సుశీల్‌పై నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ | Non-bailable Warrant Issued Against Wrestler Sushil Kumar againest murder case | Sakshi
Sakshi News home page

సుశీల్‌పై నాన్‌ బెయిలబుల్‌ వారంట్‌ జారీ

Published Sun, May 16 2021 3:46 AM | Last Updated on Sun, May 16 2021 7:04 AM

Non-bailable Warrant Issued Against Wrestler Sushil Kumar againest murder case - Sakshi

న్యూఢిల్లీ: యువ రెజ్లర్‌ సాగర్‌ రాణా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ... గత పదకొండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న భారత స్టార్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌తోపాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఆరుగురిపై ఢిల్లీ కోర్టు నాన్‌బెయిలబుల్‌ వారంట్‌లను జారీ చేసింది. మే 4వ తేదీ రాత్రి ఢిల్లీలోని ఛత్రశాల్‌ స్టేడియం ఆవరణలో జరిగిన గొడవలో 23 ఏళ్ల యువ రెజ్లర్‌ సాగర్‌ రాణా ధన్‌కడ్, అతని ఇద్దరు మిత్రులు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ సాగర్‌ ప్రాణాలు కోల్పోయాడు.

ఈ సంఘటన తర్వాత కనిపించకుండా పోయిన సుశీల్‌ ఆచూకీ కోసం ఢిల్లీ పోలీసులు గత సోమవారం ‘లుక్‌ అవుట్‌’ నోటీసులు జారీ చేశారు. సుశీల్‌ ఫోన్‌ కూడా స్విచాఫ్‌ చేయడంతో పోలీసులు అతని ఆనవాళ్లు కనిపెట్టడంలో విఫలమయ్యారు. హరిద్వార్‌లోని విఖ్యాత యోగా గురువుకు చెందిన ఆశ్రమంలో సుశీల్‌ తలదాచుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశాక సుశీల్‌కు నోటీసులు జారీ చేశాం. కానీ అతను స్పందించలేదు. సుశీల్‌ ఫోన్‌ కూడా స్విచాఫ్‌ చేసి ఉంది. సుశీల్‌ మిత్రుల ఇంటిపై కూడా దాడులు నిర్వహించినా ఎలాంటి సమాచారం లభించలేదు. దాంతో సుశీల్‌ ఆచూకీ చెప్పినవారికి తగిన రివార్డు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం.

ఈ కేసులో బాధితుల నుంచి తీసుకున్న స్టేట్‌మెంట్స్‌లో అందరూ సుశీల్‌ పేరు చెప్పారు. ఈ కేసుతో సంబంధం ఉన్న సుశీల్‌ అనుచరుడు అజయ్‌ ప్రభుత్వ వ్యాయామ విద్యా ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అజయ్‌పై డిపార్ట్‌మెంటల్‌ చర్య తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వానికి లేఖ రాశాం’ అని ఢిల్లీకి చెందిన ఓ సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు. 37 ఏళ్ల సుశీల్‌ 2008 బీజింగ్‌ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో రజతం సాధించాడు. ఒలింపిక్స్‌ చరిత్రలో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక భారత క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. వరుసగా మూడు కామన్వెల్త్‌ గేమ్స్‌లో (2010, 2014, 2018) స్వర్ణ పతకాలు నెగ్గిన సుశీల్‌ 2010లో సీనియర్‌ విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఏకైక భారత రెజ్లర్‌ కావడం విశేషం.

ప్రాణాలు తీసేంత తప్పేం చేశాడు...
నా కొడుకు సాగర్‌ ఛత్రశాల్‌ స్టేడియంలో  ఎనిమిదేళ్లుగా శిక్షణ తీసుకుంటున్నాడు. 2017 ఆసియా, ప్రపంచ జూనియర్‌ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. సుశీల్‌ను, అతని మామ సత్పాల్‌ సింగ్‌ను సాగర్‌ ఎంతో ఆరాధించేవాడు. సాగర్‌ తప్పు చేసి ఉంటే అతడిని నాలుగు చెంప దెబ్బలు కొట్టాల్సింది. లేదంటే ఛత్ర శాల్‌ స్టేడియం నుంచి బయటకు పంపించాల్సింది. ప్రాణాలు తీసేంత తప్పు పని నా కొడుకు చేశాడా? ఈ కేసుతో సంబంధం ఉన్న వారు చాలా పెద్ద వ్యక్తులు. ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు నాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వారు తమ మాట నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను. –అశోక్‌ (సాగర్‌ తండ్రి), ఢిల్లీ పోలీసు హెడ్‌కానిస్టేబుల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement