సాక్షి, అమరావతి: నదుల్లో వరద తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కొరతను అధిగమించడం, మాఫియాను అరికట్టడం లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 14న ప్రారంభించిన ఇసుక వారోత్సవాలు విజయవంతం కావడంతో నిర్మాణ రంగ పనులు ఊపందుకున్నాయి.వచ్చే ఐదేళ్లకు సరిపడా ఇసుక మేటలు నదుల్లోకి వచ్చాయని ప్రభుత్వం తెలిపింది. అక్రమ తవ్వకాలు, అధిక ధరలకు విక్రయం లాంటి చర్యలకు పాల్పడితే రెండేళ్ల వరకు జైలు శిక్షతో పాటు రూ. 2 లక్షలు జరిమానా విధిస్తామని హెచ్చరిస్తూ జీవో జారీ చేసింది. నూతన విధానం నేపథ్యంలో ఈనెల 14నుంచి 21 వరకు ఇసుక వారోత్సవాల సందర్భంగా తీసుకున్న చర్యలు సత్ఫలితాలనిచ్చాయి. ఇసుక కొరత పరిష్కారమై ప్రస్తుతం స్టాక్ యార్డుల నిండా నిల్వలున్నాయి.
అధిక ధరలకు కళ్లెం
రివర్స్ టెండర్ల ద్వారా తక్కువ ధరకే ప్రజలకు ఇసుక అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. రేవుల నుంచి ఇసుక డిపోల దూరాన్ని బట్టి రవాణా చార్జీలను లెక్కించారు. ప్రాంతాలవారీగా ధరలను ఖరారు చేసి రేటు కార్డులను ప్రకటించారు. ఫలితంగా ప్రధాన నగరాల్లో ఇసుక ధరలు అందుబాటులోకి వచ్చాయి.
ఫుల్ ‘స్టాక్!’
ఇసుక వారోత్సవాల ప్రారంభం సందర్భంగా ఈనెల 14వ తేదీన 1.61 లక్షల టన్నుల ఇసుక స్టాక్ యార్డులకు చేరింది. వారోత్సవాల ముగింపు రోజైన గురువారం ఏకంగా 2.82 లక్షల టన్నుల ఇసుక స్టాక్ యార్డుల్లో ఉండటం గమనార్హం.
ఫిర్యాదుల కోసం 14500
అక్రమంగా ఇసుక తవ్వకాలు, రవాణాపై ఫిర్యాదు చేసేందుకు 14500 టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. ఇతర రాష్ట్రాలకు ఇసుక తరలిపోకుండా 35కిపైగా చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా చర్యలు చేపట్టారు.
తొలిరోజే లక్ష్యాన్ని అధిగమించి...
రాష్ట్రంలో రోజువారీ ఇసుక డిమాండ్ గరిష్టంగా 80 వేల టన్నులు కాగా వారోత్సవాల మొదటి రోజే ఈ లక్ష్యాన్ని అధిగమించడం విశేషం. శ్రీకాకుళం, తూర్పు, పశ్చిమ గోదావరి, గుంటూరు, వైఎస్సార్ జిల్లాల్లో తొలిరోజు కొత్తగా 17 రీచ్‌లను ప్రారంభించారు. తూర్పు గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, అనంతపురం, వైఎస్సార్ జిల్లాల్లో ఇసుక తవ్వకాలకు 12 పట్టా భూముల్లో అనుమతులు మంజూరు చేశారు. తూర్పు గోదావరి, చిత్తూరు జిల్లాల్లోని జలాశయాల్లో మేట వేసిన ఇసుకను వెలికి తీసేందుకు రెండు చోట్ల అనుమతులిచ్చారు. 13 జిల్లాల పరిధిలో అదనంగా 34 స్టాక్ పాయింట్లను ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment