సుశీల్‌కు నిరాశే!
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ బెర్త్ విషయంలో రెజ్లర్ సుశీల్ కుమార్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. నర్సింగ్ యాదవ్‌తో ట్రయల్స్ నిర్వహించాలన్న అతని వాదనను భారత రెజ్లింగ్ సమాఖ్య ) పెద్దగా పట్టించుకోలేదు. పైగా కోర్టు హియరింగ్ 27న జరిగే వరకూ జాతీయ క్యాంప్‌నకు కూడా సుశీల్ అనుమతించబోమని తెలిపింది. ఒలింపిక్ బెర్త్ సాధించిన నర్సింగ్‌నే పోటీలకు పంపనున్నట్లు సంకేతాలిచ్చింది.
సమస్యను పరిష్కరించేందుకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన సమాఖ్య ప్రత్యేక కమిటీ బుధవారం సుశీల్‌తో సమావేశమైంది. ‘మేం సుశీల్‌కు ఒక్కటే చెప్పాం. అంతర్జాతీయ వేదికపై భారత రెజ్లింగ్ గుర్తింపు తెచ్చిన నిన్ను మర్చిపోలేం. దాన్ని మేం గౌరవిస్తాం. అయితే ఇక్కడ మరో రెజ్లర్ ఒలింపిక్ బెర్త్‌ను సాధించిపెట్టాడు. అలాగే నిలకడగా రాణిస్తున్నాడు. కాబట్టి అతన్ని గుర్తించకపోవడం కూడా సరైంది కాదు’ అని డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్ పేర్కొన్నారు.