yakathpura
-
ఉద్యోగం లేదని యువతి ఆత్మహత్య
యాకుత్‌పురా: ఇంజినీరింగ్ చదివిని ఓ యువతి ఉద్యోగం రావడంలేదని ఆత్మహత్య చేసుకుంది. మీర్‌చౌక్ ఎస్ఐ అంజిరెడ్డి కథనం ప్రకారం... మీరాలంమండి జేజేనగర్ ప్రాంతానికి చెందిన శ్రీహరి, అరుణ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కుమారులు సంతానం. పెద్ద కూతురు చంద్రవేణి (23) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉంది. ఇటీవల కానిస్టేబుల్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకొని విఫలమైంది. బీటెక్ చదివినా ఉద్యోగం రాకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన చంద్రవేణి ఆదివారం రాత్రి ఫ్యాన్ కు చున్నీతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబసభ్యుల సమాచారం మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అందరికీ న్యాయ సహాయం
యాకుత్‌పురా: పారా లీగల్ వలంటీర్లందరూ ఇచ్చిన సూచనల ప్రకారం ప్రజలం దరికీ న్యాయ సహాయం అందించేందుకు కృషి చేయాలని సిటీ సివిల్ కోర్టు చీఫ్ జడ్జి ఎన్.బాలయోగి సూచించారు. పురానీహవేలిలోని న్యాయసేవ సదస్సులో తెలంగాణ లీగల్ సర్వీసెస్ అథారిటీ, సిటీ సివిల్ కోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో గురువారం పారా లీగల్ వాలంటీర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. 65 మంది పారా లీగల్ వలంటీర్లకు గుర్తింపు కార్డులను అందజేశారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన జడ్జి ఎన్ .బాలయోగి మాట్లాడుతూ... బస్తీలు, కాలనీల్లో వివిధ సమస్యలతో సతమతమవుతున్న ప్రజలకు న్యాయ వ్యవస్థపై అవగాహన కల్పించేందుకు పారా లీగల్ లంటీర్లను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. చట్టాలపై ప్రజలకు అవగాహన కల్పించి వారికి న్యాయం చేకూర్చే విధంగా పని చేయాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాలు, ఏదైన సంఘటన జరిగినప్పుడు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు, కుటుంబ తగాదాలు తదితర అంశాలతో ఇబ్బందులు పడుతూ న్యాయ సహాయం కోరే వారికి వలంటీర్లు చేయూతనివ్వాలన్నారు. సదస్సులో తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ఇన్ చార్జి సభ్య కార్యదర్శి పీవీ రాంబాబు, అడ్మినిసే్ట్రటివ్ ఆఫీసర్ శ్రీనివాస శివరాం, సిటీ సివిల్ కోర్టు లీగల్ సర్వీసెస్ అథారిటీ కార్యదర్శి వై.వీర్రాజు, న్యాయవాదులు ఎస్.వేణుగోపాల్, మంజుష, విజేత తదితరులు పాల్గొన్నారు. -
స్కూల్ టీచర్ అదృశ్యం...
యాకుత్‌పురా: పాఠశాలకు వెళ్లిన ఓ టీచర్ కనిపించకుండా పోయిన సంఘటన ఛత్రినాక పోలీస్‌స్టేషన్ పరిధిలో శనివారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... సుల్తాన్షాహి ప్రాంతానికి చెందిన జైకిషన్ కూతురు బబ్లీ (23) రాజన్నబావిలోని శ్రీ సాయి గ్రామర్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తుంది. ఈ నెల 2వ తేదీన ఉదయం 8.30 గంటలకు పాఠశాలకని ఇంట్లో నుంచి బయలుదేరింది. సాయంత్రమైనా తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు స్నేహితులు, బంధువుల ఇళ్లతో పాటు సాధ్యమైనన్ని ప్రాంతాల్లో వాకబు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంట్లో నుంచి బయటికి వెళ్లినప్పుడు బబ్లీ గ్రీన్ షర్ట్ షెల్వార్, పింక్ కమీజ్ ధరించింది. ఆచూకీ తెలిసిన వారు 040-27854788లో సంప్రదించాలన్నారు.