అరటిపంటను ధ్వంసం చేసిన దుండగులు
అనంతపురం(తాడిమర్రి): ఓ రైతుకు చెందిన అరటిపంట మరో నెల రోజుల్లో చేతికి వస్తుందనగా కొంతమంది దుండగులు ధ్వంసం చేశారు. ఈ సంఘటన సోమవారం అనంతపురం జిల్లా తాడిమర్రి మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని దాడితోటగ్రామానికి చెందిని కె. వెంకటకృష్ణ రెడ్డి అనే వ్యక్తి రెండెకరాల్లో అరటి పంట సాగుచేస్తున్నాడు.
అయితే ఈ సారి మంచి దిగుబడి రావడంతో నెలరోజుల్లో పంట కాపుదింపుదామనుకున్నారు. ఈలోపే కొంతమంది దుండగులు అరటి గెలలను నరికి ధ్వంసం చేశారు. గ్రామానికి చెందిన వై. వెంకటేశ్వరరెడ్డినే ఈ విధ్వంసానికి బాధ్యుడని రైతు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.