అధికారులతో సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్
సాక్షి, యాదాద్రి: యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ, అభివృద్ధి పనులను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదివారం అణువణువూ పరిశీలించారు. ఉదయం 11.34గంటలకు యాదాద్రికి చేరుకున్న సీఎం.. సాయంత్రం 5.58గంటలకు తిరుగు పయనం అయ్యారు. సుమారు ఆరున్నర గంటల పాటు యాదాద్రిలో జరుగుతున్న పనులన్నింటినీ కాలినడకన తిరిగి పరిశీలించారు. పనులు జరిగిన తీరును, జరుగుతున్న తీరును వైటీడీఏ అధికారులు, స్తపతులు, ఆర్కిటెక్చర్లను అడిగి తెలుసుకున్నారు. ఆలయ నిర్మాణం జరుగుతున్న తీరును పరిశీలిస్తూనే వారికి సూచనలు చేశారు. వాస్తు, ఆగమశాస్త్రం ప్రకారం నిర్మాణాలు జరగాలని, అందుకు విరుద్ధంగా ఉండే వాటిని మార్పులు, చేర్పులు చేయాలని సూచించారు. అభివృద్ధి పనుల విషయంలో ఎలాంటి తొందర లేదని, నాలుగు రోజులు ఆలస్యమైనా నాణ్యతతో పూర్తి చేసుకోవాలని సూచించారు.
బాలాలయంలో పూజలు చేసిన సీఎం కేసీఆర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం ఫలికారు. అనంతరం కేసీఆర్ ప్రధానాలయం, మంటపం, గర్భగుడి, బాహ్య ప్రాకారాలు, అంతర ప్రాకారాలు, మాడ వీధులు, రథశాల, శ్రీసత్యనారాయణస్వామి వ్రత మంటపం, ధ్వజస్తంభం, ప్రసాదం కౌంటర్లు, శివాలయం, ఆళ్వార్ విగ్రహాలు, వ్యాలీ పిలర్లు, కాకతీయ పిల్లర్లు, శిల్పాలు, తెలంగాణ సంస్కృతి ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన వివిధ ఆకృతులు, మంటపాలు, గర్భాలయంలో ఫ్లోరింగ్ పనులను పరిశీలించారు. వీటితో పాటు ధ్వజస్తంభ పీఠం, బలిపీఠం, స్వామి వారి దర్శనానికి వచ్చి, వెళ్లే దారులు, గజ (ఏనుగు) స్తంభాలు, క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామి మంటపం, నృసింహ దీక్ష తీసుకున్న భక్తులకు అనుకూలంగా గర్భాలయం చుట్టూ ప్రదక్షిణ చేసేందుకు వీలుందా.. లేదా పరిశీలించారు.
అలాగే ఆలయంలో విద్యుత్ దీపాలు, ఏసీలు ఎక్కడెక్క ఎన్ని వస్తాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆలయంలోని మొదటి ప్రాకారంలో గల అష్టభుజి మండపం, దాని ప్రాధాన్యతను స్తపతులను అడిగి తెలుసుకున్నారు. తిరుమాఢ వీధుల్లో తిరుగుతూ ఫ్లొరింగ్ ఎప్పటిలోగా పూర్తి అవుతుందని అడిగి తెలుసుకున్నారు. సప్త తల రాజగోపురం, సుదర్శన రాజగోపురం, నాలుగు దిక్కులా ఐదంతస్తుల రాజ గోపురాలను పరిశీలించారు. వేల సంవత్సరాలు చెక్కు చెదరకుండా ఉండే విధంగా పూర్తి కృష్ణ రాతి శిలలతో నిర్మించిన సప్త రాజగోపురాల గూర్చి స్తపతులు, ఆర్కెటెక్చర్లను అడిగి సంపూర్ణంగా తెలుసుకొని సంతృప్తి వ్యక్తం చేశారు.
తొందర అవసరం లేదు
అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నందున నిర్మాణాల విషయంలో ఎలాంటి తొందర అవసరం లేదని, పక్కగా పనులు పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. పుష్కరిణి మరింత వెడల్పు వస్తుందా.. మధ్యలో మండప నిర్మాణం చేయాలని ఆదేశించారు. కొండ కింద ప్రెసిడెన్సియల్ సూట్, గిరి ప్రదక్షిణ విస్తరణ పనులు, పరిశీలించారు. మాడ వీధుల్లో తిరుగుతూ, కొండపైన వాస్తుకు విరుద్దంగా చేపట్టిన వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. ప్రధానంగా దేవాలయ వాస్తు ప్రకారం తూర్పు ఈశాన్యంలో ఎటువంటి భవనాలు ఉండకూడదన్న నియమం ప్రకారం ప్రారంభమైన సత్యనారాయణ వ్రత మంటపం, రథశాల మంటపం, సబ్‌స్టేషన్ నిర్మాణాలను వెంటనే తొలగించి, ఆ ప్రాంతాన్ని ఖాళీగా ఫ్లాట్‌ఫాంగా మార్చాలన్నారు.
