సుజనా చౌదరికి చెక్ !
మరోసారి రాజ్యసభ అవకాశం లేనట్లే
సాక్షి, హైదరాబాద్: కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి వై.సుజనా చౌదరికి చెక్ పెట్టాలని టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించినట్లు సమాచారం. సుజనా చౌదరి రాజ్యసభ సభ్యత్వం వచ్చే నెల 21తో ముగియనుంది. ఆయనతోపాటు రాష్ర్టం నుంచి మరో ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం ముగియనుంది. ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు వచ్చే నెలలో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే షెడ్యూల్ కూడా విడుదలైంది.
దీంతో టీ డీపీలోని ఆశావహులు చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ కటాక్ష వీక్షణాల కోసం ఎదురు చూస్తున్నారు. తన రాజ్యసభ సభ్యత్వాన్ని పార్టీ అధినేత చంద్రబాబు ఎట్టిపరిస్థితుల్లోనూ పునరుద్ధరిస్తారని సుజనా చౌదరి ధీమాతో ఉన్నారు. అయితే, ఆయనకు మరోసారి అవకాశం ఇవ్వొద్దని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. సుజనా కొంతకాలంగా బ్యాంకులను మోసం చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కోర్టు వారెంట్ జారీ చేయడం, ఆయన కోర్టులకు హాజరు కావడం, ఆయన కంపెనీల్లో అక్రమాలు జరుగుతున్నాయంటూ పార్టీ నేతలు, ఇతరులు ప్రధానితోపాటు పలు సంస్థలకు ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలో చంద్రబాబు కూడా పునరాలోచనలో పడ్డట్లు సమాచారం. ఫిర్యాదులు, కేసుల దృష్ట్యా సుజనాకు ఈసారి అవకాశం లేనట్లేనని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.