Yadadri Development
-
యాదాద్రికి మాస్టర్ ప్లాన్!
సాక్షి, హైదరాబాద్: యాదాద్రి అభివృద్ధికి పుర పాలక శాఖ బృహత్తర ప్రణాళిక సిద్ధం చేసింది. భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా పట్టణ ప్రగతికి పెద్దపీట వేస్తోంది. తెలంగాణ తిరుమలగా తీర్చిదిద్దడానికి యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ (వైటీడీఏ) పరిధికి ప్రత్యేక మాస్టర్‌ప్లాన్ రూపొందించింది. 25,817 ఎకరాల విస్తీర్ణంలో ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్‌ను ప్రభుత్వ ఆమోదానికి పంపింది. ఆలయ నిర్మాణం మొదలు, పునుల పురోగతి తదితర పనులను తరచూ సమీక్షిస్తున్న కేసీఆర్ ఆలోచనలకు తగ్గట్లు మున్సిపల్ శాఖ మాస్టర్‌ప్లాన్‌కు రూపకల్పన చేసింది. యాదాద్రి దేవాలయ ఆధునిక పనులు పూర్తయితే భక్తుల తాకిడి పెరుగుతుందని అంచనా వేసిన పురపాలక శాఖ.. దానికి అనుగుణంగా మాస్టర్ ప్లాన్‌లో రెసిడెన్షియల్, వాణిజ్య అవసరాలకు ప్రాధాన్యమిచి్చంది. పట్టణీకరణకు సగం.. మాస్టర్‌ప్లాన్ అమల్లోకి వస్తే యాదాద్రిలో వ్యవ సాయం కనుమరుగు కానుంది. ప్రస్తుతం 9,944.45 (38.52%) ఎకరాల విస్తీర్ణంలో వ్యవసాయ భూములుండగా.. మాస్టర్ ప్లాన్‌లో దీన్ని 3,339.5 (13.14%) ఎకరాల మేర పొందుపరిచారు. పట్టణీకరణకు 11,310.85 (43.81%) ఎకరాలు నిర్దేశించారు. యాదగిరిగుట్టలో కొండ లు, గుట్టలు కరిగిపోనున్నాయి. గతంలో కొండ లు, గుట్టలు, 3,667.23 (14.22%)ఎకరాల్లో ఉండగా.. మాస్టర్‌ప్లాన్‌లో 2,423.6 (9.39%) ఎకరాలకు పరిమితం చేసింది. వాణిజ్య అవసరాలకు పెద్దపీట యాదాద్రికి వచ్చే భక్తుల అవసరాలకు సరిపడా మౌలిక సౌకర్యాలు కలి్పంచాలనే ఉద్దేశంతో మాస్టర్‌ప్లాన్‌లో 2,557.25 ఎకరాలను రెసిడెన్షియల్, 242.28 ఎకరాల మేర కమర్షియల్ జోన్‌కు నిర్దేశించింది. ప్రస్తుతం కమర్షియల్ జోన్ 43.63 ఎకరాల్లోనే ఉంది. ఇప్పటికే స్పెషల్ డెవలప్మెంట్ ప్రాంతానికి 1,698 ఎకరాలు కేటాయించింది. ఇలా వివిధ అవసరాలకు జోన్లను నిర్దేశించిన పురపాలక శాఖ.. డ్రాఫ్ట్ మాస్టర్‌ప్లాన్‌ను ప్రభుత్వానికి పంపింది. దీనికి సీఎం కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగానే.. మాస్టర్‌ప్లాన్ కార్యరూపం దాల్చనుంది. -
24న యాదాద్రికి సీఎం కేసీఆర్ రాక
సాక్షి, యాదాద్రి: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 24న యాదాద్రికి రానున్నారు. తిరుమల తరహాలో ప్రపంచ స్థాయి పుణ్యక్షేత్రంగా రూపుదిద్దుకుంటున్న యాదాద్రి దివ్యక్షేత్రం అభివృద్ధి పనులపై సమీక్ష చేయనున్నారు. రెండేళ్ల క్రితం ప్రారంభమైన ప్రధానాలయం, టెంపుల్ సిటీ, నృసింహ, జింకల పార్క్, నలువైపులా రహదారులు, గిరిప్రదర్శన, ప్రెసిడెన్షియల్ భవనాలు వంటి అన్ని పనుల పురోగతిపై పూర్తి స్థాయిలో సమీక్ష చేస్తారు. సుమారు రూ.734.7 కోట్లతో తొలి విడత పనులకు అంచనాలు రూపొందించిన వైటీడీఏ ఇప్పటి వరకు రూ.350 కోట్ల మేర పనులను