కర్నూలులో వైఎస్ జగన్ జలదీక్ష
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జలదీక్ష చేపట్టనున్నట్లు పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. కర్నూలులో ఈనెల 16,17,18 తేదీల్లో దీక్ష చేపట్టనున్నట్లు ఆయన వెల్లడించారు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గురువారం పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఎగువ రాష్ట్రాలు ప్రాజెక్టులు కడుతుంటే చంద్రబాబు నాయుడు మౌనంగా ఉండటం ఏపీకి శాపంగా మారిందన్నారు.
ఆంధ్రప్రదేశ్ భవిష్యత్లో ఎడారిగా మారే ప్రమాదం ఉందని, మన హక్కులను మనమే కాపాడుకోవాలనే వైఎస్ జగన్ జలదీక్ష చేస్తున్నారన్నారు. నీటి కోసం అనర్థాలు తలెత్తే అవకాశాలున్నాయని అన్నారు. వైఎస్ జగన్ జలదీక్ష ఒక ప్రాంతం, ఒక పార్టీ సమస్య కాదని, ఇది ప్రజలందరి సమస్య అని ఉమ్మారెడ్డి పేర్కొన్నారు. జలదీక్షను ప్రజలందరూ విజయవంతం చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. వైఎస్ జగన్ జలదీక్ష సందర్భంగా ఈ నెల 17న రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఉమ్మారెడ్డి తెలిపారు.