భర్త, పిల్లలతో హతురాలు తస్కీన్
యాకుత్‌పురా: గొంతు కోసి గృహిణిని హత్య చేసిన ఘటన శుక్రవారం రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. అనుమానంతో భర్తే ఆమెను చంపి ఉంటాడని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. హతురాలి తల్లిదండ్రులు, ఇన్‌స్పెక్టర్ జి.రమేశ్ కథనం ప్రకారం...యాకుత్‌పురా హఫేజ్‌నగర్‌లో నివాసం ఉండే మహ్మద్ ఆరీఫ్, తహసీన్ ఫాతీమా అలియాస్ తస్కీన్ (23)లకు 2011లో పెళ్లైంది. వీరికి ముగ్గురు కుమారులున్నారు. ఆటో ట్రాలీ నడుపుతూ ఆరీఫ్ కుటుంబాన్ని పోషిస్తున్నాడు.
భార్యపై అనుమానంతో మూడు నెలలుగా నిత్యం గొడవపడేవాడు. ఆమెను కొట్టి, చిత్రహింసలు పెట్టేవాడు. గురువారం రాత్రి 1 గంట ప్రాంతంలో అదే విషయమై మళ్లీ భార్యతో గొడవపడ్డాడు. శుక్రవారం ఉదయం ఆరీఫ్ ఇంట్లో రక్తం మడుగులు కట్టి ఉండటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించగా.. రక్తపుమడుగులో తస్కీన్ మృతి చెంది ఉంది. ఎవరో ఆమె గొంతు కోసి చంపినట్టు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియా మార్చురీకి తరలించారు. ఇంట్లో ఉన్న చిన్నారులను ఈ హత్య గురించి ఆరా తీయగా తాము నిద్రలో ఉన్నామని, తమకు ఏమీ తెలియదని చెప్పారని పోలీసులు తెలిపారు. భర్త పరారీలో ఉంటంతో అతడే తస్కీన్‌ను హతమార్చి పరారై ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.