రాయగిరి నుంచి జిల్లా సరిహద్దు వరకు భూములకు భలే డిమాండ్
రోడ్డు వెంట రూ.20లక్షల నుంచి రూ.50లక్షలకు చేరిన ఎకరం ధర
యాదాద్రి అభివృద్ధి, పారిశ్రామిక కారిడార్ ఏర్పాటే కారణం
భువనగిరి : జాతీయ రహదారి 163 విస్తరణ భూసేకరణ పనులు వేగవంతం కావడంతో రాయగిరి నుంచి జిల్లా సరిహద్దు వరకు రోడ్డు వెంట గల భూములకు ఒక్కసారిగా రేట్లు పెరిగిపోయాయి. హెచ్‌ఎండీఏ, వైటీడీఏ (యాదగిరిగుట్ట దేవస్థానం అభివృద్ధి మండలి) పరిధిలో గల భువనగిరి మండలం రాయగిరి, యాదగిరిగుట్ట మండలం వంగపల్లి, ఆలేరు మండలాలకు అనుసంధానంగా జాతీయ రహదారి విస్తరణకు రంగం సిద్ధమైంది. ఇటీవల రూ.384 కోట్లకు పైగా నిధులతో ఈ రోడ్డును నాలుగు లేన్లుగా విస్తరించడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అధికారులు భూసేకరణ పనులను ముమ్మరం చేశారు. సీఎం కేసీఆర్ యాదాద్రి డెవలప్‌మెంట్‌కు అధిక ప్రాధాన్యతను ఇవ్వడంతో గుట్టకు 15 నుంచి 20 కిలోమీటర్ల పరిధిలో భూముల ధరలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. రూ.పది లక్షల లోపు ఉన్న భూముల ధరలు అమాంతం ఆయా ప్రాంతాన్ని బట్టి నాలుగింతలు పెరిగాయి. దీంతోపాటు హైదరాబాద్-వరంగల్ జాతీయ రహదారి వెంట సీఎం కేసీఆర్ పారిశ్రామిక కారిడార్‌గా ప్రకటించడంతో ఒక్కసారి పరిశ్రమల యజమానులు, రియల్టర్లు రోడ్డు వెంట గల భూములతోపాటు ఆయా ప్రాంతాల్లోని 15 కిలోమీటర్ల వరకు భూములను కొనుగోలు చేస్తున్నారు. కరీంనగర్, వరంగల్, హైదరాబాద్ రియల్టర్లతోపాటు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, విదేశాల్లో ఉన్న పిల్లల తల్లిదండ్రులు, పెద్దఎత్తున భూములను కొనుగోలు చేస్తున్నారు.
ఇప్పటికే విస్తరించిన వ్యాపారం
బీబీనగర్ నుంచి భువనగిరి, యాదగిరిగుట్ట, వంగపల్లి, ఆలేరు, జనగాం వరకు ప్రధాన రహదారి వెంట ఎకరం ధర రూ.20 నుంచి రూ.50 లక్షలకు చేరింది. ఈ ధర ఈ ప్రాంతంలో అధికమైనప్పటికీ గతంలో రాజీవ్ రహదారి, బెంగుళూరు రోడ్డు, శ్రీశైలం, ముంబాయి రహదారి వెంట ఎకరం ధర కోట్లలో పలుకుతుండడంతో సహజంగానే కొనుగోలుదారులు ఇటువైపు ఆసక్తి చూపుతున్నారు.
