yakuthpura
-
చిన్నారిపై వృద్ధుడి అత్యాచారయత్నం
సాక్షి, హైదరాబాద్(యాకుత్‌పురా) : రెండున్నరేళ్ల బాలికపై ఓ వృద్ధుడు లైంగిక దాడికి యత్నించాడు. ఈ సంఘటన మొఘల్‌పురా పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగింది. ఇన్స్పెక్టర్ రవికుమార్ తెలిపిన వివరాల మేరకు.. సుల్తాన్షాహి ప్రాంతానికి చెందిన ఎం.ఏ.జబ్బర్(72) స్థానికంగా ఉన్న కైసర్ హోటల్లో వెయిటర్‌గా పనిచేస్తున్నాడు. బుధవారం సాయంత్రం 5 గంటల సమయంలో స్థానికంగా ఉండే రెండున్నరేళ్ల బాలికను హోటల్ వెనుకాల ఉన్న నిర్మాణ దశలో ఉన్న భవనంలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి యత్నించాడు. ఈ సంఘటనపై బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో కుటుంబ సభ్యులు మొఘల్‌పురా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు జబ్బర్‌కు భర్య, పిల్లలున్నారు. గత కోన్నేళ్లుగా అతని ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో కుటుంబసభ్యులు ఇంట్లో నుంచి బయటకు పంపించినట్లు పోలీసులు పేర్కొన్నారు. వృద్ధుడి కోసం పోలీసులు పలు బృందలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. -
గొంతు కోసి గృహిణి హత్య
యాకుత్‌పురా: గొంతు కోసి గృహిణిని హత్య చేసిన ఘటన శుక్రవారం రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. అనుమానంతో భర్తే ఆమెను చంపి ఉంటాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హతురాలి తల్లిదండ్రులు, ఇన్స్పెక్టర్ జి.రమేశ్ కథనం ప్రకారం...యాకుత్‌పురా హఫేజ్‌నగర్‌లో నివాసం ఉండే మహ్మద్ ఆరీఫ్, తహసీన్ ఫాతీమా అలియాస్ తస్కీన్ (23)లకు 2011లో పెళ్లైంది. వీరికి ముగ్గురు కుమారులున్నారు. ఆటో ట్రాలీ నడుపుతూ ఆరీఫ్ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. భార్యపై అనుమానంతో మూడు నెలలుగా నిత్యం గొడవపడేవాడు. ఆమెను కొట్టి, చిత్రహింసలు పెట్టేవాడు. గురువారం రాత్రి 1 గంట ప్రాంతంలో అదే విషయమై మళ్లీ భార్యతో గొడవపడ్డాడు. శుక్రవారం ఉదయం ఆరీఫ్ ఇంట్లో రక్తం మడుగులు కట్టి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించగా.. రక్తపుమడుగులో తస్కీన్ మృతి చెంది ఉంది. ఎవరో ఆమె గొంతు కోసి చంపినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఇంట్లో ఉన్న చిన్నారులను ఈ హత్య గురించి ఆరా తీయగా తాము నిద్రలో ఉన్నామని, తమకు ఏమీ తెలియదని చెప్పారని పోలీసులు తెలిపారు. భర్త పరారీలో ఉంటంతో అతడే తస్కీన్‌ను హతమార్చి పరారై ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బోనాల ఉత్సవాలకు కంట్రోల్ రూమ్
యాకుత్‌పుర: హైదరాబాద్ నగరంలో బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయాల వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సర్దార్ మహల్ జీహెచ్ఎంసీ దక్షిణ మండలం కార్యాలయంలో కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశామని జోనల్ కమిషనర్ ఎం. బాలసుబ్రమణ్యం రెడ్డి తెలిపారు. ఈ కంట్రోల్ రూమ్‌లో జీహెచ్ఎంసీలోని ఆరోగ్యం, పారిశుధ్యం, ఇంజనీరింగ్, సీపీడీసీఎల్, రెవెన్యూ, జలమండలి అధికారులు అందుబాటులో ఉంటారని.. ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా 040-24500254లో సమాచారం అందించాలని సూచించారు. మూడు షిఫ్టులలో 24 గంటల పాటు అన్ని విభాగాలకు చెందిన సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
హైదరాబాద్: నగరంలోని యాకుత్‌పూర సమీపంలో రైల్వే ట్రాక్‌పై ఓ వ్యక్తి మృతదేహం కనిపించింది. గురువారం ఉదయం రైల్వే ట్రాక్‌పై మృతదేహం ఉండటంతో స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. అనంతరం మృతదేహాన్ని ఉస్మానియా జనరల్ ఆస్పత్రికి తరలించారు.