నీటి శుద్ధి పథకాలను ప్రారంభించాలి
కేంద్ర మంత్రులకు రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ లేఖ
సాక్షి, న్యూఢిల్లీ: స్వచ్ఛ భారత్ అభియాన్ మిషన్ కింద గ్రామాలలో మురికి నీటి శుద్ధి వ్యవస్థ ఏర్పాటుకు సంబంధిత పథకాన్ని ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని టీడీపీ రాజ్యసభ సభ్యుడు టి.దేవేందర్ గౌడ్ కేంద్రాన్ని కోరారు.
ఈ మేరకు కేంద్ర గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి చౌదరి బీరేందర్ సింగ్, కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి అనిల్ మాధవ్ దవే, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు అరవింద్ పనగరియాలకు దేవేందర్ గౌడ్ గురువారం వేర్వేరుగా లేఖలు రాశారు. గ్రామాలలో మురికి నీటి శుద్ధి వ్యవస్థ లేకపోవడం వల్ల మురికి నీరు చెరువులు, బావులలోకి చేరి భూగర్భ జలాలు కలుషితమవుతున్నాయన్నారు. పలు ప్రాంతాలలో ఇప్పటికీ తాగు నీటి కోసం ప్రజలు భూగర్భ జలాలపైనే ఆధారపడుతున్నారన్నారు. కాబట్టి గ్రామాలలో మురికి నీటి శుద్ధి పథకాలను ప్రారంభించాలని దేవేందర్ గౌడ్ కోరారు.