పారిశ్రామిక కారిడార్‌లోకి
రాష్ట్రరాజధానికి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం ఇప్పుడు ప్రభుత్వం ప్రకటించిన నూతన పారిశ్రామిక జోన్‌లోకి చేరింది. నగరంలోని పరిశ్రమలు 70 కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయాలన్న హైకోర్టు ఉత్తర్వులు కూడా ఇప్పటికే ఉన్నాయి. పారిశ్రామికవేత్తలు కూడా భువనగిరి డివిజన్‌లో భూములపై కన్నెయడంతో అమాంతం ధరలు పెరిగాయి. డివిజన్ పరిధిలోకి వచ్చే ఆలేరు, రాజాపేట, యాదగిరిగుట్ట, తుర్కపల్లి, మోత్కూరు, ఆత్మకూరు (ఎం) ప్రాంతాల్లో భూముల కొనుగోళ్లు పెరిగాయి. మారుమూల మండలాల్లో రూ.వేలల్లో పలికే ఎకరం భూమి ప్రస్తుతం రూ.లక్షల్లోకి చేరింది. జాతీయ రహదారి పరిధి విస్తరించడం, రోడ్డు సౌకర్యం మెరుగుపడడంతో పారిశ్రామికవేత్తలు ఈ ప్రాంతాన్ని ఎంచుకుంటున్నారు. భువనగిరి ప్రాంతం వరకు రాజధాని నుంచి రవాణా సౌకర్యాలు విస్తృతంగా ఉండడం భూముల కొనుగోలు డిమాండ్ పెరిగింది. సికింద్రాబాద్ - ఖాజీపేట, బీబీనగర్ - నడికుడి రైల్వే మార్గాలు భువనగిరి డివిజన్ మీదుగా వెళ్తుండడం, పలు రైళ్లు ఈ మార్గం గుండా ప్రయాణించడంతో రవాణా సౌకర్యాలు మెరుగుకావడం అనుకూలాంశం. శంషాబాద్‌లోని రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు భువనగిరికి 70 కిలోమీటర్ల లోపు ఉండడం, అభివృద్ధికి మరింత దోహదపడుతుంది.
ఎన్‌ఆర్‌ఐల ఆసక్తి
విదేశాల్లో ఉద్యోగాలు, వ్యాపారాలు చేస్తున్న వారు పంపుతున్న డబ్బుతో ఇక్కడ గల వారి తల్లిదండ్రులు భూములను లక్షల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేయడానికి వెనుకడుగు వేయడం లేదు. ఎకరాల కొద్దీ భూములను కొనుగోలు చేసి వాటిలో ఫామ్‌హౌస్‌లు, పండ్ల తోటలు, డెయిరీలను స్థాపిస్తున్నారు. భువనగిరి పరిసర ప్రాంతాల్లో అపార్ట్‌మెంట్లను, కమర్షియల్ కాంప్లెక్స్‌లను నిర్మిస్తున్నారు. మరికొందరు అధికారులు, బడా వ్యాపారులు నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకోవడానికి భూముల కొనుగోలుపై ఆసక్తిని చూపుతున్నారు. రిజిస్ట్రేషన్ వాల్యు ప్రకారం వేలల్లో ఉంటున్న ధర వాస్తవ రేటు లక్షలు పలుకుతుంది. కోట్లాది రూపాయలు వెచ్చించి వందలాది ఎకరాల భూములు కొంటున్నా ప్రభుత్వ రికార్డుల ప్రకారం వాటి విలువ లక్షల్లోనే ఉంటుంది. మార్కెట్ వాల్యూ ప్రకారం తక్కువ ధర ఉండడమే ఇందుకు కారణం. దీని వల్ల పెద్ద ఎత్తున బ్లాక్‌మనీ చేతులు మారుతోంది.
సామాన్యుల చేజారుతున్న భూములు
హైవే వెంట ఎకరం ధర లక్షల్లో పలుకుతుండడంతో పెద్ద ఎత్తున అమ్మకాలు సాగుతున్నాయి. ముఖ్యంగా పేదలు తమ అవసరాల కోసం అమ్మకాలు సాగిస్తున్నారు. దీంతో పేద రైతులు భూములను కోల్పోతున్నారు. తిరిగి కొనుగోలు చేయాలన్నా వారికి భూ ముల ధరలు అందనంతదూరంలోకి వెళ్తున్నాయి.
ధరలకు రెక్కలు
Published Thu, Jul 30 2015 11:15 PM | Last Updated on Sun, Sep 3 2017 6:27 AM
Advertisement