Young wrestler
-
నిఖిల్‌కు ఆర్థిక సహాయం.. రూ. లక్ష నగదు పురస్కారం
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ అండర్–17 రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో ఫ్రీస్టయిల్ 60 కేజీల విభాగంలో కాంస్య పతకం సాధించిన తెలంగాణ కుర్రాడు నిఖిల్ యాదవ్‌కు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (నాచారం) యాజమాన్యం ఆర్థిక సహాయం చేసింది. శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ చైర్మన్ మల్కా కొమురయ్య నిఖిల్‌కు రూ. లక్ష నగదు పురస్కారాన్ని చెక్ రూపంలో అందజేశారు. తండ్రి, మాజీ రెజ్లర్ సురేశ్ యాదవ్ అడుగుజాడల్లో నడుస్తున్న నిఖిల్ ప్రస్తుతం బళ్లారిలోని ఇన్‌స్పయిర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌లో శిక్షణ తీసుకుంటున్నాడు. 2011లో హంగేరిలో జరిగిన ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో దేవీ సింగ్ ఠాకూర్ కాంస్య పతకం గెలిచిన తర్వాత... నిఖిల్ రూపంలో మరో హైదరాబాద్ రెజ్లర్ ప్రపంచ జూనియర్ టోర్నీలో పతకం సాధించాడు. ఈ కార్యక్రమంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ప్రతినిధి మల్కా యశస్వి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ అల్లీపురం వెంకటేశ్వర రెడ్డి, నిఖిల్ తల్లి మమత, సోదరుడు అఖిల్, అంతర్జాతీయ మాజీ రెజ్లర్ అభిమన్యు, తెలంగాణ కేసరి రెజ్లర్ మెట్టు శివ పహిల్వాన్, కరాటే మాస్టర్ రవి తదితరులు పాల్గొన్నారు. చదవండి: FIFA World Cup 2022: ఒక రోజు ముందుగానే... కారణమిదే! -
World Wrestling:32 ఏళ్ల తర్వాత...
రోమ్ (ఇటలీ): సుదీర్ఘ నిరీక్షణకు తెర పడింది. ప్రపంచ రెజ్లింగ్ అండర్–17 చాంపియన్‌షిప్‌లో గ్రీకో రోమన్ విభాగంలో భారత్‌కు 32 ఏళ్ల తర్వాత స్వర్ణ పతకం లభించింది. మంగళవారం జరిగిన 55 కేజీల గ్రీకో రోమన్ విభాగంలో భారత యువ రెజ్లర్ సూరజ్ విజేతగా అవతరించాడు. ఫైనల్లో సూరజ్ 11–0తో ఫరైమ్ ముస్తఫయెవ్ (అజర్బైజాన్)పై విజయం సాధించాడు. తద్వారా 1990లో పప్పూ యాదవ్ తర్వాత ప్రపంచ అండర్–17 చాంపియన్‌షిప్‌లో గ్రీకో రోమన్ విభాగంలో పసిడి పతకం నెగ్గిన భారత రెజ్లర్‌గా సూరజ్ గుర్తింపు పొందాడు. -
సుశీల్‌పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ
న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ... గత పదకొండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌తోపాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఆరుగురిపై ఢిల్లీ కోర్టు నాన్‌బెయిలబుల్ వారంట్లను జారీ చేసింది. మే 4వ తేదీ రాత్రి ఢిల్లీలోని ఛత్రశాల్ స్టేడియం ఆవరణలో జరిగిన గొడవలో 23 ఏళ్ల యువ రెజ్లర్ సాగర్ రాణా ధన్కడ్, అతని ఇద్దరు మిత్రులు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ సాగర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన తర్వాత కనిపించకుండా పోయిన సుశీల్ ఆచూకీ కోసం ఢిల్లీ పోలీసులు గత సోమవారం ‘లుక్ అవుట్’ నోటీసులు జారీ చేశారు. సుశీల్ ఫోన్ కూడా స్విచాఫ్ చేయడంతో పోలీసులు అతని ఆనవాళ్లు కనిపెట్టడంలో విఫలమయ్యారు. హరిద్వార్‌లోని విఖ్యాత యోగా గురువుకు చెందిన ఆశ్రమంలో సుశీల్ తలదాచుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఎఫ్ఐఆర్ నమోదు చేశాక సుశీల్‌కు నోటీసులు జారీ చేశాం. కానీ అతను స్పందించలేదు. సుశీల్ ఫోన్ కూడా స్విచాఫ్ చేసి ఉంది. సుశీల్ మిత్రుల ఇంటిపై కూడా దాడులు నిర్వహించినా ఎలాంటి సమాచారం లభించలేదు. దాంతో సుశీల్ ఆచూకీ చెప్పినవారికి తగిన రివార్డు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ కేసులో బాధితుల నుంచి తీసుకున్న స్టేట్మెంట్స్లో అందరూ సుశీల్ పేరు చెప్పారు. ఈ కేసుతో సంబంధం ఉన్న సుశీల్ అనుచరుడు అజయ్ ప్రభుత్వ వ్యాయామ విద్యా ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అజయ్‌పై డిపార్ట్మెంటల్ చర్య తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వానికి లేఖ రాశాం’ అని ఢిల్లీకి చెందిన ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. 37 ఏళ్ల సుశీల్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం సాధించాడు. ఒలింపిక్స్ చరిత్రలో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక భారత క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. వరుసగా మూడు కామన్వెల్త్ గేమ్స్‌లో (2010, 2014, 2018) స్వర్ణ పతకాలు నెగ్గిన సుశీల్ 2010లో సీనియర్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఏకైక భారత రెజ్లర్ కావడం విశేషం. ప్రాణాలు తీసేంత తప్పేం చేశాడు... నా కొడుకు సాగర్ ఛత్రశాల్ స్టేడియంలో ఎనిమిదేళ్లుగా శిక్షణ తీసుకుంటున్నాడు. 2017 ఆసియా, ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. సుశీల్‌ను, అతని మామ సత్పాల్ సింగ్‌ను సాగర్ ఎంతో ఆరాధించేవాడు. సాగర్ తప్పు చేసి ఉంటే అతడిని నాలుగు చెంప దెబ్బలు కొట్టాల్సింది. లేదంటే ఛత్ర శాల్ స్టేడియం నుంచి బయటకు పంపించాల్సింది. ప్రాణాలు తీసేంత తప్పు పని నా కొడుకు చేశాడా? ఈ కేసుతో సంబంధం ఉన్న వారు చాలా పెద్ద వ్యక్తులు. ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు నాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వారు తమ మాట నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను. –అశోక్ (సాగర్ తండ్రి), ఢిల్లీ పోలీసు హెడ్‌కానిస్టేబుల్ -
సుశీల్ కుమార్ ఎక్కడ?
న్యూఢిల్లీ: రెజ్లింగ్ స్టార్, ఒలింపిక్స్‌లో రెండు పతకాలు గెలిచిన ఏకైక భారతీయుడైన సుశీల్ కుమార్ పరారీ వ్యవహారం సీరియస్‌గా మారింది. యువ రెజ్లర్ సాగర్ రాణా హత్యోదంతానికి సంబంధించి సుశీల్‌పై ఢిల్లీ పోలీసులు ‘లుక్ అవుట్’ నోటీసులు జారీ చేశారు. గత మంగళవారం ఘటన జరిగిన తర్వాత ఎవరికీ అందుబాటులో లేని సుశీల్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఆదివారం సాయంత్రం ‘లుక్ అవుట్’ నోటీసు ఇచ్చినట్లు సీనియర్ పోలీసు అధికారి ఒకరు స్పష్టం చేశారు. పోలీసు