వేగంగా యాదాద్రి ప్రధానాలయం పనులు | Yadadri Temple Work Progress In Nalgonda | Sakshi
Sakshi News home page

వేగంగా యాదాద్రి ప్రధానాలయం పనులు

Published Fri, Nov 22 2019 3:17 AM | Last Updated on Fri, Nov 22 2019 7:48 AM

Yadadri Temple Work Progress In Nalgonda - Sakshi

రాజస్తాన్‌ నుంచి తీసుకొచ్చిన పద్మం

సాక్షి, యాదగిరిగుట్ట / యాదగిరికొండ: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనుల్లో వైటీడీఏ అధికారులు మరింత వేగం పెంచారు. ఈ నెల చివరలో కానీ, వచ్చే నెల మొదటి వారంలో కానీ సీఎం కేసీఆర్‌ ఆలయ అభివృద్ధి పనుల పరిశీలనకు రానున్నారనే సమాచారంలో ప్రధానాలయంతోపాటు ఇతర పనులను ముమ్మరంగా చేస్తున్నారు. వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఆర్కిటెక్టు ఆనంద్‌సాయి, స్తపతి వేలు పనులను పర్యవేక్షిస్తున్నారు.

ప్రస్తుతం ప్రధాన ఆలయం తూర్పు రాజగోపురం ముందు భాగంలో గ్రేడ్‌ స్లాబ్‌ పనులు జరుగుతున్నాయి. స్టీల్, కాంక్రీట్‌తో 70 మీటర్ల వెడల్పు, 30 మీటర్ల పొడవుతో 10 ఇంచుల ఎత్తులో ఈ పను లను చేస్తున్నారు. ఈ గ్రేడ్‌ స్లాబ్‌పై రాళ్లను బిగించి భక్తులు నడిచేలా పనులు చేయనున్నారు. మరో పక్క 50కి పైగా కలశాలకు బంగారు తాపడం చేయించేందుకు చెన్నై తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.

ప్రధాన ఆలయంలో పనులు ఇవే.. 
యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి స్వయం భూగా వెలసిన గర్భాలయం వెలుపల ప్రహ్లాద చరిత్రకు సంబంధించిన 10 ఘట్టాలను పంచలోహ విగ్రహాలతో తయారు చేస్తున్నారు. వీటిని ఇటీవల అధికారులు, స్తపతులు, కలెక్టర్‌ పరిశీ లించారు. గర్భాలయం వెలుపల పైభాగంలో వీటిని అమర్చేందుకు సిద్ధమవుతున్నారు. సీఎం సూచనలతో శిల్పులు గర్భాలయం ముందు భాగంలో పంచ నారసింహ శిల్పాలను చెక్కారు. ప్రధానాలయం ద్వారాల పైభాగం లో శ్రీలక్ష్మీనరసింహస్వామి విగ్రహాన్ని త్వరలో ప్రతి ష్టించేందుకు సిద్ధం చేసి వేంచేపు మండపం వద్ద పెట్టారు. అలాగే ప్రధానాలయ ద్వారాలకు ఇరువైపులా ద్వారపాలకులను ప్రతిష్టించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.

క్షేత్రపాలకుడైన శ్రీఆంజనేయస్వామి ముందు భాగంలోని అరుగులో ఏనుగుల వరుస, పెద్దసైజులో పద్మాన్నిచెక్కే పనులు జరుగుతున్నాయి. ఈశాన్యం నుంచి కిందికి దిగినప్పుడు ఆంజనేయస్వామి ఆలయం నుంచి మండపానికి వెళ్లే వరకు శిలతో తయారు చేసిన రెయిలింగ్‌ పనులు చేస్తున్నారు. ప్రధాన ఆలయ మండపంలో బలిపీఠం, ధ్వజస్తంభానికి రాగి రేకులను బిగించారు. వీటికి బంగారు తాప డం చేయించేందుకు చెన్నై తీసుకెళ్లనున్నారు. ప్రధాన మండపంలోని ఆండాళ్‌ అమ్మవారు, ఆళ్వార్లు, రామానుజుల ఆలయ నిర్మాణాలు పూర్తి కాగా, సేన మండపం పనులు చేస్తున్నారు. ప్రధానాలయంలోని ఆళ్వార్‌ మండపంలో పైకప్పునకు రాజస్తాన్‌ నుంచి తీసుకువచ్చిన పద్మాలను ఏర్పాటు చేశారు.

పూర్తయిన రెయిలింగ్‌ పనులు
భక్తులు స్వామిని దర్శనం చేసుకొని బయటకు వెళ్లేటప్పుడు పడమర వైపు, పంచతల రాజగోపురం వైపు, లోపల వైపు రాతి రెయిలింగ్‌ పనులు పూర్తి చేశారు. ప్రథమ ప్రాకారం, ద్వితీయ ప్రాకారం వెలుపల సైతం రాతి ఫ్లోరింగ్‌ వేస్తున్నారు. ఇప్పటికే వేంచేపు మండపం పనులు పూర్తి కాగా, బ్రహ్మోత్సవ మండపం పనులు తుది దశకు చేరుకున్నాయి. డిసెంబర్‌ చివరికల్లా ఆలయ నిర్మాణం పనులు పూర్తి చేయాలనే సంకల్పంతో శిల్పులు రాత్రి, పగలు శ్రమిస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement