వాగులో యువకుడి గల్లంతు
మాచర్ల: వాగును దాటే ప్రయత్నంలో ఓ యువకుడు నీటిప్రవాహంలో గల్లంతయ్యాడు. మాచర్లలోని అజాద్ నగర్ వద్ద గురువారం ఉదయం చోటుచేసుకున్న ఈ సంఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు..పట్టణంలోని 24వ వార్డు నివాసి తంగెళ్ల నరేష్రాజు(24) తన స్నేహితులైన బొల్లేపల్లి గోపిరాజు, దార్ల యేసుదాసులతో కలసి అమరావతి వెళ్దామని బయలుదేరాడు. బస్సులో వెళ్దామనుకుని అజాద్ నగర్ వద్ద చంద్రవంక వాగు వద్ద చప్టా దాటే ప్రయత్నంచేశారు. మొదట నరేష్రాజు చప్టా దాటాలని ప్రయత్నించాడు. ఇటీవలి భారీ వర్షాల వల్ల చప్టాకు చెందిన మట్టికట్ట కొట్టుకుపోయింది. గుంటలు పడి నీరు ఉధతంగా ప్రవహిస్తోంది. నరేష్రాజు చప్టా మీదకు దిగగానే కాలుజారి నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. ఇది చూసి భయపడిన గోపిరాజు, యేసుదాసు వెనుదిరిగి వెళ్లి తెలిసిన వారికి సమాచారం అందించారు. బంధువులు అక్కడికి చేరుకుని రోదించారు. పట్టణ సీఐ సత్యకైలాష్నా«ద్, ఎసై ్సలు సింగయ్య, జయకుమార్, తహశీల్దార్ వెంకటేశ్వర్లు, ఆర్ఐ శ్రీధర్ గల్లంతైన యువకుడి ఆచూకీ కోసం గజ ఈతగాళ్లను, మత్య్సకారులను పిలిపించి వెతికించారు. అయినా నరేష్ ఆచూకీ లభించలేదు. వ్యాపారం చేస్తూ జీవనం సాగించే తంగెళ్ల నారాయణరాజు, పద్మావతీలకు ఇద్దరు కుమారులుండగా వారిలో చిన్నకుమారుడు పవన్(22) రెండు నెలల కిందట పోలియోతో పాటు అనారోగ్యంతో మతిచెందాడు. ఈ సంఘటనను మరువక ముందే పెద్ద కుమారుడైన నరేష్రాజు గల్లంతుకావడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.