చేసింది. అయితే ప్రభుత్వం ఏటా రూ.100 కోట్లు బడ్జెట్లో మంజూరు చేస్తూ వచ్చింది. వీటికి అదనంగా మరో రూ.350 కోట్ల అవసరం అవుతాయని సాంకేతిక కమిటీ ఇటీవల పంపిన నివేదికకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందులో రూ.200 కోట్లను విడుదల చేసిందని వైటీడీఏ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో కేటాయించిన రూ.100 కోట్లలో పెండింగ్‌లో ఉన్న బిల్లుల కోసం రూ.25 కోట్లను కూడా విడుదల చేసింది. పనులను వేగవంతంగా చేసి నిర్ణీత సమ యంలో భక్తులకు స్వయం భూ దర్శనాలు కల్పించడానికి అవసరమైన రూ.350 కోట్లకు గాను రూ.200 కోట్లను మంజూరు చేసింది. మిగతా రూ.200 కోట్లను జరిగిన పనుల ఆధారంగా మంజూ రు చేయనుంది. రెండో విడతలో చేపట్టే 600 ఎకరాల్లో టౌన్షిప్, 148 ఎకరాల్లో పార్కింగ్ వసతి, కళ్యాణ కట్ట, విష్ణు పుష్కరిణి వంటి మరికొన్ని పనుల డీపీఆర్ రూపొందించ డానికి కన్సెల్టెన్సీ సంస్థకు అప్పగించారు. సీఎం ప్రత్యేక కార్యదర్శి భూపాల్‌రెడ్డి, యాదాద్రి పనులపై ప్రత్యేక సమీక్షలు నిర్వహిస్తూ నివేదికలు అందజేస్తున్నారు. -
ధరలకు రెక్కలు
రాయగిరి నుంచి జిల్లా సరిహద్దు వరకు భూములకు భలే డిమాండ్ రోడ్డు వెంట రూ.20లక్షల నుంచి రూ.50లక్షలకు చేరిన ఎకరం ధర యాదాద్రి అభివృద్ధి, పారిశ్రామిక కారిడార్ ఏర్పాటే కారణం భువనగిరి : జాతీయ రహదారి 163 విస్తరణ భూసేకరణ పనులు వేగవంతం కావడంతో రాయగిరి నుంచి జిల్లా సరిహద్దు వరకు రోడ్డు వెంట గల భూములకు ఒక్కసారిగా రేట్లు పెరిగిపోయాయి. హెచ్ఎండీఏ, వైటీడీఏ (యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి మండలి) పరిధిలో గల భువనగిరి మండలం రాయగిరి, యాదగిరిగుట్ట మండలం వంగపల్లి, ఆలేరు మండలాలకు అనుసంధానంగా జాతీయ రహదారి విస్తరణకు రంగం సిద్ధమైంది. ఇటీవల రూ.384 కోట్లకు పైగా నిధులతో ఈ రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు భూసేకరణ పనులను ముమ్మరం చేశారు. సీఎం కేసీఆర్ యాదాద్రి డెవలప్మెంట్కు అధిక ప్రాధాన్యతను ఇవ్వడంతో గుట్టకు 15 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. రూ.పది లక్షల లోపు ఉన్న భూముల ధరలు అమాంతం ఆయా ప్రాంతాన్ని బట్టి నాలుగింతలు పెరిగాయి. దీంతోపాటు హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి వెంట సీఎం కేసీఆర్ పారిశ్రామిక కారిడార్‌గా ప్రకటించడంతో ఒక్కసారి పరిశ్రమల యజమానులు, రియల్టర్లు రోడ్డు వెంట గల భూములతోపాటు ఆయా ప్రాంతాల్లోని 15 కిలోమీటర్ల వరకు భూములను కొనుగోలు చేస్తున్నారు. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ రియల్టర్లతోపాటు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, విదేశాల్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులు, పెద్దఎత్తున భూములను కొనుగోలు చేస్తున్నారు. ఇప్పటికే విస్తరించిన వ్యాపారం బీబీనగర్ నుంచి భువనగిరి, యాదగిరిగుట్ట, వంగపల్లి, ఆలేరు, జనగాం వరకు ప్రధాన రహదారి వెంట ఎకరం ధర రూ.20 నుంచి రూ.50 లక్షలకు చేరింది. ఈ ధర ఈ ప్రాంతంలో అధికమైనప్పటికీ గతంలో రాజీవ్ రహదారి, బెంగుళూరు రోడ్డు, శ్రీశైలం, ముంబాయి రహదారి వెంట ఎకరం ధర కోట్లలో పలుకుతుండడంతో సహజంగానే కొనుగోలుదారులు ఇటువైపు ఆసక్తి చూపుతున్నారు. పారిశ్రామిక కారిడార్లోకి రాష్ట్రరాజధానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక జోన్లోకి చేరింది. నగరంలోని పరిశ్రమలు 70 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలన్న హైకోర్టు ఉత్తర్వులు కూడా ఇప్పటికే ఉన్నాయి. పారిశ్రామికవేత్తలు కూడా భువనగిరి డివిజన్లో భూములపై కన్నెయడంతో అమాంతం ధరలు పెరిగాయి. డివిజన్ పరిధిలోకి వచ్చే ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, మోత్కూరు, ఆత్మకూరు (ఎం) ప్రాంతాల్లో భూముల కొనుగోళ్లు పెరిగాయి. మారుమూల మండలాల్లో రూ.వేలల్లో పలికే ఎకరం భూమి ప్రస్తుతం రూ.లక్షల్లోకి చేరింది. జాతీయ రహదారి పరిధి విస్తరించడం, రోడ్డు సౌకర్యం మెరుగుపడడంతో పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. భువనగిరి ప్రాంతం వరకు రాజధాని నుంచి రవాణా సౌకర్యాలు విస్తృతంగా ఉండడం భూముల కొనుగోలు డిమాండ్ పెరిగింది. సికింద్రాబాద్ - ఖాజీపేట, బీబీనగర్ - నడికుడి రైల్వే మార్గాలు భువనగిరి డివిజన్ మీదుగా వెళ్తుండడం, పలు రైళ్లు ఈ మార్గం గుండా ప్రయాణించడంతో రవాణా సౌకర్యాలు మెరుగుకావడం అనుకూలాంశం. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు భువనగిరికి 70 కిలోమీటర్ల లోపు ఉండడం, అభివృద్ధికి మరింత దోహదపడుతుంది. ఎన్ఆర్ఐల ఆసక్తి విదేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వారు పంపుతున్న డబ్బుతో ఇక్కడ గల వారి తల్లిదండ్రులు భూములను లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేయడం లేదు. ఎకరాల కొద్దీ భూములను కొనుగోలు చేసి వాటిలో ఫామ్‌హౌస్‌లు, పండ్ల తోటలు, డెయిరీలను స్థాపిస్తున్నారు. భువనగిరి పరిసర ప్రాంతాల్లో అపార్ట్మెంట్లను, కమర్షియల్ కాంప్లెక్స్‌లను నిర్మిస్తున్నారు. మరికొందరు అధికారులు, బడా వ్యాపారులు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి భూముల కొనుగోలుపై ఆసక్తిని చూపుతున్నారు. రిజిస్ట్రేషన్ వాల్యు ప్రకారం వేలల్లో ఉంటున్న ధర వాస్తవ రేటు లక్షలు పలుకుతుంది. కోట్లాది రూపాయలు వెచ్చించి వందలాది ఎకరాల భూములు కొంటున్నా ప్రభుత్వ రికార్డుల ప్రకారం వాటి విలువ లక్షల్లోనే ఉంటుంది. మార్కెట్ వాల్యూ ప్రకారం తక్కువ ధర ఉండడమే ఇందుకు కారణం. దీని వల్ల పెద్ద ఎత్తున బ్లాక్‌మనీ చేతులు మారుతోంది. సామాన్యుల చేజారుతున్న భూములు హైవే వెంట ఎకరం ధర లక్షల్లో పలుకుతుండడంతో పెద్ద ఎత్తున అమ్మకాలు సాగుతున్నాయి. ముఖ్యంగా పేదలు తమ అవసరాల కోసం అమ్మకాలు సాగిస్తున్నారు. దీంతో పేద రైతులు భూములను కోల్పోతున్నారు. తిరిగి కొనుగోలు చేయాలన్నా వారికి భూ ముల ధరలు అందనంతదూరంలోకి వెళ్తున్నాయి. -
బహుళ ప్రయోజనకారి
ముఖ్యమంత్రి కేసీఆర్ యాదాద్రి అభివృద్ధికి కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధిపై కూడా దృష్టిసారించారు. ఇటీవల ప్రకటించిన యాదాద్రి అభివృద్ధి పనుల ప్రణాళికలో భువనగిరి మండలం బస్వాపురం, తుర్కపల్లి మండలం గందమల్ల రిజర్వాయర్ల గురించి కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించారు. అయితే 0.8 టీఎంఎసీల గోదావరి నీటినిల్వ సామర్థ్యంతోనిర్మిస్తున్న బస్వాపురం రిజర్వాయర్‌ను 8 టీఎంసీలుగా పెంచడానికి ప్రభుత్వం నిర్ణయించింది. అంతకుముందున్న ప్రభుత్వం బస్వాపురం రిజర్వాయర్ ద్వారా జిల్లాలో రెండు లక్షల ఎకరాలకు సాగు నీటితోపాటు, హైదరాబాద్ ప్రజలకు తాగు నీటి వసతిని కల్పించడం ముఖ్య ఉద్దేశంగా రిజర్వాయర్ పనులు డిజైన్ చేసింది. తాజాగా రిజర్వాయర్ సామర్థ్యం పెంచడం ద్వారా గరిష్ట స్థాయిలో ప్రజలు లబ్ధిపొందాలనేది ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. త్వరలో ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయనుందని సమాచారం. యాదాద్రి పరిధిలోకి బస్వాపురం రిజర్వాయర్ స్థాయి పెంచడం ద్వారా సీఎం కేసీఆర్ యాదాద్రి అభివృద్ధి పటంలో చేర్చినట్లు అయ్యింది. దీంతో రిజర్వాయర్‌లో బోటింగ్, వాటర్ గేమ్స్ ఏర్పాటు చేయాలన్నది లక్ష్యంగా ఉంది. వైటీడీఏ పరిధిలో చేపడుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా బస్వాపురం చెరువును అభివృద్ధి చేయడం అంటే దీన్ని కూడా అందులో కలిపే ఉద్దేశం కన్పిస్తోంది. యాదాద్రి మాస్టర్‌ప్లాన్ అభివృద్ధి పనులు కార్యరూపం దాల్చితే దేశ, విదేశాల భక్తులు యాదగిరిగుట్టకు వస్తారని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా గుట్ట పరిధిలో ఉద్యాన వనాలు, అభయారణ్యాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు,కల్యాణ మంటపాలు, విశాలమైనరోడ్లు, ఇలా భక్తులకు మానసిక, ఆధ్యాత్మిక భావనను కల్పించడానికి కేసీఆర్ నిధులు కేటాయిస్తున్నారు. మరో 10 రోజుల్లో పనులు ప్రారంభం అవుతాయని ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. రిజర్వాయర్‌గా మారిన బస్వాపురం చెరువు భువనగిరి మండలం బస్వాపురం చెరువును రిజర్వాయర్‌గా మార్చారు. 0.8 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం గల రిజర్వాయర్ పనులు జరుగుతున్నాయి. ఇప్పుడు 8 టీఎంసీలుగా మార్చడానికి ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. ఇందు కోసం 1400 ఎకరాలు అవసర ఉంది. గతంలో 0.8 టీఎంసీల కోసం సుమారు 630 ఎకరాల భూమిని రిజర్వాయర్ కోసం సేకరించారు. మిగతా భూమిని సేకరించడానికి సర్వే చేపట్టారు. మిగులు జలాలను నిల్వ చేసి ఇక్కడి నుంచి హైదరాబాద్ నగరానికి మంచినీటితో పాటు జిల్లాలోని మిగతా ప్రాంతాలకు సాగునీటి సరఫరా చేయాలన్నది ప్రభుత్వ నిర్ణయం.