అధిక బరువుతో అనర్హత
రెజ్లర్ వినేశ్‌పై వేటు
ఉలాన్‌బాటర్ (మంగోలియా): రియో ఒలింపిక్స్ ప్రపంచ క్వాలిఫయింగ్ రెజ్లింగ్ టోర్నమెంట్‌లో శనివారం భారత బృందానికి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. మహిళల 48 కేజీల విభాగంలో బరిలోకి దిగాల్సిన భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫోగట్‌పై నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. రెజ్లర్ల బరువు తీసుకునే సమయానికి వినేశ్ నిర్ణీత 48 కేజీల కంటే 400 గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నందుకు నిబంధనల ప్రకారం ఆమెను టోర్నీ నుంచి తప్పించారు.
ఈ విషయాన్ని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌ఐ) అధికారి ధ్రువీకరించారు. టోర్నమెంట్ రెండో రోజు కూడా భారత రెజ్లర్లకు నిరాశ ఎదురైంది. మహిళల ఫ్రీస్టయిల్ విభాగంలో బరిలోకి దిగిన బబితా కుమారి (53 కేజీలు), గీతా ఫోగట్ (58 కేజీలు), అనిత (63 కేజీలు), నవ్‌జ్యోత్ కౌర్ (69 కేజీలు), జ్యోతి (75 కేజీలు) విఫలమయ్యారు.
ఒక్కరు కూడా ప్లే ఆఫ్ దశకు అర్హత పొందలేకపోయారు. ఈ టోర్నీలో టాప్-3లో నిలిచినవారికి రియో ఒలింపిక్స్ బెర్త్ దక్కుతుంది. అయితే భారత రెజ్లర్లకు ఒలింపిక్స్‌కు అర్హత పొందేందుకు మరో అవకాశం మిగిలి ఉంది. టర్కీలో మే 6 నుంచి 8 వరకు జరిగే చివరి క్వాలిఫయింగ్ టోర్నీలో ఫైనల్‌కు చేరిన రెజ్లర్లు ఒలింపిక్స్‌కు అర్హత పొందుతారు.