yards
-
‘సమీకృతం’... మార్కెట్లు నిర్మాణంలో జాప్యం!
భైంసాటౌన్(ముధోల్): పట్టణాల్లో కూరగాయలు, మాంసం, చేపలు, పూలు, పండ్లు... ఇలా అన్ని మార్కెట్లు ఒకేచోట అందుబాటులో ఉండేలా ప్రభుత్వం సమీకృత మార్కెట్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే జిల్లా కేంద్రమైన నిర్మల్‌తో పాటు భైంసా, ఖానాపూర్ పట్టణాల్లో సమీకృత మార్కెట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రెండెకరాల స్థలంలో వెజ్, నాన్‌వెజ్, పూలు, పండ్ల దుకాణాలు ఒకే ఆవరణలో ఉండేలా నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా భైంసా, ఖానాపూర్‌లో ఏడాదిన్నరగా పనులు కొనసా...గుతుండగా, నిర్మల్‌లో ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం, గుత్తేదారులకు సకాలంలో బిల్లులు అందక పనుల్లో జాప్యం నెలకొందనే విమర్శలున్నాయి. ఎప్పటికి పూర్తయ్యేనో? జిల్లాలోని నిర్మల్, భైంసా, ఖానాపూర్ పట్టణాల సమీకృత మార్కెట్ల నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతను పబ్లిక్‌హెల్త్ శాఖకు అప్పగించింది. వారు టెండర్లు పిలిచి, గుత్తేదారులతో ఒప్పందం చేసుకుని పనులు ప్రారంభించారు. 2021లోనే స్థలాలు పరిశీలించగా నిర్మల్ మినహా భైంసా, ఖానాపూర్‌లలో స్థలాలు ఎంపిక చేసి పనులు సైతం ప్రారంభించారు. నిర్మల్‌లో ఆర్టీసీ స్థలం పరిశీలించినా సంస్థ స్థలం ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడంతో మరోచోట పరిశీలించారు. భైంసా, ఖానాపూర్‌లో పనులు ప్రారంభించినా ఏడాదిలోపు పూర్తి చేయాలని నిబంధనలున్నాయి. దాదాపు ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ పనులు కొనసాగే దశలోనే ఉన్నాయి. అఽధికారులు దృష్టి సారించి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని పలువురు కోరుతున్నారు. ● నిర్మల్‌లో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సంస్థ స్థలం పరిశీలించగా వారు ఒప్పుకోలేదు. దీంతో అప్పటి నుంచి పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. ప్రస్తుతం పాత తహసీల్దార్ కార్యాలయం స్థలంలో మార్కెట్ నిర్మించాలని నిర్ణయించారు. రెండు, మూడురోజుల్లో పాత భవనం కూల్చివేసి పనులు ప్రారంభించనున్నట్లు అఽధికారులు చెబుతున్నారు. ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో రూ.7.20 కోట్లతో దాదాపు 140 దుకాణాలతో మార్కెట్ నిర్మాణం చేపట్టనున్నారు. ● భైంసా పట్టణంలోని మిర్చి మార్కెట్ యార్డులో సమీకృత మార్కెట్ నిర్మాణం చేపడుతున్నారు. రూ.7.20 కోట్ల నిధులతో 90 (26నాన్‌వెజ్, 64వెజ్) దుకాణాలతో సముదాయం నిర్మిస్తున్నారు. ఇక్కడ వెజ్ బ్లాక్ పనులు స్లాబ్ లెవల్ వరకు కాగా నాన్‌వెజ్ బ్లాక్ రూఫ్ లెవల్ వరకు పూర్తయ్యాయి. ఆగస్టు నెలాఖరు వరకు పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు. ● ఖానాపూర్‌లో రూ.3.90 కోట్లతో మార్కెట్ నిర్మాణ పనులు చేపట్టగా దాదాపు 40 శాతానికిపైగా పూర్తయ్యాయి. 20 వెజ్, 20 నాన్‌వెజ్ దుకాణాలు నిర్మిస్తుండగా రెండు రూఫ్ లెవల్ వరకు పూర్తయ్యాయి. ఆగస్టు వరకు వినియోగంలోకి... భైంసా, ఖానాపూర్‌లలో పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏడాదిలోపు పూర్తి చేయాలని నిబంధనలున్నా.. త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆగస్టు నెలాఖరు వరకు పనులు పూర్తయ్యేలా చూస్తాం. నిర్మల్‌లో పాత తహసీల్దార్ కార్యాలయం స్థలం పరిశీలించి త్వరలోనే పనులు ప్రారంభిస్తాం. – హరిభువన్గౌడ్, పబ్లిక్ హెల్త్ ఏఈ -
డిమాండ్‌కు మించి ఇసుక నిల్వలు
సాక్షి, అమరావతి: నదుల్లో వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కొరతను అధిగమించడం, మాఫియాను అరికట్టడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 14న ప్రారంభించిన ఇసుక వారోత్సవాలు విజయవంతం కావడంతో నిర్మాణ రంగ పనులు ఊపందుకున్నాయి.వచ్చే ఐదేళ్లకు సరిపడా ఇసుక మేటలు నదుల్లోకి వచ్చాయని ప్రభుత్వం తెలిపింది. అక్రమ తవ్వకాలు, అధిక ధరలకు విక్రయం లాంటి చర్యలకు పాల్పడితే రెండేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ. 2 లక్షలు జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ జీవో జారీ చేసింది. నూతన విధానం నేపథ్యంలో ఈనెల 14నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాల సందర్భంగా తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. ఇసుక కొరత పరిష్కారమై ప్రస్తుతం స్టాక్ యార్డుల నిండా నిల్వలున్నాయి. అధిక ధరలకు కళ్లెం రివర్స్ టెండర్ల ద్వారా తక్కువ ధరకే ప్రజలకు ఇసుక అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రేవుల నుంచి ఇసుక డిపోల దూరాన్ని బట్టి రవాణా చార్జీలను లెక్కించారు. ప్రాంతాలవారీగా ధరలను ఖరారు చేసి రేటు కార్డులను ప్రకటించారు. ఫలితంగా ప్రధాన నగరాల్లో ఇసుక ధరలు అందుబాటులోకి వచ్చాయి. ఫుల్ ‘స్టాక్!’ ఇసుక వారోత్సవాల ప్రారంభం సందర్భంగా ఈనెల 14వ తేదీన 1.61 లక్షల టన్నుల ఇసుక స్టాక్ యార్డులకు చేరింది. వారోత్సవాల ముగింపు రోజైన గురువారం ఏకంగా 2.82 లక్షల టన్నుల ఇసుక స్టాక్ యార్డుల్లో ఉండటం గమనార్హం. ఫిర్యాదుల కోసం 14500 అక్రమంగా ఇసుక తవ్వకాలు, రవాణాపై ఫిర్యాదు చేసేందుకు 14500 టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా 35కిపైగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చర్యలు చేపట్టారు. తొలిరోజే లక్ష్యాన్ని అధిగమించి... రాష్ట్రంలో రోజువారీ ఇసుక డిమాండ్ గరిష్టంగా 80 వేల టన్నులు కాగా వారోత్సవాల మొదటి రోజే ఈ లక్ష్యాన్ని అధిగమించడం విశేషం. శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో తొలిరోజు కొత్తగా 17 రీచ్‌లను ప్రారంభించారు. తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో ఇసుక తవ్వకాలకు 12 పట్టా భూముల్లో అనుమతులు మంజూరు చేశారు. తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాల్లోని జలాశయాల్లో మేట వేసిన ఇసుకను వెలికి తీసేందుకు రెండు చోట్ల అనుమతులిచ్చారు. 13 జిల్లాల పరిధిలో అదనంగా 34 స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేశారు. -
360 గజాల చీర తయారీ
తూర్పుగోదావరి, అమలాపురం రూరల్ : అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీరను తయారు చేసిన ఘనత మన నేతన్నలదే. ఇప్పుడు మరో రికార్డు నేతన్నలు సృష్టించారు. చేనేత గ్రామమైన బండార్లంకలో 360 గజాల ఎరుపు రంగు చీరను తయారు చేశారు. సాధారణ చేనేత చీర ఆరు నుంచి ఏడు గజాల వరకు తయారు చేస్తారు.అయితే ఈ కార్మికులు ఏకంగా 360 గజాల చీరను తయారు చేసి అబ్బురపరిచారు. ఈ భారీ చీర తయారీలో గ్రామంలోని చేయి తిరిగిన నేతలన్నలు నల్లా సత్యానందం, ఈశ్వరి దంపతులు పూర్తి చేశారు. జిల్లాలో చేనేతకు ప్రసిద్ధి చెందిన బండార్లంకలో 360 గజాల చేనేత చీర తయారీకి ఇటీవల శ్రీకారం చుట్టారు. 360 గజాల అతిపెద్ద పడుగుతో పట్టిన అతిపెద్ద అల్లికను చూసేందుకు జనం తరలివచ్చారు. పసుపు రంగు పడుగుపై కుంకుమ రంగు పెనవేసి పవిత్రంగా ఈ చీరను నేశారు. కోనసీమ దేవాంగ సంక్షేమ సంఘ అధ్యక్షుడు చింతా శంకరమూర్తి, చేనేత సొసైటీ అధ్యక్షుడు పుత్సల వరద రాజులు ఆధ్వర్యంలో చేనేత కార్మికులు కాపటవీధిలో కొబ్బరికాయ కొట్టి ఈ చీర తయారీని ప్రారంభించారు. అల్లు పనిలో లింగ వయోభేదం లేకుండా కార్మికులందరూ పాల్గొన్నారు. మంగళవారం చీరను ప్రదర్శించారు. మగ్గంపై నెయ్యడానికి 50 రోజులు సమయం పట్టిందని సత్యనందం తెలిపారు. ఈ చీరను గ్రామదేవత గంగాదేవి మురుగులమ్మవారికి మార్చి 18న ఉగాది రోజున సమర్పిస్తామని సొసైటీ అధ్యక్షుడు వరదరాజులు చెప్పారు. అనంతరం గ్రామంలోని ముత్తయిదువులు, ఆడపడుచులు, పెద్దలకు చీరలను 60 మందికి పంపిణీ చేస్తామని తెలిపారు.కార్యక్రమంలో సర్పంచి బడుగు సత్యనారాయణ, చింతపట్ల గంగా సత్యనారాయణ, యాళ్ల సుబ్రహ్మణ్యం, బట్లు బాలకృష్ణ పాల్గొన్నారు. -
యాడ్ చూస్తే.. టాక్‌టైం ఫ్రీ!
ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐఏఎంఏఐ), రీసెర్చ్ సంస్థ ఐఎంఆర్బీ నివేదిక ప్రకారం 2015 నాటికి భారత్‌లో ఆన్లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య 60 శాతం పెరిగి 3.9 కోట్లకు చేరుకుంటుంది. ఈ కామర్స్ మార్కెట్ విలువ సుమారు 70 బిలియన్ డాలర్ల మేర ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇందులో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు క్యాష్‌కరోడాట్‌కామ్ వంటి సంస్థలు వినూత్న ప్రయోగాలు చేస్తున్నాయి. ఢిల్లీకి చెందిన ఈ సంస్థ ఆన్లైన్ షాపింగ్ చేస్తే ఎదురు డబ్బు ఇస్తామంటోంది. రోహన్ భార్గవ, స్వాతి భార్గవ దంపతులు ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన ఈ సంస్థ ఇప్పటికే 350 ఈకామర్స్ సంస్థలతో డీల్ కుదుర్చుకుంది. ఇందులో శ్నాప్‌డీల్, మింత్రా, యాత్రా వంటి సైట్స్ ఉన్నాయి. ప్రతి నెలా అయిదు నుంచి పది దాకా రిటైలింగ్ సంస్థలతో క్యాష్‌కరో భాగస్వామ్యం కుదుర్చుకుంటోంది. అమెరికా, యూరప్ వంటి చోట్ల వాడుకలో ఉన్న ఈ కాన్సెప్టు భారత్‌లోనూ క్రమంగా ప్రాచుర్యంలోకి వస్తోంది. అమెరికాలో ఈబేట్స్, బ్రిటన్‌లో క్విడ్కోడాట్కాం వంటి సంస్థలు ఈ తరహా వ్యాపారంపై 100 మిలియన్ డాలర్ల మేర ఆదాయాలు ఆర్జిస్తున్నాయి. ఇలా పనిచేస్తుంది..: క్యాష్‌కరో సంస్థ కొన్ని రిటైలింగ్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. క్యాష్‌కరో సైటు ద్వారా జరిగే అమ్మకాలకు సంబంధించి ఆయా సంస్థలు.. క్యాష్కరోకి కొంత కమీషన్ ఇస్తాయి. క్యాష్‌కరో తను అందుకున్న కమీషన్లో కొంత భాగాన్ని కొనుగోలుదారులకు అందిస్తుంది. ఉదాహరణకు ఏదైనా సైటు 70% దాకా డిస్కౌంట్ ఇస్తున్న పక్షంలో, దానికి తోడు అదనంగా కస్టమర్‌కి మరో రూ.180 దాకా క్యాష్ బ్యాక్ కూడా లభించగలదని(ఆఫర్‌ని బట్టి) క్యాష్‌కరో స్వాతి భార్గవ వెల్లడించారు. రోహన్, స్వాతి 2011లో పోరింగ్ పౌండ్స్ పేరిట బ్రిటన్‌లో వ్యాపార సంస్థల కోసం ఈ తరహా వెబ్‌సైట్‌ని ఏర్పాటు చేశారు. ఆ అనుభవంతో దీన్ని దేశీయంగా కొనుగోలుదారుల కోసం ప్రారంభించారు. 7,50,000 డాలర్ల నిధులను సమీకరించిన క్యాష్కరోకి ప్రస్తుతం గుర్గావ్, చెన్నైలో ఆఫీసులు ఉన్నాయి. ఉచిత టాక్‌టైం...: ఐఏఎంఏఐ, ఐఎంఆర్బీ నివేదిక ప్రకారం 2011-12లో మొబైల్ యాడ్స్‌పై కంపెనీలు సుమారు రూ. 105 కోట్ల మేర వెచ్చించాయి. 2012 మార్చ్ నాటికి మొబైల్ ఇంటర్నెట్‌ని తరచుగా వినియోగించే వారి సంఖ్య 4.8 కోట్లకు చేరింది. దీంతో మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలపై ప్రకటనలు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. గతంలో ఎంజింజర్ వంటి సంస్థలు మొబైల్ అడ్వర్టైజింగ్ రంగంలో హల్చల్ చేశాయి. ప్రస్తుతం టెలికం కంపెనీ(టెల్కో)లు స్వయంగా రంగంలోకి దిగుతున్నాయి. తాజాగా మొబైల్ హ్యాండ్‌సెట్స్‌లో ప్రకటనలు చూస్తే ఉచితంగా వాయిస్ మినిట్స్ ఇస్తామంటూ టాటా టెలీ ఊరిస్తోంది. ఇందుకు ఎంయాడ్కాల్ సంస్థతో టైఅప్ పెట్టుకుంది. అలాగే ప్రకటనలు ఇచ్చేందుకు కొన్ని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనికోసం గెట్ పేరిట మొబైల్ అడ్వర్టైజింగ్ యాప్‌ని రూపొందించారు. డొకొమో డేటా ప్యాకేజీలు ఉండే హ్యాండ్‌సెట్‌లో కస్టమర్ చూసిన ప్రతి అడ్వర్టైజ్‌మెంట్‌కి ఇంత చొప్పున టాక్‌టైమ్‌ని సంస్థ ఉచితంగా అందిస్తుంది. ఇలా యాడ్స్‌ని చూసినందుకు టాటా డొకొమో ఇంటర్నెట్ ప్యాకేజీలో నుంచి డేటా చార్జీలు ఉండవు. ఎవరు, ఎప్పుడు తమ ప్రకటనలు చూస్తున్నారన్న వివరాలు తెలియడం వల్ల ప్రకటనకర్తలకూ ప్రయోజనం ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.