యాడ్ చూస్తే.. టాక్‌టైం ఫ్రీ!
ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐఏఎంఏఐ), రీసెర్చ్ సంస్థ ఐఎంఆర్‌బీ నివేదిక ప్రకారం 2015 నాటికి భారత్‌లో ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారి సంఖ్య 60 శాతం పెరిగి 3.9 కోట్లకు చేరుకుంటుంది. ఈ కామర్స్ మార్కెట్ విలువ సుమారు 70 బిలియన్ డాలర్ల మేర ఉంటుంది. ఈ నేపథ్యంలో ఇందులో అవకాశాలను అందిపుచ్చుకునేందుకు క్యాష్‌కరోడాట్‌కామ్ వంటి సంస్థలు వినూత్న ప్రయోగాలు చేస్తున్నాయి. ఢిల్లీకి చెందిన ఈ సంస్థ ఆన్‌లైన్ షాపింగ్ చేస్తే ఎదురు డబ్బు ఇస్తామంటోంది. రోహన్ భార్గవ, స్వాతి భార్గవ దంపతులు ఈ ఏడాది ఏప్రిల్‌లో ప్రారంభించిన ఈ సంస్థ ఇప్పటికే 350 ఈకామర్స్ సంస్థలతో డీల్ కుదుర్చుకుంది. ఇందులో శ్నాప్‌డీల్, మింత్రా, యాత్రా వంటి సైట్స్ ఉన్నాయి. ప్రతి నెలా అయిదు నుంచి పది దాకా రిటైలింగ్ సంస్థలతో క్యాష్‌కరో భాగస్వామ్యం కుదుర్చుకుంటోంది. అమెరికా, యూరప్ వంటి చోట్ల వాడుకలో ఉన్న ఈ కాన్సెప్టు భారత్‌లోనూ క్రమంగా ప్రాచుర్యంలోకి వస్తోంది. అమెరికాలో ఈబేట్స్, బ్రిటన్‌లో క్విడ్‌కోడాట్‌కాం వంటి సంస్థలు ఈ తరహా వ్యాపారంపై 100 మిలియన్ డాలర్ల మేర ఆదాయాలు ఆర్జిస్తున్నాయి.
ఇలా పనిచేస్తుంది..: క్యాష్‌కరో సంస్థ కొన్ని రిటైలింగ్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంటుంది. క్యాష్‌కరో సైటు ద్వారా జరిగే అమ్మకాలకు సంబంధించి ఆయా సంస్థలు.. క్యాష్‌కరోకి కొంత కమీషన్ ఇస్తాయి. క్యాష్‌కరో తను అందుకున్న కమీషన్‌లో కొంత భాగాన్ని కొనుగోలుదారులకు అందిస్తుంది. ఉదాహరణకు ఏదైనా సైటు 70% దాకా డిస్కౌంట్ ఇస్తున్న పక్షంలో, దానికి తోడు అదనంగా కస్టమర్‌కి మరో రూ.180 దాకా క్యాష్ బ్యాక్ కూడా లభించగలదని(ఆఫర్‌ని బట్టి) క్యాష్‌కరో స్వాతి భార్గవ వెల్లడించారు. రోహన్, స్వాతి 2011లో పోరింగ్ పౌండ్స్ పేరిట బ్రిటన్‌లో వ్యాపార సంస్థల కోసం ఈ తరహా వెబ్‌సైట్‌ని ఏర్పాటు చేశారు. ఆ అనుభవంతో దీన్ని దేశీయంగా కొనుగోలుదారుల కోసం ప్రారంభించారు. 7,50,000 డాలర్ల నిధులను సమీకరించిన క్యాష్‌కరోకి ప్రస్తుతం గుర్గావ్, చెన్నైలో ఆఫీసులు ఉన్నాయి.
ఉచిత టాక్‌టైం...: ఐఏఎంఏఐ, ఐఎంఆర్‌బీ నివేదిక ప్రకారం 2011-12లో మొబైల్ యాడ్స్‌పై కంపెనీలు సుమారు రూ. 105 కోట్ల మేర వెచ్చించాయి. 2012 మార్చ్ నాటికి మొబైల్ ఇంటర్నెట్‌ని తరచుగా వినియోగించే వారి సంఖ్య 4.8 కోట్లకు చేరింది. దీంతో మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీలపై ప్రకటనలు మరింత ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి. గతంలో ఎంజింజర్ వంటి సంస్థలు మొబైల్ అడ్వర్టైజింగ్ రంగంలో హల్‌చల్ చేశాయి. ప్రస్తుతం టెలికం కంపెనీ(టెల్కో)లు స్వయంగా రంగంలోకి దిగుతున్నాయి.
తాజాగా మొబైల్ హ్యాండ్‌సెట్స్‌లో ప్రకటనలు చూస్తే ఉచితంగా వాయిస్ మినిట్స్ ఇస్తామంటూ టాటా టెలీ ఊరిస్తోంది. ఇందుకు ఎంయాడ్‌కాల్ సంస్థతో టైఅప్ పెట్టుకుంది. అలాగే ప్రకటనలు ఇచ్చేందుకు కొన్ని కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనికోసం గెట్ పేరిట మొబైల్ అడ్వర్టైజింగ్ యాప్‌ని రూపొందించారు. డొకొమో డేటా ప్యాకేజీలు ఉండే హ్యాండ్‌సెట్‌లో కస్టమర్ చూసిన ప్రతి అడ్వర్టైజ్‌మెంట్‌కి ఇంత చొప్పున టాక్‌టైమ్‌ని సంస్థ ఉచితంగా అందిస్తుంది. ఇలా యాడ్స్‌ని చూసినందుకు టాటా డొకొమో ఇంటర్నెట్ ప్యాకేజీలో నుంచి డేటా చార్జీలు ఉండవు. ఎవరు, ఎప్పుడు తమ ప్రకటనలు చూస్తున్నారన్న వివరాలు తెలియడం వల్ల ప్రకటనకర్తలకూ ప్రయోజనం ఉంటుందని కంపెనీ వర్గాలు తెలిపాయి.