ఫైనల్ రౌండ్ లో వెరిజోన్, ఏటీ అండ్ టీ ఢీ
యాహు కోర్ ఇంటర్నెట్ ఆస్తుల వేలం పాటలో అమెరికా టెలి కమ్యూనికేషన్ దిగ్గజ సంస్థలు వెరిజోన్ కమ్యూనికేషన్, ఏటీ అండ్ టీ పోటీపడనున్నాయి. ఈ రెండు టెలికం సంస్థలు వేలం బిడ్డింగ్ లో చివరి రౌండ్ కు రానున్నాయని మార్కెట్ వర్గాలు చెప్పాయి. వెరిజోన్, అమెరికాలో అతిపెద్ద వైర్ లెస్ క్యారియర్ గా ఉండగా.. ఏటీ అండ్ టీ రెండో అతిపెద్ద టెలికమ్యూనికేషన్ సంస్థ. ఈ రెండు సంస్థలు ఇప్పుడు యాహు బిడ్డింగ్ పై పోటీపడనున్నాయి. యాహు బిడ్డింగ్ ను ఈ రెండు సంస్థలు చాలెంజ్ గా తీసుకున్నాయి.
గతవారమే ఈ వేలం రెండో రౌండ్ను యాహు ముగించుకుంది. ఈ రౌండ్ బిడ్స్ రూ.35 కోట్ల నుంచి రూ.50 కోట్ల మధ్య నమోదయ్యాయని మార్కెట్ వర్గాలు చెప్పాయి. వచ్చే నెలలో ఈ వేలాన్ని ముగించేయాలని యాహు భావిస్తున్నట్టు పేర్కొన్నాయి. కాలిఫోర్నియాకు చెందిన ఈ కంపెనీ హెడ్జ్ ఫండ్ స్టాండర్డ్ విలువ పడిపోవడంతో తన ఆస్తుల అమ్మకం మొదలుపెట్టింది. కొన్ని ప్రైవేట్ ఈక్విటీ సంస్థలు సెకండ్ రౌండ్ కు వెళ్లినా, మూడో రౌండ్ కు తమ జాబితాను నమోదు చేసుకోలేకపోయాయి. ఈ బిడ్స్ దాఖలును అధికారికంగా చేపట్టినట్టు ఆ కంపెనీకి చెందిన ఓ అధికారి పేర్కొన్నారు. అయితే ఈ విషయంపై స్పందించడానికి యాహు, వెరిజోన్, ఏటీ అండ్ టీలు తిరస్కరించాయి. ఈ బిడ్డింగ్ కు క్వికెన్ లోన్స్ ఇంక్ వ్యవస్థాపకుడు డాన్ గిల్బర్ట్ కన్సార్షియంగా వ్యవహరిస్తున్నారు.