కాంగ్రెస్‌లోకి ఉత్తరాఖండ్ మంత్రి, ఎమ్మెల్యే
న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి యశ్పాల్ ఆర్య, తన కుమారుడు, ఎమ్మెల్యే సంజీవ్ ఆర్యతో కలిసి సోమవారం బీజేపీకి రాజీనామా చేసి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలో చేరారు. యశ్పాల్ ఆర్య 2007 నుంచి 2014 దాకా ఉత్తరాఖండ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశారు. 2017లో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాషాయ కండువా కప్పుకున్నారు. యశ్పాల్, సంజీవ్, వారి మద్దతుదారులు ఢిల్లీలో కాంగ్రెస్ సీనియర్ నేతలు హరీష్ రావత్, కె.సి.వేణుగోపాల్, రణదీప్ సూర్జేవాలా సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు.
అంతకు ముందు వారు రాహుల్ గాంధీని ఆయన నివాసంలో కలిశారు. తనకు చాలా సంతోషంగా ఉందని, సొంతింటికి తిరిగి వచ్చానని యశ్పాల్ వ్యాఖ్యానించారు. ఇది తన ‘ఘర్ వాపసీ’ అని చెప్పారు. ఆయన ఇప్పటిదాకా ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో శాసనసభ స్పీకర్‌గా, మంత్రిగా పనిచేశారు. కాంగ్రెస్ బలోపేతం అయితే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుందని యశ్పాల్ ఈ సందర్భంగా చెప్పారు. ఆయన కుమారుడు సంజీవ్ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. మరో బీజేపీ నేత హరీందర్ సింగ్ లడ్డీ కూడా కాంగ్రెస్‌లో చేరారు.
బీజేపీలో చేరిన దేవేందర్ రాణా, సూర్జిత్‌సింగ్
మరోవైపు, జమ్మూకశ్మీర్‌లోని నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ కీలక నేతలు దేవేందర్ రాణా, సూర్జిత్ సింగ్ స్లాథియా సోమవారం బీజేపీలో చేరారు. వారు ఆదివారమే నేషనల్ కాన్ఫరెన్స్‌కు రాజీనామా సమర్పించారు. వారిద్దరూ ఢిల్లీలో బీజేపీ కేంద్ర కార్యాలయంలో కేంద్ర మంత్రులు ధర్మేంద్ర ప్రధాన్, హర్దీప్సింగ్ పురి, జితేంద్ర సింగ్‌ల సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. దేవేందర్ రాణా గతంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. నేషనల్ కాన్ఫరెన్స్ నేత అగ్రనేత ఒమర్ అబ్దుల్లాకు రాజకీయ సలహాదారుగా సేవలందించారు.