‘సమీకృతం’... మార్కెట్లు నిర్మాణంలో జాప్యం! | - | Sakshi
Sakshi News home page

‘సమీకృతం’... మార్కెట్లు నిర్మాణంలో జాప్యం!

Published Fri, Jun 23 2023 1:28 AM | Last Updated on Fri, Jun 23 2023 11:08 AM

భైంసాలో కొనసాగుతున్న సమీకృత మార్కెట్‌ పనులు - Sakshi

భైంసాలో కొనసాగుతున్న సమీకృత మార్కెట్‌ పనులు

భైంసాటౌన్‌(ముధోల్‌): పట్టణాల్లో కూరగాయలు, మాంసం, చేపలు, పూలు, పండ్లు... ఇలా అన్ని మార్కెట్లు ఒకేచోట అందుబాటులో ఉండేలా ప్రభుత్వం సమీకృత మార్కెట్ల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగానే జిల్లా కేంద్రమైన నిర్మల్‌తో పాటు భైంసా, ఖానాపూర్‌ పట్టణాల్లో సమీకృత మార్కెట్లు మంజూరు చేసింది. ఈ మేరకు రెండెకరాల స్థలంలో వెజ్‌, నాన్‌వెజ్‌, పూలు, పండ్ల దుకాణాలు ఒకే ఆవరణలో ఉండేలా నిర్మాణ పనులు చేపడుతున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా భైంసా, ఖానాపూర్‌లో ఏడాదిన్నరగా పనులు కొనసా...గుతుండగా, నిర్మల్‌లో ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. ఇంజినీరింగ్‌ అధికారుల నిర్లక్ష్యం, గుత్తేదారులకు సకాలంలో బిల్లులు అందక పనుల్లో జాప్యం నెలకొందనే విమర్శలున్నాయి.

ఎప్పటికి పూర్తయ్యేనో?
జిల్లాలోని నిర్మల్‌, భైంసా, ఖానాపూర్‌ పట్టణాల సమీకృత మార్కెట్ల నిర్మాణ పర్యవేక్షణ బాధ్యతను పబ్లిక్‌హెల్త్‌ శాఖకు అప్పగించింది. వారు టెండర్లు పిలిచి, గుత్తేదారులతో ఒప్పందం చేసుకుని పనులు ప్రారంభించారు. 2021లోనే స్థలాలు పరిశీలించగా నిర్మల్‌ మినహా భైంసా, ఖానాపూర్‌లలో స్థలాలు ఎంపిక చేసి పనులు సైతం ప్రారంభించారు. నిర్మల్‌లో ఆర్టీసీ స్థలం పరిశీలించినా సంస్థ స్థలం ఇచ్చేందుకు ఒప్పుకోకపోవడంతో మరోచోట పరిశీలించారు. భైంసా, ఖానాపూర్‌లో పనులు ప్రారంభించినా ఏడాదిలోపు పూర్తి చేయాలని నిబంధనలున్నాయి. దాదాపు ఏడాదిన్నర గడిచినా ఇప్పటికీ పనులు కొనసాగే దశలోనే ఉన్నాయి. అఽధికారులు దృష్టి సారించి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని పలువురు కోరుతున్నారు.

● నిర్మల్‌లో సమీకృత మార్కెట్‌ నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ఆర్టీసీ బస్టాండ్‌ సమీపంలో సంస్థ స్థలం పరిశీలించగా వారు ఒప్పుకోలేదు. దీంతో అప్పటి నుంచి పనుల్లో ఎలాంటి పురోగతి లేదు. ప్రస్తుతం పాత తహసీల్దార్‌ కార్యాలయం స్థలంలో మార్కెట్‌ నిర్మించాలని నిర్ణయించారు. రెండు, మూడురోజుల్లో పాత భవనం కూల్చివేసి పనులు ప్రారంభించనున్నట్లు అఽధికారులు చెబుతున్నారు. ఇప్పటికే టెండర్‌ ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో రూ.7.20 కోట్లతో దాదాపు 140 దుకాణాలతో మార్కెట్‌ నిర్మాణం చేపట్టనున్నారు.

● భైంసా పట్టణంలోని మిర్చి మార్కెట్‌ యార్డులో సమీకృత మార్కెట్‌ నిర్మాణం చేపడుతున్నారు. రూ.7.20 కోట్ల నిధులతో 90 (26నాన్‌వెజ్‌, 64వెజ్‌) దుకాణాలతో సముదాయం నిర్మిస్తున్నారు. ఇక్కడ వెజ్‌ బ్లాక్‌ పనులు స్లాబ్‌ లెవల్‌ వరకు కాగా నాన్‌వెజ్‌ బ్లాక్‌ రూఫ్‌ లెవల్‌ వరకు పూర్తయ్యాయి. ఆగస్టు నెలాఖరు వరకు పనులు పూర్తి చేస్తామని అధికారులు చెబుతున్నారు.

● ఖానాపూర్‌లో రూ.3.90 కోట్లతో మార్కెట్‌ నిర్మాణ పనులు చేపట్టగా దాదాపు 40 శాతానికిపైగా పూర్తయ్యాయి. 20 వెజ్‌, 20 నాన్‌వెజ్‌ దుకాణాలు నిర్మిస్తుండగా రెండు రూఫ్‌ లెవల్‌ వరకు పూర్తయ్యాయి.

ఆగస్టు వరకు వినియోగంలోకి...
భైంసా, ఖానాపూర్‌లలో పనులు వేగంగా జరుగుతున్నాయి. ఏడాదిలోపు పూర్తి చేయాలని నిబంధనలున్నా.. త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. ఆగస్టు నెలాఖరు వరకు పనులు పూర్తయ్యేలా చూస్తాం. నిర్మల్‌లో పాత తహసీల్దార్‌ కార్యాలయం స్థలం పరిశీలించి త్వరలోనే పనులు ప్రారంభిస్తాం.
– హరిభువన్‌గౌడ్‌, పబ్లిక్‌ హెల్త్‌ ఏఈ

No comments yet. Be the first to comment!
Add a comment
ఖానాపూర్‌లో సమీకృత మార్కెట్‌ పనులు1
1/1

ఖానాపూర్‌లో సమీకృత మార్కెట్‌ పనులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement