Year Ender 2020
-
టాప్‌గేర్‌లో వాహన విక్రయాలు
వాహన విక్రయాలు డిసెంబర్లో దుమ్ము రేపాయి. డిమాండ్ జోరుగా ఉండటంతో మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటార్స్ కంపెనీల వాహన అమ్మకాలు(హోల్‌సేల్) రెండంకెల మేర వృద్ధి చెందాయి. హ్యుందాయ్, సోనాలిక ట్రాక్టర్స్ కంపెనీలు అత్యుత్తమ నెలవారీ అమ్మకాలను డిసెంబర్లోనే సాధించాయి. వినియోగదారుల ఆర్డర్లు చెప్పుకోదగ్గ స్థాయిల్లో పెరుగుతున్నాయని, రిటైల్ అమ్మకాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయని వాహన కంపెనీలు వెల్లడించాయి. పండుగల సీజన్ ముగిసిన తర్వాత కూడా అమ్మకాలు జోరుగానే ఉన్నాయని వాహన కంపెనీలు సంతోషం వ్యక్తం చేశాయి. మార్కెట్ వేగంగా రికవరీ అయిందని, వ్యక్తిగత రవాణాకు డిమాండ్ పెరుగుతుండటం కలసివచ్చిందని పేర్కొన్నాయి. కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రానుండటంతో వినియోగదారుల సెంటిమెంట్ మరింతగా మెరుగుపడి, అమ్మకాలు మరింతగా పుంజుకోగలవన్న ఆశాభావం వాహన పరిశ్రమలో నెలకొన్నది. మరిన్ని విశేషాలు... ► హ్యుందాయ్ కంపెనీకి అత్యుత్తమ నెలవారీ అమ్మకాలను గత నెలలోనే సాధించింది. క్రెటా, వెర్నా, టూసన్, ఐ20 మోడళ్లలో కొత్త వేరియంట్లను అందించడం, క్లిక్టుబై వంటి వినూత్నమైన సేవలందించడం కారణంగా అమ్మకాలు జోరుగా పెరిగాయని ఈ కంపెనీ పేర్కొంది. ► మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ దేశీయ అమ్మకాలు 3 శాతం పెరిగినా, మొత్తం అమ్మకాలు 10 శాతం తగ్గాయి. ► వీఈ కమర్షియల్ వెహికల్స్ దేశీయ అమ్మకాలు 8 శాతం తగ్గినా, ఎగుమతులు 24 శాతం ఎగిశాయి. మొత్తం అమ్మకాలు 3 శాతం తగ్గాయి. ► అమ్మకాలు గత ఆరు నెలలుగా పెరుగుతూనే ఉన్నాయని యమహా తెలిపింది. -
యూట్యూబ్ ‘ఫన్’- 2020
కరోనాతో యావత్ ప్రపంచం మూగబోయిన వేళ...తమ వీడియోలతో సందడి చేశారు. లాక్డౌన్ బోర్డమ్ను బ్రేక్ చేసి ప్రేక్షకుల్లో హుషారు నింపారు.యూత్‌ఫుల్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ శక్తి ఏమిటో చెప్పకనే చెప్పారు. ‘హైయెస్ట్ పెయిడ్ యూట్యూబ్ స్టార్స్–2020’గా ఫోర్బ్స్ జాబితాలో నిలిచిన శ్రీమంతుల చిరు పరిచయం... ► తొమ్మిది సంవత్సరాల కోటీశ్వరుడు! చానల్: రెయాన్ వరల్డ్ ఎర్నింగ్స్: 29.5 మిలియన్ సబ్స్క్రైబర్స్: 41.7 మిలియన్ బొమ్మలపై రివ్యూలు ఇచ్చే చానల్స్ తెగచూసే రెయాన్ కాజీ(టెక్సాస్) ఒకరోజు తల్లితో కలిసి సొంతంగా యూట్యూబ్ చానల్ మొదలుపెట్టాడు. అబ్బాయి కోరిక నెరవేర్చడానికి, అతడిలోని టాలెంట్‌ను బయటికి తీసుకురావడానికి ఏకంగా హైస్కూల్లో తాను చేస్తున్న కెమిస్ట్రీ టీచర్ ఉద్యోగానికి రాజీనామా చేసింది లోన్ కాజీ. 2015లో మొదలైన ‘రెయాన్ వరల్డ్’ యూట్యూబ్ చానల్‌కు అనూహ్యస్పందన లభించింది. విద్యను వినోదంతో కలిపి మిక్స్ చేసిన వీడియోలకు మంచి ఆదరణ లభించింది. ► హాస్యం, సాహసం సేయరా డింభకా! చానల్: మిస్టర్ బీస్ట్ ఎర్నింగ్స్: 24 మిలియన్ సబ్స్క్రైబర్స్: 47.8 మిలియన్ నార్త్ కరోలిన(యూఎస్)లోని ఒక రెస్టారెంట్. సర్వర్ ఆర్డర్ అడిగింది. ‘రెండు గ్లాసుల మంచినీళ్లు చాలు’ అన్నాడు ఆ యువకుడు. తాగి వెళ్లిపోయాడు. అతడు కూర్చున్న టేబులపై ఒక చీటి ఉంది. ‘కమ్మని మంచినీళ్లు ఇచ్చినందుకు–థ్యాంక్స్’ చీటి పక్కనే టిప్. అంత పెద్ద మొత్తంలో టిప్ చూడడంతో ఆమెకు కళ్లు తిరిగినంత పనైంది. ‘ఎవరీ టిప్పర్?’ అని ఆరాతీస్తే ‘యూట్యూబ్స్టార్ మిస్టర్ బీస్ట్’ అని చెప్పారు. 22 సంవత్సరాల జిమ్మి డొనాల్డ్సన్ ‘మిస్టర్ బీస్ట్’ యూట్యూబ్ చానల్‌తో ఫేమస్ అయ్యాడు. 13 సంవత్సరాల వయసు నుంచే యూట్యూబ్‌లో వీడియోలు పోస్ట్ చేయడం మొదలుపెట్టాడు. ఒళ్లు గగుర్పొడిచే సాహసకృత్యాలకు హాస్యం జోడిస్తే...ఆ ఫలితమే మిస్టర్ బీస్ట్. ► ఆడుతా తీయగా హాయిగా! చానల్: ప్రెస్టెన్ ఎర్నింగ్స్: 19 మిలియన్ సబ్స్క్రైబర్స్: 33.4 మిలియన్ తన సమీపబంధువు ఒకరు లండన్‌లో ‘లండన్’ పేరుతో యూట్యూబ్ చానల్ మొదలుపెట్టాడు. ఆ స్ఫూర్తితో డల్లాస్(యూఎస్)లో సొంతంగా యూట్యూబ్ చానల్ స్టార్ట్ చేశాడు ప్రెస్టెన్ అర్స్మెన్. ప్రధాన చానల్‌తో పాటు మరోఅయిదు చానల్స్ ఉన్నాయి. గేమింగ్ వీడియోలు అతడి చానల్స్‌కు ముడిసరుకు. పిల్లలను దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకమైన వీడియోలు రూపొందిస్తుంటాడు. ఛాలెంజ్ వీడియోలు, ప్రాంక్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు 26 సంవత్సరాల ప్రెస్టెన్. ► చిన్నారి కాదు చిచ్చర పిడుగు చానల్: నస్ట్యా ఎర్నింగ్స్: 18.5 మిలియన్ సబ్స్క్రైబర్స్: 190.6 మిలియన్ టిక్ టాక్ పాప్లర్ కిడ్‌గా ఫేమస్ అయిన రష్యన్ చిన్నారి అనస్టాసియ ‘నస్ట్యా’ చానల్‌కు పిల్లల్లో అనూహ్యమైన ఆదరణ ఉంది. ఊహాత్మకమైన వీడియోలు, విజ్ఞానం, వినోదం మిళితమైన వీడియోలతో ‘నస్ట్యా’తో బ్రహ్మాండమైన పేరు సాధించింది. యూట్యూబ్ సెన్సేషనల్‌గా నిలిచిన ఆరేళ్ల అనస్టాసియ పేరు బ్రాండ్‌గా మారింది. ప్రసిద్ధ కంపెనీలు తమ ఉత్పత్తులు అనస్టాసియ పేరు వాడుకుంటున్నాయి. ‘జాజ్వేర్’ అనే బొమ్మల కంపెనీ ఈ చిన్నారి పేరుతో ఒక బొమ్మను కూడా తయారుచేసింది. ఇన్స్టంట్ ఫీడ్‌బ్యాక్‌లో రకరకాల అభిప్రాయాలు ఉంటాయి. మనల్ని మెచ్చుకునేవాటితో పాటు నొచ్చుకునేలా చేసేవి కూడా ఉంటాయి. ‘ఫీడ్‌బ్యాక్’ను గైడ్లైన్గానే తీసుకోవాలి తప్ప ప్రశంసలకు అతిగా పొంగిపోవడం, విమర్శలకు మరింత అతిగా కృంగిపోకూడదు. పనికి ఎంత న్యాయం చేస్తున్నామనేదే ముఖ్యం. –విద్య అయ్యర్ (విద్య వోక్స్ యూట్యూబ్ చానల్) మనవాళ్ల విషయానికి వస్తే భువన్ బామ్ (19.8 మిలియన్ సబ్స్క్రైబర్స్), ఆశిష్ చంచలని వైన్ (18.7 మిలియన్ సబ్స్క్రైబర్స్) గౌరవ్ –టెక్నికల్ గురూజీ (18.8 మిలియన్ సబ్స్క్రైబర్స్), విద్య–అయ్యర్ విద్య వోక్స్ (7 మిలియన్ ), సనమ్ పాప్–రాక్ బ్యాండ్(7 మిలియన్ సబ్స్క్రైబర్స్), శృతి అర్జున్ ఆనంద్ (8 మిలియన్ సబ్స్క్రైబర్స్)....మొదలైవారు ప్రేక్షక ఆదరణతో పాటు ఆర్థికవిజయం అందుకుంటున్నారు. కంటెంట్ గురించి ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటాను. యూత్ మా ప్రధాన టార్గెట్. వీడియోలపై కుబుంబసభ్యుల నుంచి స్నేహితుల వరకు అందరి అభిప్రాయాలు తీసుకుంటాను. మార్పులుచేర్పులు చేస్తుంటాను. ‘నాకు నచ్చితే అందరికీ నచ్చినట్లే’ అనే భావనలో నుంచి బయటికి రావాలి. – శృతి అర్జున్ ఆనంద్, ఫేమస్ యూట్యూబర్ -
2021: ముకేశ్ ఏం చేయనున్నారు?
ముంబై, సాక్షి: బిలియనీర్ ముకేశ్ అంబానీ 2020లో పలు ఘనతలను సాధించారు. ప్రణాళికలకు అనుగుణంగా అడుగులు వేయడం ద్వారా గ్రూప్ కంపెనీలకు జోష్‌నిచ్చారు. ఫలితంగా ముకేశ్ సంపద పుంజుకోవడంతోపాటు.. డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ రుణరహిత కంపెనీగా ఆవిర్భవించింది. ప్రధానంగా డిజిటల్ అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్.. గ్లోబల్ టెక్ కంపెనీలు, పీఈ దిగ్గజాలను భారీగా ఆకట్టుకోగలిగింది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో సుమారు 33 శాతం వాటా విక్రయం ద్వారా ముకేశ్ 1.5 లక్షల కోట్లను సమీకరించగలిగారు. అంతేకాకుండా రిలయన్స్ ఇండస్ట్రీస్ వాటాదారులకు రైట్స్ ఇష్యూని జారీ చేసింది. మరోపక్క రిటైల్ అనుబంధ సంస్థ రిలయన్స్ రిటైల్లోనూ వాటా విక్రయం ద్వారా ముకేశ్ నిధులను సమకూర్చుకున్నారు. వెరసి 27 బిలియన్ డాలర్లను సమీకరించారు. ఒక దశలో ప్రపంచ కుబేరుల జాబితాలోనూ టాప్-5లోకి దూసుకెళ్లారు. దీంతో 2021లో ముకేశ్ ప్రణాళికలపట్ల కార్పొరేట్ ప్రపంచం అత్యంత ఆసక్తిని కనబరుస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. ఆశలు, అంచనాలపట్ల విశ్లేషకులు ఏమంటున్నారంటే.. అంచనాలు అధికం ఇంధనం, టెక్స్టైల్స్, కెమికల్స్ తదితర డైవర్సిఫైడ్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ 2020లో ప్రధానంగా రిలయన్స్ జియో ద్వారా అటు వ్యవస్థలోనూ, ఇటు గ్రూప్ వ్యాపారాలలోనూ భారీ మార్పులకు శ్రీకారం చుట్టింది. డిజిటల్ టెక్నాలజీ, ఈకామర్స్ తదితర విభాగాలలో భారీ అడుగులు వేసింది. మీడియాలోనూ పట్టు సాధించే ప్రయత్నాలు చేపట్టింది. దీంతో 2021లో 5జీ టెక్నాలజీని అందుకోవడంలోనూ ఆర్ఐఎల్ గ్రూప్ ముందుంటుందన్న అంచనాలు పెరిగాయి. ముకేశ్ రిలయన్స్ జియో, రిలయన్స్ రిటైల్‌లలో డిజిటల్ ఆవిష్కరణలకు తెరతీశారు. తద్వారా టెక్ దిగ్గజాలు ఫేస్బుక్, గూగుల్‌తోపాటు.. కేకేఆర్, సిల్వర్‌లేక్ పార్టనర్స్ తదితర పలు పీఈ సంస్థలనూ ఆకట్టుకున్నారు. చదవండి: (2020: పసిడి, కుబేరులు, మార్కెట్లు!) డిజిటల్ అడుగులు 5జీ నెట్‌వర్క్‌కు సంబంధించిన ప్రొడక్టులు, సర్వీసుల అభివృద్ధిపై దృష్టిసారించవలసి ఉంది. ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్ పేమెంట్ సర్వీసులను రిలయన్స్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌కు అనుసంధానించడం ద్వారా ఈకామర్స్ బిజినెస్‌కు మద్దతివ్వవలసి ఉంది. దేశవ్యాప్తంగా రిలయన్స్ రిటైల్ పలు స్టోర్లను ఏర్పాటు చేసింది. వీటిని ఈకామర్స్‌లో భాగం చేయవలసి ఉంది. దేశవ్యాప్తంగా ఉన్న సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలను ఈకామర్స్‌లో భాగం చేసేందుకు వీలుగా టెక్నాలజీ సొల్యూషన్స్, యాప్ప్ తదితరాలను అభివృద్ధి చేయవలసి ఉంది. ఇదే సమయంలో దేశీ రిటైల్ రంగంపై కన్నేసిన గ్లోబల్ దిగ్గజాలు వాల్‌మార్ట్, అమెజాన్ వంటి సంస్థల నుంచి ఎదురయ్యే పోటీలో ముందుండాల్సి ఉంటుంది. కాగా.. కొన్ని నెలలుగా ఆర్ఐఎల్కు చెందిన ఆయిల్, పెట్రోకెమికల్స్ బిజినెస్‌లో వాటాను సౌదీ కంపెనీ అరామ్కోకు విక్రయించే ప్రణాళికలు వేసినప్పటికీ మార్కెట్ పరిస్థితుల రీత్యా ముందుకుసాగలేదు. పెట్రోకెమికల్ బిజినెస్‌లో వాటా విక్రయ డీల్‌కు సైతం ప్రాధాన్యత ఉంది. -
2020 ‘సినిమా’ రివ్యూ
2020.. ప్రపంచానికే ఓ బ్లాక్ ఇయర్. ఈ ఇయర్లోకి ఎంటరైన రెండు నెలలకే కరోనా వైరస్ మానవాళిపై దాడి చేసింది. ఈ మహమ్మారి దాటికి ప్రపంచం మొత్తం చిగురుటాకులా వణికి పోయింది. అన్ని రంగాలు కుదేలైపోయాయి. ముఖ్యంగా చిత్ర పరిశ్రమకు అయితే గట్టి దెబ్బ కొట్టింది. టాలీవుడ్లో ప్రతి ఏడాది దాదాపు 250 సినిమాల వరకు విడుదలై ప్రేక్షకుల్ని అలరించేవి. కానీ కరోనా ధాటికి ఈ ఏడాది దాదాపు 50 సినిమాలు కూడా విడుదల కాలేదు. సంక్రాంతి తప్ప.. ఈ ఏడాది మొత్తంలో ఒక్క స్టార్ హీరో సినిమా కూడా థియేటర్లలో విడుదలవలేదు. 