yadari bhuvanagiri district
-
‘సురేంద్రపురి’ కుందా సత్యనారాయణ కన్నుమూత
Surendra Puri creator kunda satyanarayana died: యాదాద్రికి సమీపంలో ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం సురేంద్రపురి కళాధామం సృష్టికర్త, ప్రముఖ పారిశ్రామికవేత్త కుందా సత్యనారాయణ బుధవారం కన్నుమూశారు. 1938 జూన్ 15వ తేదీన జన్మించిన ఆయనకు భార్య హైమావతి, కుమారులు శ్రీనివాస్, ప్రతాప్, కుమార్తె సూర్యకుమారి ఉన్నారు.మూడు నెలలుగా అనారోగ్యంతో బాధపడుతోన్న సత్యనారాయణ బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు తుదిశ్వాస విడిచారని కుటుంబ సభ్యులు వెల్లడించారు. ఈరోజు మధ్యాహ్నం హైదరాబాద్‌లోని జూబ్లిహిల్స్ మహాప్రస్థానంలో కుందా సత్యనారాయణ భౌతిక కాయానికి అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా బస్వాపురం గ్రామానికి చెందిన కుందా సత్యనారాయణ మూడో కుమారుడు సురేంద్రబాబు 1991లో మరణించగా.. ఆయన జ్ఞాపకార్థం 1998లో యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వడాయిగూడెం గ్రామపంచాయతీ పరిధిలో స్థలం కొని ఆ ప్రాంతా నికి సురేంద్రపురి ప్రాంగణంగా నామకరణం చేశారు. కాశీ నుంచి కన్యాకుమారి వరకు గల ఆలయాలన్నింటినీ ఒకే ప్రదేశంలో చూసిన అనుభూతి కలగాలన్న ఉద్దేశంతో 2008లో వివిధ ప్రముఖ ఆలయాల పోలికతో దేవాలయాలు, దేవుళ్ల విగ్రహాలు కట్టించారు. రామాయణ, మహాభారత, భాగవత సన్నివేశాలను విగ్రహాల రూపంలో ఏర్పాటు చేయించారు. ఈ ప్రాంతానికి ‘కుందా సత్యనారాయణ కళాధామం' పేరు పెట్టారు. -
Yadadri: రాజగోపురం దిగువభాగంలో ఆధ్యాత్మిక రూపాలు
యాదగిరిగుట్ట: యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రాభివృద్ధిలో భాగంగా ప్రధానాలయం పడమటి రాజగోపురం దిగువభాగంలో నిర్మించిన రిటైనింగ్ వాల్‌పై ఆధ్యాత్మిక రూపాలతో కూడిన ప్యానల్స్ ఏర్పాటు చేసేందుకు వైటీడీఏ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే బిగించిన ఏనుగుల ప్యానల్స్ మధ్యలో నృసింహుడితో పాటు శంఖు, చక్రనామాలు, వివిధ దేవతామూర్తులు కొలువైన ప్యానల్స్‌ను బిగించనున్నారు. కాకతీయతోరణం మాదిరిగా ఉన్న ఈ ప్యానల్స్‌ను రాజస్తాన్ నుంచి తెప్పించారు. ఇండోర్ నుంచి ద్వారక కంపెనీ ఆధ్వర్యంలో తెప్పించిన విద్యుత్ దీపాలను పుష్కరిణి చుట్టూ వాల్‌పై ఏర్పాటు చేస్తున్నారు. సీతాకోక చిలుక రెక్కల ఆకారంలో ఉన్న ఈ ఆర్నమెంటల్ విద్యుత్ దీపాలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. ధర్మదర్శనానికి గంట! యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. హైదరాబాద్ జంటనగరాలతో పాటు వివిధ ప్రాంతాల నుంచి సుమారు 20వేలమంది భక్తులు వచ్చి స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. ధర్మ దర్శనానికి గంట, అతిశీఘ్ర దర్శనాలకు 20 నిమిషాల సమయం పట్టింది. భక్తుల రద్దీ దృష్ట్యా వాహనాలను కొండపైకి అనుమతించలేదు. పాతగుట్టలో సైతం భక్తుల రద్దీ కొనసాగింది. వివిధ పూజల ద్వారా ఆలయానికి రూ.16,58,864 ఆదాయం వచి్చనట్లు అధికారులు వెల్లడించారు. -
సీఎం కేసీఆర్ భోజనం: 23 రకాల వెరైటీలతో మెనూ!
తుర్కపల్లి: యాదాద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వాసాలమర్రి గ్రామస్తులు ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. 2020 అక్టోబర్ 31న ముఖ్యమంత్రి కేసీఆర్ జనగామ జిల్లా కొడకండ్లలో రైతువేదిక భవనాన్ని ప్రారంభించి తిరుగుప్రయాణంలో ఎర్రవల్లిలోని తన ఫాంహౌస్‌కు వెళ్తూ వాసాలమర్రిలో ఆగి గ్రామస్తులతో మాట్లాడిన విషయం విదితమే. అప్పట్లో గ్రామస్తులకు ఇచ్చిన మాట ప్రకారం ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం రానున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి తరహాలో వాసాలమర్రిని అభివృద్ధి చేస్తానని గతంలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన విషయం విదితమే. కేసీఆర్ తొలుత గ్రామస్తులతో కలసి సహపంక్తి భోజనం చేస్తారు. ఇక మటన్, చికెన్, పప్పు, పచ్చిపులుసుతో సహా 23 రకాల వంటకాలు.. వాసాలమర్రి సహపంక్తి భోజనాల కోసం సిద్ధమవుతున్నాయి. మటన్, చికెన్, చేపలు, బోటీ, తలకాయ కూర, గుడ్డు, రెండు రకాల స్వీట్లు, పాలక్‌పన్నీర్, బిర్యానీ రైస్, పులిహోర, పప్పు, సాంబారు, రసం, వంకాయ, ఆలుగడ్డ, మసాల పాపడాలు, పచ్చిపులుసు, చట్నీలు, చల్లచారు తదితర వంటకాలతో భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటూ వంటలు వండిస్తున్నారు. చదవండి: CM KCR: ‘టాలెస్ట్ టవర్ ఆఫ్ వరంగల్’గా ఆస్పత్రి -
‘టీఆర్ఎస్ ఒక నీటి బుడగ లాంటిది’
సాక్షి, యాదాద్రి : టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక నీటి బుడగ లాంటిదని, ఎప్పుడు పేలిపోయేది తెలియదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా యాదాద్రి భువనగిరిలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో ఆధికారం చేపట్టే దిదశగా బీజేపీ సభ్యత్వ నమోదును ముమ్మరం చేస్తున్నట్లు వెల్లడించారు. జమ్మూకశ్మీర్ పరిణామం తర్వాత దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూల వాతావరణం నెలకొందని తెలిపారు. గ్రామాల్లో సర్పంచులు ఎన్నికై 3 నెలలు గడుస్తున్నా వారికి నిధులు ఇవ్వలేదని, కేంద్రం ఆర్థిక సంఘం ద్వారా ఇస్తున్న నిధులను కేసీఆర్ పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు. రాష్టంలో 3 లక్షల ఖాళీ ఉద్యోగాలు ఉంటే కేవలం 20 వేల ఉద్యోగాలకు మాత్రమే నోటిఫికేషన్ విడుదల చేశారని మండిపడ్డారు. నియంతృత్వ పాలన సాగిస్తున్న టీఆర్ఎస్లో అంతర్గత అసంతృప్తులు ఉన్నాయని పేర్కొన్నారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో యువకులకు కేసీఆర్ అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ను ఎదుర్కొనే దమ్ము కేవలం బీజేపీకే ఉందని అందుకే బీజేపీలో భారీగీ చేరికలు వస్తున్నాయని తెలిపారు. ఈ నెల 18న జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఆధ్వర్యంలో వేలాది మంది బీజేపీలో చేరుతున్నట్లు స్పష్టం చేశారు. -
యాదాద్రిలో రెచ్చిపోయిన దోపిడీ దొంగలు
రాజుపేట : యాదాద్రి భువనగిరి జిల్లాలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. రాజుపేట మండలం కాల్వపల్లి గ్రామంలో మంగళవారం రాత్రి తాళం వేసి ఉన్న మూడు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలను సేకరిస్తున్నారు. రూ. 85 వేల నగదు, బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. చోరీ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.