‘అమ్మ’కే పట్టం
సాక్షి, చెన్నై: ఏర్కాడు ఉప ఎన్నికలోనూ ప్రజలు 'అమ్మ'కే పట్టం కట్టారు. 78 వేల ఓట్ల మెజారిటీతో తిరుగులేని విజయాన్ని అందించారు. ఏర్కాడు అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో అన్నాడీఎంకే అభ్యర్థి సరోజ పెరుమాళ్ ఘన విజయం సాధించడంతో పోయెస్ గార్గెన్ లో పండగ వాతావరణం నెలకొంది. ఈ ఎన్నికలో నోటాకు పడ్డన్ని ఓట్లు కూడా స్వతంత్ర అభ్యర్థులకు లభించలేదు.
ఎమ్మెల్యే పెరుమాళ్ మరణంతో ఖాళీ ఏర్పడిన ఏర్కాడు రిజర్వుడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్ని క అనివార్యం అయింది. డీఎంకే అభ్యర్థిగా స్థానిక బలం, బంధుగణం మద్దతు కల్గిన మారన్ రంగంలోకి దిగడంతో తమ అభ్యర్థిగా సరోజ పెరుమాళ్‌ను అన్నాడీఎంకే ఎంపిక చేసింది. రాష్ర్టంలో ఇప్పటి వరకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న వాళ్లే గెలుస్తూ వచ్చారు. ఆ దిశగా ఈ ఎన్నికలో సరోజ గెలుపు నల్లేరు మీద నడకేనని సర్వత్రా భావించారు. వరుస విజయాలతో దూసుకొస్తున్న తమ హవాకు అడ్డే ఉండదన్న భావన అన్నాడీఎంకేలో నెలకొం ది. అయితే, సమరం హోరాహోరీ కానుందన్న ఇంటెలిజెన్స్ నివేదికతో రంగంలోకి మంత్రులు, నాయకులతో కూడిన జంబో జట్టును రంగంలోకి దించాల్సిన పరిస్థితి ఆ పార్టీ అధినేత్రి జయలలితకు వచ్చింది. చివరకు స్వయంగా ఎన్నికల ప్రచారానికి సైతం ఆమె వెళ్లారు.
లెక్కింపు
ఓటింగ్ రోజున జరిపిన పరిశీలన మేరకు ఇక తమ హవాకు తిరుగులేదన్న ధీమా అన్నాడీఎంకేలో పెరిగింది. అయితే, విజయోత్సవానికి కౌంటింగ్ రోజు వరకు వేచి ఉండాల్సి వచ్చింది. ఉదయాన్నే సేలం అనై పట్టిలోని సీఎస్ఐ పాలిటెక్నిక్ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రానికి అధికారులు, డీఎంకే, అన్నాడీఎంకే నాయకులు, అభ్యర్థులు చేరుకున్నారు. సరిగ్గా 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం అయింది. తొలి రౌండ్ ముగియగానే, అధికార పూర్వకంగా ఫలితాన్ని వెల్లడించక పోవడం వివాదానికి దారి తీసింది. డీఎంకే అభ్యర్థి మారన్ నేతృత్వంలో నాయకులు ఆందోళనకు దిగడంతో కాసేపు కౌంటింగ్ ఆగింది. చివరకు గట్టి భద్రత, పరిశీలన నడుమ 21 రౌండ్ల కౌంటింగ్ సాగింది.
రౌండు రౌండుకు అన్నాడీఎంకే అభ్యర్థి సరోజ, డీఎంకే అభ్యర్థి మారన్‌పై 50 శాతం ఓట్ల ఆధిక్యాన్ని ప్రదర్శించారు. చివరి రౌండ్ వరకు ఆమె ఆధిక్యతను ప్రదర్శిస్తూ రావడం తిరుగులేని విజయాన్ని అన్నాడీఎంకే సొంతమైంది. లక్షా 42,771 ఓట్లు సరోజకు, 68, 655 ఓట్లు మారన్‌కు పడ్డాయి. చివరకు 78,116 ఓట్లతో సరోజ విజయం సాధించినట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు. ఇక, నోటాకు అపూర్వ ఆదరణ లభించింది. తొమ్మిది మంది స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలబడ్డా నోటాకు పడ్డ ఓట్లు కూడా వారికి పడ లేదు. నోటాకు 3,860 ఓట్లు రావడం విశేషం.
ఆనందోత్సాహాలు
తొలి రౌండులోనే యాభై శాతం ఓట్లు సరోజ ఖాతాలో పడటంతో ఇక తమ అభ్యర్థి గెలిచినట్టేనని అన్నాడీఎంకే వర్గాలు ఆనందంలో మునిగారుు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నాడీఎంకే పార్టీ కార్యాలయాల వద్ద బాణాసంచా మర్మోగింది. స్వీట్లు, లడ్డూలు పంచుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. చెన్నైలోని పోయెస్ గార్డెన్ పరిసరాల్లో పండుగ సందడి నెలకొంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఇంటి నుంచి అధినేత్రి జయలలిత బయటకు వచ్చారు. పుష్పగుచ్ఛాల్ని అందజేస్తూ నాయకులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆన ందంతో కేరింతలు కొడుతున్న కార్యకర్తలకు ఆమె అభివాదం తెలియజేశారు.
కృతజ్ఞతలు
తమ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించిన ఏర్కాడు ఓటర్లకు జయలలిత కృతజ్ఞలు తెలియజేశారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ, తమ ప్రభుత్వ అభివృద్ధి పథకాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ప్రజలు కట్టిన పట్టం ఈ గెలుపు అని అభివర్ణించారు. తాను ఇచ్చిన హామీల ప్రకారం ఆ నియోజకవర్గంలో అన్ని పనులు వేగవంతం చేయనున్నామన్నారు. రేయింబవళ్లు పార్టీ అభ్యర్థి గెలుపు కోసం శ్రమించిన మంత్రులు, నాయకులు, ప్రాణ సమానమైన కార్యకర్తలకు అభినందనలు తెలియచేస్తున్నట్టు పేర్కొన్నారు. తమ ప్రచారంతో అభ్యర్థి గెలుపుకు కృషి చేసిన మిత్ర పక్షాల నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.