త్వరలో పంటల పరిశీలనకు కేసీఆర్‌ | Sakshi
Sakshi News home page

త్వరలో పంటల పరిశీలనకు కేసీఆర్‌

Published Wed, Mar 27 2024 4:54 AM

KCR to Visit Damaged Crops on soon - Sakshi

బోర్లు వేసి నష్టపోయిన ముషంపల్లి నుంచి షురూ

భువనగిరి, ఆలేరు నియోజకవర్గాల్లో పర్యటన

రూట్‌మ్యాప్‌ ఖరారు చేసే బాధ్యత జగదీశ్‌రెడ్డికి

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో జరిగిన పంట నష్టాన్ని పరిశీలించేందుకు బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు త్వరలో క్షేత్రస్థాయిలో పర్యటించనున్నారు. సాగునీరు అందక భూగర్భ జలవనరులు కూడా అడుగంటిన పరిస్థితిలో రైతులతో ప్రత్యక్షంగా భేటీ కావాలని కేసీఆర్‌ భావిస్తున్నారు. క్షేత్రస్థాయి పర్య టనలో భాగంగా భువనగిరి, ఆలేరు నియోజక వర్గాల్లో పంట పొలాలను పరిశీలించి రైతులతో భేటీ అవుతారు. ఏప్రిల్‌ మొదటి వారంలో కేసీఆర్‌ పర్యటన ఉంటుందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి మంగళవారం మీడియా ప్రతినిధులకు సూచనప్రా యంగా చెప్పారు. అత్యధికంగా బోర్లు వేసి నష్టపో యిన ముషంపల్లి నుంచి ఈ పర్యటన ప్రారంభమయ్యేలా కేసీఆర్‌ పర్యటన షెడ్యూలు ఉండే అవకాశముంది. కేసీఆర్‌ పర్యటన షెడ్యూ ల్‌తోపాటు రూట్‌మ్యాప్‌ ఖరారు చేసే బాధ్యతను జగదీశ్‌రెడ్డికి అప్పగించారు.

మొదలైన లోక్‌సభ నియోజకవర్గ భేటీలు
లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు ఖరారైన నేపథ్యంలో నియోజకవర్గాల వారీగా మంగళవారం భేటీలు ప్రారంభమయ్యాయి. వరంగల్‌ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని నేతలతో సోమవారం రాత్రి మాజీ మంత్రి హరీశ్‌రావు నివాసంలో కీలక భేటీ జరగ్గా, మంగళవారం ఉదయం సికింద్రాబాద్‌ నేతలతో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ భేటీ అయ్యారు. నల్లగొండ నియోజకవర్గ నేతల సమన్వయ భేటీ కూడా జగదీశ్‌రెడ్డి నివాసంలో మంగళవారం రాత్రి జరిగింది. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నేతలతో బుధవారం తెలంగాణ భవన్‌లో భేటీ జరగనుంది. ఈ భేటీకి కేటీఆర్‌ హాజరవుతారు. ఇదిలాఉంటే మెదక్, చేవెళ్ల, పెద్దపల్లి తదితర లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోనూ అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమావేశాలు ప్రారంభమయ్యాయి.

Advertisement
 
Advertisement