ఎఫ్ఐఆర్లో సుశీల్ పేరు ఉండటంతో అతడిని పట్టుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నించి విఫలమయ్యామని వారు చెప్పారు. ఢిల్లీ–ఎన్సీఆర్తో పాటు పొరుగు రాష్ట్రాల్లో కూడా సుశీల్ కోసం వెతికామని వెల్లడించారు. ఈ ఘటనలో బాధితుల స్టేట్మెంట్ను పోలీసులు ఇప్పటికే రికార్డు చేశారు. ఛత్రశాల్ స్టేడియం పార్కింగ్ వద్ద ఇరు వర్గాలు కొట్టుకున్న ఘటనలో 23 ఏళ్ల జాతీయ మాజీ జూనియర్ చాంపియన్ సాగర్ రాణా తీవ్రంగా గాయపడి ఆపై మృతి చెందాడు. ఆ సమయంలో సుశీల్ అక్కడే ఉన్నాడని సాక్షులు చెప్పారు. తన గురించి బహిరంగంగా చెడుగా మాట్లాడుతున్న రాణాకు బుద్ధి చెప్పాలనే ఉద్దేశంతో అతని ఇంటినుంచి లాక్కొని వచ్చి మరీ సుశీల్, అతని అనుచరులు కొట్టారని కూడా మరికొందరు సాక్ష్యమిచ్చారు. రెజ్లింగ్ పరువు పోయింది: డబ్ల్యూఎఫ్ఐ రెండు ఒలింపిక్ పతకాలతో పాటు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఏకైక భారతీయుడైన సుశీల్ కుమార్ ఇప్పుడు హత్య కేసులో పరారీలో ఉండటం దురదృష్టకరమని భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) సహాయ కార్యదర్శి వినోద్ తోమర్ అన్నారు. ఒకప్పుడు ఒంటి చేత్తో భారత రెజ్లింగ్ స్థాయిని పెంచి ఎందరితో ఆదర్శంగా నిలిచిన సుశీల్ ఇలా కావడం బాధగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. తాజా ఘటన సుశీల్‌కు వ్యక్తిగతంగానే కాకుండా భారత రెజ్లింగ్ మొత్తానికి చెడ్డ పేరు తెచ్చిందని తోమర్ అభిప్రాయ పడ్డారు. రెజ్లర్లు అంటే గూండాలనే భావన మళ్లీ నెలకొంటుందని తోమర్ ఆందోళన వ్యక్తం చేశారు. -
గణనాధా...నువ్యైనా గమనించు
ప్రత్యర్థిని ‘పట్టు’ పట్టాల్సిన చేతులు మట్టి పిసుక్కుంటున్నాయి. అంతర్జాతీయ యవనికపై మువ్వన్నెల జెండా రెపరెపలాడించిన క్రీడాకారుడు... పొట్ట కూటి కోసం రంగులు పట్టుకున్నాడు. సాధించిన విజయాలకు గుర్తింపు లభిస్తే దర్జాగా జీవించాల్సిన ఆటగాడు... సాయం కోసం ఎదురు చూస్తున్నాడు. ఒలింపిక్ పతకం లక్ష్యంగా నిర్దేశించుకున్న కుర్రాడు... పూట గడిచేందుకు వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నాడు. హైదరాబాద్‌కు చెందిన యువ రెజ్లర్ దేవీసింగ్ ఠాకూర్ విషాద గాథ ఇది. ఇప్పటికే పేరు తెచ్చుకున్న క్రీడాకారులకు కోట్లాది రూపాయలు ఇచ్చే ప్రభుత్వాలు... ఇలాంటి మాణిక్యాలని మట్టిలోనే వదిలేస్తున్నాయి. మన వ్యవస్థలో ఉన్న లోపాలకు నిదర్శనం ఈ యువ క్రీడాకారుడి జీవితం... - యువ రెజ్లర్ దేవీసింగ్ విషాద గాథ - ప్రపంచ స్థాయిలో పతకాలు - ఆర్థిక భారంతో శిక్షణకు దూరం - వినాయక విగ్రహాల తయారీలో నిమగ్నం సాక్షి, హైదరాబాద్: దీక్షగా వినాయకుడి విగ్రహాన్ని తీర్చి దిద్దుతున్న ఈ 22 ఏళ్ల కుర్రాడి పేరు దేవీ సింగ్ ఠాకూర్... వినాయక చవితి సీజన్లో నాలుగు విగ్రహాలు తయారు చేస్తేగానీ ఆ కుటుంబానికి ఐదువేళ్లూ నోట్లోకి వెళ్లవు. హైదరాబాద్ పాతబస్తీలోని ధూల్‌పేట ప్రాంతంలో ఇలాంటి వాళ్లు చాలామందే ఉంటారు. ఈ సీజన్లో నాలుగు డబ్బులు సంపాదించుకోకపోతే... ఆ తర్వాత ఏడాదంతా ఇబ్బంది పడాలి. అందుకే రాత్రింబవళ్లు కష్టపడతారు. దేవీసింగ్ కూడా అదే పని చేస్తున్నాడు. అయితే అతను అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలు తెచ్చిన రెజ్లర్. భారత్‌లో పెద్ద పెద్ద పేరున్న రెజ్లర్లను చిత్తు చేసిన వీరుడు. అతని దురదృష్టమో... వ్యవస్థలో లోపమో... కారణమేదైనా నైపుణ్యం ఉన్న ఓ గొప్ప క్రీడాకారుడు పేదరికాన్ని జయించడానికి తన కెరీర్‌ను త్యాగం చేశాడు. పతకాలు తేవాల్సిన ఆటగాడు పని కోసం వెతుక్కుంటున్నాడు. ఛత్రశాలలో శిక్షణ పాతబస్తీలో రెజ్లింగ్ చాలా ఫేమస్. ఇక్కడ చిన్నప్పుడే పిల్లలు ఈ ఆటపై మక్కువ పెంచుకుంటారు. దేవీసింగ్ కూడా అలా చిన్నతనంలోనే ఈ క్రీడ పట్ల ఆకర్షణ పెంచుకున్నాడు. మిగిలిన వాళ్లలా టైమ్‌పాస్ చేయకుండా బాగా కష్టపడి రాష్ట్ర స్థాయిలో వరుస విజయాలు సాధించాడు. ఆ తర్వాత ఢిల్లీలోని ప్రఖ్యాత ఛత్రశాల స్టేడియంలో సెలక్షన్స్‌కు వెళ్లి జాతీయ స్థాయిలో ఆకట్టుకున్నాడు. సుశీల్ కుమార్, యోగేశ్వర్‌దత్ సహా దేశంలో ప్రఖ్యాత రెజ్లర్లంతా ఇక్కడ శిక్షణ పొందినవారే. అక్కడ శిక్షణకు ఎంపికైతే భవిష్యత్‌లో అంతర్జాతీయ పతకాల వర్షం ఖాయం. ఎంతో పోటీ ఉండే ఆ సెలక్షన్స్‌లో దేశవ్యాప్తంగా వచ్చిన రెజర్లను ఓడించి దేవీసింగ్ శిక్షణకు ఎంపికయ్యాడు. అక్కడ శిక్షణ ఉచితం. కానీ భోజనం, బస, ఇతర ఖర్చులకు సొంతంగా డబ్బు సమకూర్చుకోవాలి. స్నేహితులు, తెలిసిన వారి సాయంతో గత ఏడాది వర కు అక్కడ శిక్షణ తీసుకున్నాడు. తనలో ఉన్న సహజ నైపుణ్యానికి మెరుగులు దిద్దడంతో దేవీసింగ్ అనతికాలంలోనే తన ఉనికిని చాటుకున్నాడు. జాతీయ స్థాయిలో పదుల సంఖ్యలో పతకాలు సాధించాడు. అంతర్జాతీయ స్థాయిలో పెద్ద రెజ్లర్లు ఆశ్చర్యపోయే ఫలితాలు సాధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇంటికి వెళ్లొస్తానని చెప్పి... ఓ వైపు పతకాలు సాధిస్తున్నా ఎక్కడా ప్రోత్సాహం మాత్రం దొరకలేదు. రోజులు గడుస్తున్నకొద్దీ శిక్షణ భారంగా మారింది. ఇక్కడ కుటుంబ ఆర్థిక పరిస్థితి దిగజారింది. తండ్రి ఆరోగ్యం బాగోవడం లేదు. ఇద్దరు అక్కలకు పెళ్లి చేయాలి. ఈ స్థితిలో ఏమీ పాలుపోక గతేడాది హైదరాబాద్ రెలైక్కాడు. ఇంటికి వెళ్లొస్తా అని చెప్పిన దేవీసింగ్ మళ్లీ ఢిల్లీ ముఖం చూడలేదు. ఛత్రశాల నుంచి కోచ్‌లు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. కానీ వెళ్లలేని పరిస్థితి. కానీ అసలు కారణం మాత్రం ఆర్థిక ఇబ్బందులు. అత్యుత్తమ రెజ్లర్‌గా మారేందుకు శిక్షణతో పాటు ఫిట్నెస్ కోసం తగిన డైట్, ప్రొటీన్లతో కూడిన ఆహారం వంటివి ఎంతో అవసరం. ఎలా చూసుకున్నా అక్కడి ఖర్చును తాను అందుకోలేకపోతున్నాడు. దీంతో రెజ్లింగ్‌ను వదిలేశాడు. కుటుంబ పోషణ కోసం వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నాడు. దేవీసింగ్ సాధించిన ముఖ్య ఘనతలు 2011: ఆసియా క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం (థాయ్‌లాండ్) 2011: ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం (హంగెరీ) 2012: ఆసియా జూనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం (కజకిస్తాన్) స్థానిక పోటీలకే పరిమితం ఒలింపిక్ స్థాయి ఆటగాళ్లతో పోటీ పడిన ఆ కుర్రాడు ఇప్పుడు స్థానిక కుస్తీ పోటీలకే పరిమితమవుతున్నాడు. ఇందులో చాలా వాటిలో విజేతలకు దక్కే ప్రైజ్‌మనీ రూ. 10 వేలు మాత్రమే. కొంత మంది నిర్వాహకులు అది కూడా ఎగ్గొడతారు. ‘హింద్ కేసరి’లాంటి పోటీల సమయంలో మాత్రం కాస్త హడావుడి ఉంటుంది. ఇక్కడ విజేతకు ప్రైజ్‌మనీగా బైక్ ఇస్తారు. ఇలా ఐదు బైక్‌లు తను గెలుచుకున్నాడు. కానీ ఆర్థిక ఇబ్బందులతో వాటిని అమ్ముకున్నాడు. నిజానికి దేవీసింగ్‌కు అనేకసార్లు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల స్థాయిలో ఎంతో మంది ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ ఎవరూ నెరవేర్చలేదు. రెజ్లింగ్ పోటీల ముగింపు వేడుకలకు వచ్చి బహుమతి ఇచ్చి పొగడ్తలు కురిపిస్తున్నారు. ప్రభుత్వ సాయం ఇప్పిస్తామంటున్నారు. కానీ మళ్లీ తనని ఎవరూ కనీసం తిరిగి పలకరించిన పాపాన పోలేదు. బజరంగ్నే భయపెట్టాడు రెజ్లర్‌గా దేవీసింగ్లో అపార ప్రతిభ ఉంది. దీనిని గుర్తించే ఛత్రశాలలో అతడిని అందరూ ప్రోత్సహించారు. అక్కడ రెజ్లర్ల మధ్య హోరాహోరీగా బౌట్లు జరుగుతాయి. ఇటీవల ‘అర్జున అవార్డు’ గెలుచుకున్న బజరంగ్ కుమార్ కూడా అక్కడే ప్రాక్టీస్ చేస్తాడు. దేవీసింగ్ ఏకంగా మూడుసార్లు బజరంగ్‌ను చిత్తుగా ఓడించాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌కు ముందు భారత రెజ్లింగ్ జట్టుకు అమెరికాలో శిక్షణ కార్యక్రమం జరిగింది. అక్కడకు సీనియర్లతో పాటు దేవీసింగ్ కూడా వెళ్లాడు. ప్రాక్టీస్ సమయంలో దేవీసింగ్ లాంటి నైపుణ్యం ఉన్న కుర్రాడు కావాలని సుశీల్‌కుమార్ లాంటి స్టార్ రెజ్లర్ కోరుకున్నాడ ంటే... తన నైపుణ్యం ఎంతో గ్రహించవచ్చు. ఇక మరో స్టార్ యోగేశ్వర్ దత్... దేవీ సింగ్‌ను సొంత తమ్ముడిలా చూసుకున్నాడు. ఒక దశలో తన ఖర్చులు కూడా భరించాడు. ఇప్పుడు కూడా ఢిల్లీ రమ్మని యోగేశ్వర్ చెబుతున్నాడు. కానీ ‘అన్న’లా ఆదరిస్తున్న మనిషి మీద ఎంతకాలం భారం వేస్తామనే ఆలోచన ఈ కుర్రాడిది. ఒకవేళ వెళ్లి శిక్షణ తీసుకున్నా... ఇక్కడ కుటుంబం ఎలా గడవాలి? ధూల్‌పేటలో ఎక్కడో మూలన మురికివాడలో దేవీసింగ్ ఇల్లు ఉంది. కానీ యోగేశ్వర్, సుశీల్ ఎవరు వచ్చినా అక్కడికి వెళ్లి వస్తారు. ఈ కుర్రాడిని భారత రెజ్లింగ్ ప్రపంచం ఎంత ఇష్టపడుతుందో చెప్పడానికి ఇదే నిదర్శనం. సాధించగలననే నమ్మకం ఉంది ఉద్యోగం కోసం చేయని ప్రయత్నం లేదు. ప్రాక్టీస్ మానుకుని చాలామంది పెద్దల వెంట తిరిగాను. కానీ ఎవరి నుంచి ఎలాంటి సహాయం, సహకారం రాలేదు. యోగేశ్వర్ భయ్యా రమ్మంటున్నాడు. కానీ నేను నా స్వార్థం చూసుకుని వెళ్లిపోతే ఇక్కడ నా కుటుంబం గడవదు. పైగా భయ్యాకు కూడా భారమే అవుతా. కొంత ఆర్థిక వెసులుబాటు ఉంటే రెజ్లింగ్‌పై దృష్టిపెట్టొచ్చు. నా వయసు ఇంకా 22 ఏళ్లే. కాబట్టి కచ్చితంగా ఇంకా చాలా సాధించగలననే నమ్మకం ఉంది.’ - దేవీసింగ్