15 రోజుల్లో చినజీయర్‌స్వామితో కలిసి వస్తా
15 రోజుల్లో శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామి తో కలిసి మళ్లీ వస్తానని, అప్పటిలోగా పనుల్లో తాను సూచించిన మార్పులు, చేర్పులను చేపట్టలన్నారు. కూల్చిన స్థలంలో ఎటువంటి పనులు చేపట్టాలో అప్పుడు చెబుతామన్నారు. వాటిని వెంటనే ప్రార ంభించి అధికారులకు, శిల్పులకు తగు సూచనలు చేశారు. ప్రధాన ఆలయం ప్రాంతంలోని 173 ఎకరాల్లో జరుగుతున్న పనులు పరిశీలించారు. ఆ తర్వాత టెంపుల్ సిటీగా అ భివృద్ధి చెందుతున్న పెద్దగుట్టను సందర్శించారు. పెద్దగుట్టపై అదనపు రోడ్డు పనులను వెంటనే ప్రారంభించాలని, 48మంది దాతలు ఇచ్చిన రూ.96కోట్ల నిధులతో అ«ధునాతన వసతి గదులను నిర్మించాలని సూచించారు. గుట్టలను కవర్ చేస్తూ ఔటర్‌రింగ్ రోడ్డు నిర్మిస్తామని, నిధులు వెంటనే మంజూరు చేస్తామన్నారు. యాదాద్రి దేవాలయ పునర్ నిర్మాణ పనులన్నింటినీ సమాంతరంగా చేయాలని చెప్పారు.
అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష
హరిత హోటల్, పెద్దగుట్టపై అధికారులతో ఆలయ అభివృద్ధి పనులపై సీఎం కేసీఆర్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నిలిచిపోయిన రిటర్నింగ్ వాల్, గిరి ప్రదక్షిణ, రింగ్ రోడ్డు, కొత్తగా నిర్మించే బస్టేషన్, బస్ డిపో, అన్నదాన సత్రం, గండి చెరువు అభివృద్ధి, తెప్పోత్సవం, కల్యాణ కట్టా, క్యూ కాంప్లెక్స్, పార్కింగ్ వసతి, దుకాణాల సమూదాయం, యాదగిరిగుట్ట పట్టణంలో రాయగిరి నుంచి ఘాట్ రోడ్డు వరకు నాలుగు లైన్ల రోడ్డు వెడల్పు, ప్రెసిడెన్షియల్ సూట్, ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమం వంటి పలు అంశాలపై సవివరంగా చర్చించారు.
ఆలయ అర్చకులతో సమావేశం
ప్రధాన ఆలయంలో ఆలయ అర్చకులతో సమావేశం నిర్వహించి, వందల ఏళ్ల పాటు నిలిచిపోయే శాశ్వత నిర్మాణం కాబట్టి ఎలాంటి తొందరపాటు, పొరపాట్లు లేకుండా పనులు చేయాలని, నాణ్యత విషయంలో రాజీ పడవద్దని సీఎం కేసీఆర్ వారికి సూచించారు. బాలాలయంలో ఆలయ అర్చకులతో సమీక్ష నిర్వహించారు. 15 రోజుల్లో చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో దేవాలయ వాస్తు నిర్మాణాలపై సమీక్ష ఏర్పాటు చేస్తానని, ఈ సమీక్షకు తెలంగాణాలో ముఖ్యమైన జ్యోతిష్య పండితులను ఆహ్వానిస్తామని, మీరు కూడా రావడానికి సిద్ధంగా ఉండాలని యాదాద్రి అర్చకులను కోరారు. అంతకుముందు హెలీకాప్టర్‌లో యాదాద్రి పనులను పరిశీలించారు.
సీఎం కేసీఆర్ వెంట ఎంపీలు జే.సంతోష్‌కుమార్, బూర నర్సయ్యగౌడ్, బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, గొంగిడి సునీత, పైళ్ల శేఖర్‌రెడ్డి, గాదరి కిశోర్‌కుమార్, మర్రి జనార్దన్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, ఎమ్మెల్సీలు ఎలిమినేటి కృష్ణారెడ్డి, కర్నె ప్రభాకర్, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమా మాధవరెడ్డి, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి చాడ కిషన్‌రెడ్డి, వైటీడీఏ వైస్ చైర్మన్ కిషన్‌రావు, సీఎంఓ కార్యదర్శి భూపాల్‌రెడ్డి, కలెక్టర్ అనితారామంచంద్రన్, రాచకొండ సీపీ మహేష్ భగవత్, డీసీపీ రామచంద్రారెడ్డి, యాదాద్రి దేవస్థానం ఈఓ గీతారెడ్డి, ప్రధాన అర్చకులు నల్లంథీఘల్ లక్ష్మీనరసింహచార్యులు, కారంపూడి నరసింహచార్యులు, ఆలయ అధికారులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment