ఆయనే నిజమైన కళాకారుడు – కైకాల సత్యనారాయణ
‘‘ఆ ఈశ్వరుడికి, కళకు సంబంధం ఉంది. కళలో ఈశ్వర శక్తి ఉంది. అందుకే కళలను ప్రేమిస్తాను. ఆరాధిస్తాను. కళాకారులపై అభిమానంతో, వారిని అభినందించి సత్కరిస్తాను. దీనికి రాజకీయంతో సంబంధం లేదు. కళలను ఆరాధిస్తూ అందర్నీ ప్రేమిస్తూ, అజాత శత్రువుగా ఉండాలన్నదే జీవితంలో నా కోరిక అన్నారు’’ కళాబంధు టి. సుబ్బరామిరెడ్డి. మహా శివరాత్రి సందర్భంగా విశాఖ సముద్ర తీరాన టీయస్సార్ ఆధ్వర్యంలో కోటి శివలింగాల ప్రతిష్ట, మహా కుంభాభిషేకం కార్యక్రమం ఈ నెల 13న జరగనుంది.
ఈ సందర్భంగా సీనియర్ నటులు కైకాల సత్యనారాయణకు ‘విశ్వనట సమ్రాట్ బిరుదు’ ప్రదానం చేయనున్నారు. అలాగే యశ్ చోప్రా స్మారక జాతీయ అవార్డును ప్రముఖ గాయని ఆశా భోంస్లేకు ప్రదానం చేయనున్నారు. ఈ వేడుకల వివరాలను హైదరాబాద్‌లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో టి. సుబ్బరామిరెడ్డి వెల్లడించారు. ఆయన మాట్లాడుతూ – ‘‘కోటి లింగాల ప్రతిష్ట, మహా కుంభాభిషేకం కార్యక్రమం ప్రారంభించి 25 సంవత్సరాలు పూర్తయింది. ఫిబ్రవరి 13న సిల్వర్ జూబ్లీ చేయనున్నాం. ఆ రోజు 7 గంటలకు ప్రారంభమయ్యే అభిషేకం మధ్యాహ్నం మూడు గంటల వరకు సాగుతుంది.
అలాగే సాయంత్రం 8 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు శివజాగారం కొరకు భక్తి రస కార్యక్రమాలు ఏర్పాటు చేశాం. దాదాపు వెయ్యి చిత్రాల్లో కైకాల సత్యనారాయణ నటించారు. ఎన్టీఆర్ వంటి గ్రేట్ ఆర్టిస్ట్‌తో వర్క్ చేశారు. ఆయనకు ‘విశ్వనట సమ్రాట్’ బిరుదును ప్రదానం చేయనున్నాం. స్వర్ణకంకణ ఘనసన్మానం కూడా జరుగుతుంది. యశ్ చోప్రాగారు దేశం గర్వించదగ్గ ఫిల్మ్‌మేకర్. ఆయనతో కలిసి ‘చాందినీ, లమ్హే’ లాంటి చిత్రాల నిర్మాణంలో పాలు పంచుకున్నందుకు ఆనందంగా ఉంది.
ఆయన జ్ఞాపకార్థం 2014లో ప్రారంభించిన యశ్ చోప్రా స్మారక జాతీయ పురస్కారాన్ని ఈ ఏడాది గాయని ఆశా భోంస్లేకు అందజేయాలని జ్యూరీ కమిటీ నిర్ణయించింది. త్వరలో మహబూబ్‌నగర్‌లో కాకతీయ కళా వైభోత్సవాన్ని నిర్వహించాలనుకుంటున్నాం’’ అన్నారు. ‘‘మహాశివరాత్రి రోజున ప్రజల సమక్షంలో విశ్వనట సమ్రాట్ బిరుదుతో నన్ను సత్కరించనుండటం ఆనందంగా ఉంది. కళాకారులు గౌరవాన్ని కోరుకుంటారు.
ఏమీ ఆశించకుండా డబ్బును కళాసేవకు వినియోగిస్తున్నారు టి.సుబ్బరామిరెడ్డిగారు. ఆయనే నిజమైన కళాకారుడు. కళామతల్లి ముద్దుబిడ్డ అన్నది నా ఉద్దేశం. ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేయాలి. నాకు పద్మశ్రీ, పద్మ విభూషణ్ కంటే ఈ అవార్డు గొప్పదని నేను భావిస్తున్నాను’’ అన్నారు కైకాల సత్యనారాయణ. ఈ కార్యక్రమంలో మురళీమోహన్, పరుచూరి వెంకటేశ్వరరావు, పద్మినీ కొల్హాపురి, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.