అందరికీ ఆసరా ‘స్వావలంబన్’
18-60 ఏళ్ల వారు చేరితే వృద్ధాప్యంలో పింఛను
ఎన్పీఎస్ రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ యోగేశ్వరరావు వెల్లడి
మాకవరపాలెం : వృద్ధాప్యంలో ఆసరా కల్పించడమే లక్ష్యంగా కేంద్రం ప్రవేశపెట్టిన ‘స్వావలంబన్’ పథకంలో అన్ని వర్గాల వారూ చేరవచ్చని న్యూ పింఛన్ సబ్‌స్క్రైబర్ సర్వీసెస్ (ఎన్పీఎస్) రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ పి.యోగేశ్వరరావు చెప్పారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఇప్పటివరకు 50 వేల మంది ఈ పథకంలో చేరారని వెల్లడించారు. మాకవరపాలెం మండల కేంద్రంలోని కొత్తవీధిలో బుధవారం స్వావలంబన్ కార్యాలయాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా యోగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో ఇప్పటివరకు ఏడు జిల్లాల్లో అన్ని మండలాల్లోనూ కార్యాలయాలు ప్రారంభించామని చెప్పారు. మిగిలిన జిల్లాల్లోనూ ఆర్నెల్లలో ప్రారంభిస్తామన్నారు. ఈ పథకంలో 18 నుంచి 60 ఏళ్లలోపు వారు చేరవచ్చని వివరించారు. వారు ఏడాదికి రూ.వెయ్యి చొప్పున చెల్లిస్తే కేంద్రం మరో రూ.వెయ్యి వారి ఖాతాలో జమ చేస్తుందన్నారు. అరవయ్యేళ్లు పూర్తయిన తరువాత వారికి పింఛను అందజేస్తామన్నారు.
అలాగే రూ. 200 చెల్లిస్తే హెల్త్ కార్డు ఇస్తామని, దీంతో ఏడాది పాటు రూ. 2 లక్షల వరకు ఆ కుటుంబంలోని వారు వైద్యం చేయించుకోవచ్చని వివరించారు. ఈ హెల్త్‌కార్డు పథకానికి 18 నుంచి 55 ఏళ్ల లోపు వయసువారు అర్హులన్నారు. ఈ పథకాల్లో చేరదలచినవారు మండల కేంద్రాల్లోని ‘స్వావలంబన్’ కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించారు.
అలాగే ఈ పథకాలపై నియమితులైన డివిజినల్ ఆఫీసర్లు గ్రామాల్లో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పిస్తారని వెల్లడించారు. అలాగే గృహ వినియోగానికి 40 శాతం, వ్యవసాయ అవసరానికి 30 శాతం రాయితీపై సోలార్ ఇన్వెర్టర్లు అందజేస్తామని ఆయన చెప్పారు. స్థానిక డీవో ఆర్.బంగార్రాజు, నిర్వాహకుడు ఆర్.నాని, సర్పంచ్ ఇనపసప్పల మాణిక్యం, తదితరులు పాల్గొన్నారు.