2020లో విడుదలైన సినిమాలేంటి? వాటిలో ఏవి హిట్ అయ్యాయి. ఏవి ప్లాప్‌ను మూటగట్టుకున్నాయి? సమగ్ర సమాచారం మీకోసం... సంక్రాంతికి సందడి చేసిన మహేశ్-బన్నీ టాలీవుడ్ సినిమా క్యాలెండర్ ప్రతి ఏటా సంక్రాంతి నుంచి మొదలవుతుంది. ఈ సీజన్లో బడా హీరోలంతా బరిలోకి దిగుతారు. వీలైనన్ని పెద్ద సినిమాలు సంక్రాంతికి వస్తాయి. ఈ సారి కూడా పెద్ద పెద్ద సినిమాలే సంక్రాంతి బరిలోకి దిగాయి. మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరుతో బరిలోకి దిగగా... ‘అల వైకుంఠపురములో’తో అల్లుఅర్జున్ రంగంలోకి దూకాడు. ఇక ‘ఎంతమంచివాడవురా’ అంటూ కళ్యాణ్ రాము సంక్రాంతి పోరులో నిలిచారు. అయితే ఈ ముగ్గురిలో మాత్రం.. మహేశ్- బన్నీల మధ్యే ప్రధాన పోరు జరిగింది. ఒక్క రోజు తేడాతో వచ్చిన ఈ రెండు సినిమాలు బాక్సాపీస్ వద్ద కాసుల వర్షం కురిపించాయి. ఈ రెండు సినిమాల్లో మాత్రం ‘అల వైకుంఠపురములో’కి కాస్త ఎక్కువ మార్కులు పడ్డాయి. ఇక రెండు భారీ సినిమాల మధ్య విడుదల అయిన కల్యాణ్ రామ్ ‘ఎంత మంచివాడవురా’ ప్లాప్‌ను మూటగట్టుకుంది. ప్లాప్‌ను మూటగట్టుకున్న మాస్ మహారాజా మహేశ్, బన్నీ సినిమాలు సక్సెస్‌పుల్‌గా రన్ అవుతున్న సమయంలో ‘డిస్కోరాజా’తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రవితేజ. జనవరి 24న విడుదలైన ఈ సినిమా అట్టర్ ప్లాప్ అయింది. సినిమా సక్సెస్ అవుతుందని ఎన్నో అశలు పెట్టుకున్న మాస్ మహారాజ ఫ్యాన్స్‌కు నిరాశే మిగిలింది. సినిమా కోసం రవితేజ కూడా బాగానే కష్టపడ్డాడు కానీ వర్కౌట్ కాలేదు. అలరించని ‘అశ్వథ్థామ’ ఛలో’ సినిమాతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్న యంగ్ హీరో నాగశౌర్య.. ‘అశ్వథ్థామ’గా ప్రతాపం చూసేందుకు ముందుకు వచ్చాడు. మెహరిన్ హీరోయిన్గా నటించిన ఈ మూవీ ఈ ఏడాది జనవరి 31న విడుదలై పాజిటివ్ టాక్‌ను రాబట్టింది కానీ సిల్వర్ స్క్రీన్‌పై పెద్దగా ప్రభావం చూపించలేకపోయింది. కానీ బుల్లితెరపై మాత్రం సక్సెస్ అయింది. ఈ మూవీ శాటిలైట్ రైట్స్ దక్కించుకున్న జెమినీ టీవీ మే 15న ఈ చిత్రాన్ని ప్రసారం చేయగా.. 9.10 టీఆర్పీ రేటింగ్‌ను దక్కించుకుంది. మాయ చేయని ‘జాను’ శర్వానంద్ నటించిన ‘జాను’ సినిమా ఫిబ్రవరి 7న విడులైన ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. `96`కి రీమేక్ గా వచ్చిన `జాను` పై ప్రేక్షకులకు ఎన్నో అంచనాలు ఏర్పడ్డాయి. కానీ వాటిని ‘జాను’ అందుకోలేకపోయింది. `96`కి జిరాక్స్ కాపీగా మిగిలిందే తప్ప, ప్రత్యేకమైన ముద్ర వేయలేకపోయింది. కానీ శర్వానంద్, సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి. డిజాస్టర్ మూటగట్టుకున్న‘రౌడీ’ మంచి ఫాంలో ఉన్న విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అంటూ వాలెంటైన్స్ డే రోజు ప్రేక్షకులు ముందుకు వచ్చాడు. కానీ ప్రేక్షకుల ప్రేమను మాత్రం చురగొనలేదు. క్రాంతి మాధవ్ తెరకెక్కించిన ఈ సినిమా డిజాస్టర్ అనిపించుకుంది. మూడు లవ్ స్టోరీలు చూపించినా.. ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. ఈ సినిమాతో బాక్సాఫీస్ వద్ద ఇరవై కోట్లు కూడా రాబట్టలేకపోయిందట. ఫలించిన ‘భీష్మ’ బాణం వరుస పరాజయాలను మూటగట్టుకుంటున్న టాలీవుడ్‌ను భీష్ముడుగా వచ్చి కాపాడాడు యంగ్ హీరో నితిన్. వెంకీ కుడుమల దర్శకత్వంలో నితిన్, రష్మిక జంటగా నటించిన `భీష్మ` ప్రేక్షకుల్ని అలరించింది. నితిన్ కెరీర్లో ఇది పెద్ద హిట్టుగా నిలిచింది. విజయాలు లేక బోసిపోయిన థియేటర్లకు యూత్‌తో పాటు కుటుంబ ప్రేక్షకులను రప్పించింది. ఆ సినిమా విడుదలైన కొన్ని వారాలకే లాక్ డౌన్ మొదలైంది. లేకుంటే బాక్సాఫీస్ వద్ద 50కోట్ల క్లబ్ లో చేరేది. ‘హిట్’ సూపర్ హిట్ నాని నిర్మించిన ‘హిట్’ సినిమాతో సాలిడ్ హిట్ అందుకున్నాడు హీరో విశ్వక్ సేన్. ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు వచ్చిన `హిట్`…పేరుకి తగ్గట్టే హిట్ అనిపించుకుంది. ఈ సినిమా పాజిటీవ్ టాక్‌తో మంచి వసూళ్లను రాబట్టి.. విమర్శకుల ప్రశంసలు అందుకుంది. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమాలో రుహానీ శర్మ హీరోయిన్గా నటించింది. పర్వాలేదనిపించిన ‘పలాస’ మార్చి 6న విడుదలైన `పలాస` విమర్శకుల్ని మెప్పించింది. ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చిన సినిమా ఇది. కరోనా వైరస్ లేకపోతే ఈ సినిమా సూపర్ హిట్ అయ్యేది. సినిమా రిలీజ్ అయిన కొద్ది రోజులకే థియేటర్లు మూతపడడంతో సినిమా అంతగా సక్సెస్ కాలేదు. థియేటర్లలో పెద్దగా ఆడలేదు గానీ, ఓటీటీలో వచ్చాక… ఈసినిమాకి వ్యూవర్ షిప్ పెరిగింది. ఈ సినిమాలో నాదీ నక్కిలీసు గొలుసు పాట మాత్రం మాస్ ఆడియన్స్ ని ఊపేసింది. మార్చి 17 నుంచి థియేటర్లు మూత పడటం సినిమాల విడుదలకు ఊహించని బ్రేక్ పడింది. సినిమాలు లేక విలవిలలాడిన సినీ ప్రేమికులను ఓటీటీ సంస్థలు కాపాడాయి. లాక్‌డౌస్ సమయంలో చొరవ చూపి మరి కొన్ని చిత్రాలను విడుదల చేశాయి. వాటిలో నాని, సుధీర్ బాబు హీరోలుగా నటించిన ‘వి’, కీర్తీ సురేష్ పెంగ్విన్, మిస్ ఇండియా, అనుష్క నటించిన ‘నిశ్శబ్దం’అట్టర్ ప్లాప్ అయ్యాయి. ఇక పెద్ద సినిమాల్లో సూర్య హీరోగా నటించిన ఆకాశమే హద్దురా మాత్రం హిట్ టాక్‌ను సంపాదించుంది. వీటితో పాటు కలర్ ఫోటో, మిడిల్ క్లాస్ మెలోడీస్’, ఉమా మహేశ్వర ఉగ్ర రూపశ్య, జోహార్ లాంటి చిత్రాలు విజయవంతం అయ్యాయి. మొత్తానికి థియేటర్లు లేని లోటును కొద్దో గొప్పో ఓటీటీ వేదికలు తీర్చాయని చెప్పొచ్చు.