W. Fi
-
రెజ్లర్ సుశీల్ ఆశలు ఆవిరి
► ట్రయల్స్‌పై పిటిషన్ కొట్టివేత ► నర్సింగ్కు తొలగిన అడ్డంకి న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్‌కు వెళ్లేందుకు న్యాయ పోరాటం చేస్తున్న రెజ్లర్ సుశీల్ కుమార్‌కు ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైంది. నర్సింగ్ యాదవ్‌తో తనకు సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించాలని కోరుతూ వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. దీంతో కొన్ని వారాలుగా కొనసాగుతున్న వివాదానికి ముగింపు లభించినట్టయ్యింది. కోర్టు నిర్ణయంతో సుశీల్ ఒలింపిక్స్ ఆశలు ఆవిరి కాగా అటు నర్సింగ్ యాదవ్‌కు లైన్ క్లియర్ అయినట్టే. ఇప్పుడు ట్రయల్స్ నిర్వహిస్తే నర్సింగ్ యాదవ్ అవకాశాలు ప్రమాదంలో పడతాయని, అంతిమంగా దేశం నష్టపోతుందని కోర్టు అభిప్రాయపడింది. 66కేజీ విభాగంలో సుశీల్ అంతర్జాతీయంగా అనేక పతకాలు సాధించాడని, అయితే 74కేజీ విభాగంలో అతడిని ఒలింపిక్స్‌కు పంపలేమని జడ్జి మన్మోహన్ అన్నారు. ‘ట్రయల్స్ నిర్వహించి గెలిచిన వారిని రియోకు పంపాలని సుశీల్ కోరడం న్యాయ విరుద్ధం. అంతర్జాతీయ స్థాయిలో పతకాలు గెలవాలంటే కండ బలం సరిపోదు. బుద్ధి బలం కూడా కీలకమే. చివరి నిమిషంలో జరిగిన ఎంపిక ఆటగాడి మానసిక సన్నాహకాలను చెడగొడుతుంది. క్వాలిఫికేషన్ ఈవెంట్ ముగిశాక ఇప్పుడు ట్రయల్స్ కోరడం సబబు కాదు. నర్సింగ్ యాదవ్ బెర్త్ సాధించాక అప్పటి నుంచి సన్నాహకాల్లో ఉన్నాడు. అందుకే దేశం తరఫున అతడే ఉత్తమ పోటీదారుడు. జాతి ప్రయోజనార్ధం సుశీల్ పిటిషన్‌ను కొట్టివేస్తున్నాం’ అని జడ్జి స్పష్టం చేశారు. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యుఎఫ్ఐ) తీసుకున్న నిర్ణయంలో ఎలాంటి తప్పు లేదని కోర్టు తేల్చింది. డబ్ల్యుఎఫ్ఐ ఉపాధ్యక్షుడికి నోటీసు: తప్పుడు అఫిడవిట్ సమర్పించిన డబ్ల్యుఎఫ్ఐ సీనియర్ ఉపాధ్యక్షుడు రాజ్ సింగ్‌కు నోటీసు జారీ చేసింది. అసత్య కథనాలపై ఎందుకు చర్య తీసుకోరాదో ఈనెల 29లోగా సమాధానమివ్వాలని పేర్కొంది. 1996 అట్లాంటా ఒలింపిక్స్‌కు 48కేజీ గ్రీకో రోమన్ విభాగంలో రెజ్లర్‌ను పంపేందుకు ట్రయల్స్ నిర్వహించామని, ఆ సమయంలో తానే ప్రధాన కోచ్‌గా ఉన్నానని రాజ్ సింగ్ తన అఫిడవిట్లో పేర్కొన్నారు. అయితే అప్పుడు ట్రయల్స్ నిర్వహించలేదని, రాజ్ సింగ్ కూడా కోచ్‌గా లేరని సమాఖ్య కోర్టుకు తెలిపింది. డబుల్ బెంచ్‌కు అప్పీల్ చేస్తాం’: ఢిల్లీ హైకోర్టులో చుక్కెదురైన రెజ్లర్ సుశీల్ ఆఖరి ప్రయత్నంగా అదే కోర్టులో డబుల్ బెంచ్‌కు అప్పీల్ చేసుకోనున్నాడు. అయితే అంతకన్నా ముందు మరోసారి రెజ్లింగ్ సమాఖ్యను కలవాలని నిర్ణయించుకున్నాడు. ‘ట్రయల్స్ నిర్వహించాల్సిందిగా చివరిసారిగా డబ్ల్యుఎఫ్‌ఐని అడగనున్నాం. ఒకవేళ ఇది కార్యరూపం దాల్చకపోతే డబుల్ బెంచ్‌కు అప్పీల్ చేస్తాం’ అని తన సన్నిహిత వర్గాలు తెలిపాయి. -
సుశీల్‌కు నిరాశే!
న్యూఢిల్లీ: రియో ఒలింపిక్స్ బెర్త్ విషయంలో రెజ్లర్ సుశీల్ కుమార్‌కు మరో ఎదురుదెబ్బ తగిలింది. నర్సింగ్ యాదవ్‌తో ట్రయల్స్ నిర్వహించాలన్న అతని వాదనను భారత రెజ్లింగ్ సమాఖ్య ) పెద్దగా పట్టించుకోలేదు. పైగా కోర్టు హియరింగ్ 27న జరిగే వరకూ జాతీయ క్యాంప్‌నకు కూడా సుశీల్ అనుమతించబోమని తెలిపింది. ఒలింపిక్ బెర్త్ సాధించిన నర్సింగ్‌నే పోటీలకు పంపనున్నట్లు సంకేతాలిచ్చింది. సమస్యను పరిష్కరించేందుకు ఢిల్లీ హైకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన సమాఖ్య ప్రత్యేక కమిటీ బుధవారం సుశీల్‌తో సమావేశమైంది. ‘మేం సుశీల్‌కు ఒక్కటే చెప్పాం. అంతర్జాతీయ వేదికపై భారత రెజ్లింగ్ గుర్తింపు తెచ్చిన నిన్ను మర్చిపోలేం. దాన్ని మేం గౌరవిస్తాం. అయితే ఇక్కడ మరో రెజ్లర్ ఒలింపిక్ బెర్త్‌ను సాధించిపెట్టాడు. అలాగే నిలకడగా రాణిస్తున్నాడు. కాబట్టి అతన్ని గుర్తించకపోవడం కూడా సరైంది కాదు’ అని డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్‌సింగ్ పేర్కొన్నారు. -
‘రియో’ శిబిరం జాబితాలో లేని సుశీల్ పేరు
రియో ఒలింపిక్స్ సన్నాహాల కోసం భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరంలో 74 కేజీల విభాగంలో స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌ను ఎంపిక చేయలేదు. ఈ విభాగంలో రియో బెర్త్ సాధించిన నర్సింగ్ యాదవ్‌ను మాత్రమే ఎంపిక చేశారు. హరియాణాలో బుధవారం ఈ శిబిరం ప్రారంభమవుతుంది. అయితే ఈ శిబిరానికి సుశీల్ హాజరు కావాలనుకుంటే అభ్యంతరం లేదని డబ్ల్యూఎఫ్ఐ అధికారి తెలిపారు. ఈ శిబిరంలో రియోకు అర్హత పొందిన 8 మంది రెజ్లర్లు పాల్గొంటారు -
అధిక బరువుతో అనర్హత
రెజ్లర్ వినేశ్‌పై వేటు ఉలాన్బాటర్ (మంగోలియా): రియో ఒలింపిక్స్ ప్రపంచ క్వాలిఫయింగ్ రెజ్లింగ్ టోర్నమెంట్లో శనివారం భారత బృందానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. మహిళల 48 కేజీల విభాగంలో బరిలోకి దిగాల్సిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్‌పై నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. రెజ్లర్ల బరువు తీసుకునే సమయానికి వినేశ్ నిర్ణీత 48 కేజీల కంటే 400 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నందుకు నిబంధనల ప్రకారం ఆమెను టోర్నీ నుంచి తప్పించారు. ఈ విషయాన్ని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధికారి ధ్రువీకరించారు. టోర్నమెంట్ రెండో రోజు కూడా భారత రెజ్లర్లకు నిరాశ ఎదురైంది. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో బరిలోకి దిగిన బబితా కుమారి (53 కేజీలు), గీతా ఫోగట్ (58 కేజీలు), అనిత (63 కేజీలు), నవ్‌జ్యోత్ కౌర్ (69 కేజీలు), జ్యోతి (75 కేజీలు) విఫలమయ్యారు. ఒక్కరు కూడా ప్లే ఆఫ్ దశకు అర్హత పొందలేకపోయారు. ఈ టోర్నీలో టాప్-3లో నిలిచినవారికి రియో ఒలింపిక్స్ బెర్త్ దక్కుతుంది. అయితే భారత రెజ్లర్లకు ఒలింపిక్స్‌కు అర్హత పొందేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. టర్కీలో మే 6 నుంచి 8 వరకు జరిగే చివరి క్వాలిఫయింగ్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన రెజ్లర్లు ఒలింపిక్స్‌కు అర్హత పొందుతారు.