న్యాయ వ్యవస్థపై నమ్మకం పెంచాలి
చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్: సకాలంలో కేసులను పరిష్కరించి ప్రజలకు న్యాయ వ్యవస్థపై నమ్మకం కలిగించాలని, ఇందుకు న్యాయమూర్తు లు, న్యాయవాదుల మధ్య మంచి వాతావరణం నెలకొనాలని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి, న్యాయసేవాధికార సంస్థ కార్యనిర్వాహణ రాష్ట్ర చైర్పర్సన్ జస్టిస్ రోహిణి పేర్కొన్నారు. ఆమె గురువారం చిత్తూరులోని న్యాయవాదుల సంఘం కార్యాలయాన్ని సందర్శించా రు. ఆమె మాట్లాడుతూ 200 ఏళ్ల చరిత్ర ఉన్న చిత్తూరు బార్ కౌన్సిల్‌ను సందర్శించడం సంతోషంగా ఉందన్నారు. మహిళా న్యాయవాదులు వృత్తి నైపుణ్యాలను పెంపొందించుకుని న్యాయవాద వృత్తిలో రాణించాలని కోరారు. ఇటీవల న్యాయమూర్తుల పోస్టుల భర్తీలో సైతం 50 శాతానికి పైగా మహిళలు ఎంపిక కావడం అభినందనీయమన్నారు. చిత్తూరులో ఏర్పాటు చేసిన న్యాయసేవాసదన్ భవనం రాష్ట్రానికే ఆదర్శంగా ఉందన్నారు.
అనంతరం పిల్లలపై జరుగుతున్న లైగింక వేధింపులు, దాడులను అరికట్టడంలో వ్యవహరించాల్సిన పద్ధతులపై పోలీసు అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, న్యాయాధికారులకు అవగాహన కల్పించారు. జస్టిస్ రోహిణిని న్యాయవాదుల సంఘం ఆధ్వర్యం లో జిల్లాలోని న్యాయమూర్తులు ఘనం గా సన్మానించారు. ఈ కార్యక్రమంలో న్యాయ సేవాధికార సంస్థ రాష్ట్ర మెంబర్ సెక్రటరి శ్యామ్‌ప్రసాద్, జిల్లా జడ్జి రవి బాబు, అదనపు జిల్లా జడ్జి విజయకుమార్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వై.హేమలత, చిత్తూరు డీఎస్పీ రాజేశ్వరెడ్డి, రాష్ట్ర న్యాయవాదుల క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు నల్లారి ద్వారకనాథరెడ్డి పాల్గొన్నారు.
దాతలకు సన్మానం
చిత్తూరులోని న్యాయసేవాసదన్ భవనంలో నూతనంగా నిర్మించిన సమావేశపు హాలుకు వస్తువులను విరాళాలుగా ఇచ్చిన దాతలను జ్ఞాపికలు అందజేసి దుశ్శాలువలతో సన్మానించారు. దాతలు విజయభాస్కర్, జగదీ శ్వరనాయుడు, షమీర్, వెంకటేశులునాయుడు, విజయతేజ, త్యాగరాజులునాయుడు, అశోక్‌రాజు, సుబ్రమణ్యంరెడ్డి, చందనరమేష్, ఎన్పీఎస్ ప్రకాష్ తదితరులు ఉన్నారు.