్యుఎఫ్‌ఐ ఉపాధ్యక్షుడికి నోటీసు: తప్పుడు అఫిడవిట్ సమర్పించిన డబ్ల్యుఎఫ్‌ఐ సీనియర్ ఉపాధ్యక్షుడు రాజ్ సింగ్‌కు నోటీసు జారీ చేసింది. అసత్య కథనాలపై ఎందుకు చర్య తీసుకోరాదో ఈనెల 29లోగా సమాధానమివ్వాలని పేర్కొంది. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌కు 48కేజీ గ్రీకో రోమన్ విభాగంలో రెజ్లర్‌ను పంపేందుకు ట్రయల్స్ నిర్వహించామని, ఆ సమయంలో తానే ప్రధాన కోచ్‌గా ఉన్నానని రాజ్ సింగ్ తన అఫిడవిట్‌లో పేర్కొన్నారు. అయితే అప్పుడు ట్రయల్స్ నిర్వహించలేదని, రాజ్ సింగ్ కూడా కోచ్‌గా లేరని సమాఖ్య కోర్టుకు తెలిపింది.
డబుల్ బెంచ్‌కు అప్పీల్ చేస్తాం’: ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైన రెజ్లర్ సుశీల్ ఆఖరి ప్రయత్నంగా అదే కోర్టులో డబుల్ బెంచ్‌కు అప్పీల్ చేసుకోనున్నాడు. అయితే అంతకన్నా ముందు మరోసారి రెజ్లింగ్ సమాఖ్యను కలవాలని నిర్ణయించుకున్నాడు. ‘ట్రయల్స్ నిర్వహించాల్సిందిగా చివరిసారిగా డబ్ల్యుఎఫ్‌ఐని అడగనున్నాం. ఒకవేళ ఇది కార్యరూపం దాల్చకపోతే డబుల్ బెంచ్‌కు అప్పీల్ చేస్తాం’ అని తన సన్నిహిత వర్గాలు తెలిపాయి.