Chhatrasal Stadium
-
‘చార్జ్‌షీట్’లో సుశీల్ పేరు
న్యూఢిల్లీ: భారత స్టార్ రెజ్లర్, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్‌ను మరింతగా ఇబ్బందుల్లోకి నెట్టే పరిణామం! దాదాపు ఏడాదిన్నర క్రితం రెజ్లర్ సాగర్ ధన్కర్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుశీల్ పేరును ఢిల్లీ పోలీసులు తాజాగా చార్జ్ షీట్లో చేర్చారు. సుశీల్‌తో పాటు మరో 17 మంది పేర్లు ఇందులో ఉన్నాయి. ఇకపై చార్జ్‌షీట్‌కు అనుగుణంగా పూర్తి స్థాయిలో కేసుకు సంబంధించి కోర్టులో విచారణ సాగనుంది. 2021 మే 4 ఛత్ర్శాల్ స్టేడియంలో సాగర్‌పై దాడి జరగ్గా, తీవ్రంగా గాయపడిన అతను ఆ తర్వాత మృతి చెందాడు. గత ఏడాది మే 23న అరెస్టయిన సుశీల్ ఇంకా తీహార్ జైలులోనే ఉన్నాడు. -
భూ తగాదాలు... గ్యాంగ్స్టర్లు... ప్రాణభయం
వేదిక రెజ్లింగ్ స్టేడియమే కావచ్చు... కానీ అది రెజ్లర్ల మధ్య గొడవ మాత్రమే కాదు... దాని వెనక బయటకు కనిపించని అనేక చీకటి కథలున్నాయి... దేశంలో ఎవరికీ సాధ్యంకాని రీతిలో రెండు ఒలింపిక్ మెడల్స్‌ను సాధించిన దిగ్గజం తనది కాని బాటలో వెళ్లి తప్పుడు మనిషిగా తేలిన వైనమిది... ఎన్నో ఏళ్ల పాటు శ్రమించి సాధించిన కీర్తి ప్రతిష్టలను పణంగా పెడుతూ సాధారణ గల్లీ గూండాలతో చేసిన స్నేహం, ఆపై శత్రుత్వం సుశీల్ కుమార్‌ను పతకాలు సాధించే స్థాయి నుంచి పతనం వైపు నడిపించింది. న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో సుశీల్ కుమార్ అరెస్ట్ అయిన తర్వాత దీనికి సంబంధించి పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మే 4న ఈ ఘటన జరిగిన రోజున వచ్చిన సమాచారాన్ని బట్టి చూస్తే... ఛత్రశాల్ స్టేడియంలో రెజ్లింగ్ ప్రాక్టీస్ చేసే కొందరి మధ్య వాదోపవాదాల తర్వాత క్షణికావేశంలో జరిగిన ఉదంతంలా కనిపించింది. కానీ ఇప్పుడు దానికి సంబంధించి అనేక విషయాలు బయటపడుతున్నాయి. ఆస్తి, భూ తగాదాలు ప్రాథమిక కారణం కావడంతో పాటు రౌడీల భాగస్వామ్యం కూడా ఇందులో ఉంది. నిజానికి 18 రోజులపాటు సుశీల్ తప్పించుకు తిరిగింది పోలీసుల భయం వల్ల కాదని... గ్యాంగ్స్టర్లు తనను చంపేస్తారనే భయంతోనే అతను ఆ పని చేసినట్లు తెలుస్తోంది. నేపథ్యమిదీ... ఢిల్లీలోని మోడల్ హౌస్ ప్రాంతంలో కోట్లాది రూపాయల విలువైన ఒక ఫ్లాట్ వివాదానికి ప్రధాన కారణంగా మారింది. తన భార్య పేరిట ఉన్న ఈ ఫ్లాట్‌ను సందీప్ అలియాస్ కాలా జఠేడి అనే వ్యక్తి భాగస్వామ్యంతో కలిసి సుశీల్ కొన్నాడు. సుశీల్ స్నేహం చేసిన ఈ కాలా జఠేడి న్యూఢిల్లీలో గ్యాంగ్స్టర్లలో ఒకడు. అతనిపైన పెద్ద సంఖ్యలో పోలీసు కేసులు ఉన్నాయి. ఢిల్లీ పరిసరాల్లో భూ కబ్జాల్లో అతని పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. చాలా మంది రెజ్లర్లతో పాటు క్రిమినల్స్ కూడా ఈ ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు. ఇందులో కొన్నాళ్లుగా జఠేడి మేనల్లుడి వరుస, అత్యంత ఆత్మీయుడైన రెజ్లర్ సోనూ మహల్, మరో రెజ్లర్ సాగర్ రాణా ఉంటున్నారు. రెజ్లర్ సోనూపై కూడా పలు క్రిమినల్ కేసులు ఉన్నాయి. సమభాగస్వామ్యం ఉన్న ఈ ఫ్లాట్‌ను జఠేడి అమ్మాలని భావించగా, అందుకు సుశీల్ అంగీకరించలేదు. దానిని అమ్మి తన డబ్బులు ఇవ్వాలంటూ సుశీల్‌పై జఠేడి ఒత్తిడి పెంచగా... ఫ్లాట్‌లో ఉంటున్న సోనూ, సాగర్ ఖాళీ చేయాలంటూ సుశీల్ మరోవైపు చెబుతూ వచ్చాడు. గుణపాఠం చెప్పాలని... సుశీల్ గత కొంత కాలంగా జఠేడి ప్రత్యర్థి అయిన మరో గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవానా, నవీన్ బాలిలతో స్నేహం పెంచుకోవడం కూడా జఠేడి ఆగ్రహానికి కారణమైంది. ఫ్లాట్ ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్న సుశీల్‌పై సోనూ తదితరులు బహిరంగంగా దుర్భాషలాడటం మొదలు పెట్టారు. దాంతో వారికి గుణపాఠం చెప్పాలని సుశీల్ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మే 4న స్టేడియం ముందు వీరంతా ఎదురెదురుగా తలపడ్డారు. అప్పటికే నీరజ్‌కు సంబంధించిన గూండాలను సుశీల్ తన కోసం పిలిపించుకున్నాడు. జఠేడి భయంతో సుశీల్ తనను ఏమీ చేయడని సోనూ భావించినా... నీరజ్ గూండాలు వారిని చితకబాదారు. ఆవేశపరుడైన సుశీల్ కూడా తాను ఓ చేయి వేశాడు. పైగా తనేంటో అందరికీ తెలియాలని, వారిలో భయం ఉండాలంటూ ఈ ఘటనను వీడియో షూట్ చేయమని తనవారికి సూచించాడు. తీవ్రంగా గాయపడిన సాగర్ తర్వాతి రోజు ఆసుపత్రిలో మరణించడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. వేర్వేరు చోట్ల నుంచి తప్పించుకుంటూ... తన మేనల్లుడు సోనూపై దాడి సహజంగానే జఠేడికి కోపం తెప్పించింది. దాంతో సుశీల్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు అతను సిద్ధమయ్యాడు. అనూహ్య ఘటన తర్వాత బెదిరిన సుశీల్ ఆ రోజు నుంచి ఎవరికీ దొరక్కుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. తనకు ప్రాణహాని ఉందంటూ ముందస్తు బెయిల్ కోసం చేసిన దరఖాస్తులో కూడా పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి మొదలు పెట్టి యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణాల్లో దాక్కున్నాడు. తనను క్షమించమంటూ చివరకు జఠేడిని ఫోన్లో కోరేందుకు కూడా సుశీల్ ప్రయత్నించినట్లు సమాచారం. పోలీసుల చేతికి చిక్కిన తర్వాత కూడా అతను హత్య కేసుకంటే కూడా తనకు రౌడీల నుంచి రక్షణ కల్పించమంటూ అతను కోరాడని తెలిసింది. సస్పెండ్ చేయనున్న రైల్వేస్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుశీల్ కుమార్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలని రైల్వే శాఖ భావిస్తోంది. నార్తర్న్ రైల్వేలో సుశీల్ సీనియర్ కమర్షియల్ మేనేజర్ హోదాలో ఉన్నాడు. అయితే ప్రాథమిక స్థాయిలో క్రీడలను తీర్చిదిద్దే బాధ్యతలతో 2015 నుంచి అతను ఢిల్లీ ప్రభుత్వం వద్ద డిప్యుటేషన్ మీద ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ హోదాలో పని చేస్తున్నాడు. ఈ ఏడాది కూడా కొనసాగింపు కోరినా ఢిల్లీ ప్రభుత్వం అందుకు అనుమతించకపోవడంతో రైల్వేస్‌కు వెళ్లిపోయాడు. నిబంధనల ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా నేరాల్లో నిందితుడిగా ఉంటే దర్యాప్తు ముగిసేవరకు సస్పెండ్ చేస్తామని, సుశీల్ విషయంలో కూడా అదే జరుగుతుందని రైల్వే అధికారులు చెప్పారు. మరోవైపు సుశీల్‌పై ఇప్పటికిప్పుడు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని భారత రెజ్లింగ్ సమాఖ్య ప్రకటించింది. ప్రస్తుతం అతనిపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోందని... చట్ట పరంగా విచారణ తర్వాత ముగిసి తీర్పు వచ్చిన తర్వాతే దానిపై మాట్లాడతామని స్పష్టం చేసింది. -
సుశీల్‌పై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ
న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ... గత పదకొండు రోజులుగా అజ్ఞాతంలో ఉన్న భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌తోపాటు ఈ కేసుతో సంబంధం ఉన్న మరో ఆరుగురిపై ఢిల్లీ కోర్టు నాన్‌బెయిలబుల్ వారంట్లను జారీ చేసింది. మే 4వ తేదీ రాత్రి ఢిల్లీలోని ఛత్రశాల్ స్టేడియం ఆవరణలో జరిగిన గొడవలో 23 ఏళ్ల యువ రెజ్లర్ సాగర్ రాణా ధన్కడ్, అతని ఇద్దరు మిత్రులు తీవ్రంగా గాయపడ్డారు. ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూ సాగర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన తర్వాత కనిపించకుండా పోయిన సుశీల్ ఆచూకీ కోసం ఢిల్లీ పోలీసులు గత సోమవారం ‘లుక్ అవుట్’ నోటీసులు జారీ చేశారు. సుశీల్ ఫోన్ కూడా స్విచాఫ్ చేయడంతో పోలీసులు అతని ఆనవాళ్లు కనిపెట్టడంలో విఫలమయ్యారు. హరిద్వార్‌లోని విఖ్యాత యోగా గురువుకు చెందిన ఆశ్రమంలో సుశీల్ తలదాచుకున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. ‘ఎఫ్ఐఆర్ నమోదు చేశాక సుశీల్‌కు నోటీసులు జారీ చేశాం. కానీ అతను స్పందించలేదు. సుశీల్ ఫోన్ కూడా స్విచాఫ్ చేసి ఉంది. సుశీల్ మిత్రుల ఇంటిపై కూడా దాడులు నిర్వహించినా ఎలాంటి సమాచారం లభించలేదు. దాంతో సుశీల్ ఆచూకీ చెప్పినవారికి తగిన రివార్డు కూడా ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. ఈ కేసులో బాధితుల నుంచి తీసుకున్న స్టేట్మెంట్స్లో అందరూ సుశీల్ పేరు చెప్పారు. ఈ కేసుతో సంబంధం ఉన్న సుశీల్ అనుచరుడు అజయ్ ప్రభుత్వ వ్యాయామ విద్యా ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. అజయ్‌పై డిపార్ట్మెంటల్ చర్య తీసుకోవాలని ఢిల్లీ ప్రభుత్వానికి లేఖ రాశాం’ అని ఢిల్లీకి చెందిన ఓ సీనియర్ పోలీసు అధికారి తెలిపారు. 37 ఏళ్ల సుశీల్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం సాధించాడు. ఒలింపిక్స్ చరిత్రలో రెండు వ్యక్తిగత పతకాలు సాధించిన ఏకైక భారత క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. వరుసగా మూడు కామన్వెల్త్ గేమ్స్‌లో (2010, 2014, 2018) స్వర్ణ పతకాలు నెగ్గిన సుశీల్ 2010లో సీనియర్ విభాగంలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఏకైక భారత రెజ్లర్ కావడం విశేషం. ప్రాణాలు తీసేంత తప్పేం చేశాడు... నా కొడుకు సాగర్ ఛత్రశాల్ స్టేడియంలో ఎనిమిదేళ్లుగా శిక్షణ తీసుకుంటున్నాడు. 2017 ఆసియా, ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. సుశీల్‌ను, అతని మామ సత్పాల్ సింగ్‌ను సాగర్ ఎంతో ఆరాధించేవాడు. సాగర్ తప్పు చేసి ఉంటే అతడిని నాలుగు చెంప దెబ్బలు కొట్టాల్సింది. లేదంటే ఛత్ర శాల్ స్టేడియం నుంచి బయటకు పంపించాల్సింది. ప్రాణాలు తీసేంత తప్పు పని నా కొడుకు చేశాడా? ఈ కేసుతో సంబంధం ఉన్న వారు చాలా పెద్ద వ్యక్తులు. ఢిల్లీ పోలీసు ఉన్నతాధికారులు నాకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. వారు తమ మాట నిలబెట్టుకుంటారని ఆశిస్తున్నాను. –అశోక్ (సాగర్ తండ్రి), ఢిల్లీ పోలీసు హెడ్‌కానిస్టేబుల్ -
సుశీల్‌కు బిగుసుకుంటున్న ఉచ్చు
న్యూఢిల్లీ: యువ రెజ్లర్ సాగర్ రాణా మృతి వ్యవహారంపై పోలీసుల విచారణ కీలక మలుపు తీసుకుంది. గ్రీకో రోమన్ 97 కేజీల విభాగంలో జాతీయ జూనియర్ మాజీ చాంపియన్ అయిన 23 ఏళ్ల సాగర్ రాణాను కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా కొట్టడంతో అతను చనిపోయాడు. భారత రెజ్లర్లకు అడ్డాలాంటి ఛత్రశాల్ స్టేడియం బయట జరిగిన ఈ ఘటనలో రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత, భారత మేటి రెజ్లర్ సుశీల్ కుమార్ హస్తం ఉందని వినిపిస్తోంది. అయితే అతను ఇప్పటికీ పోలీసులకు చిక్కలేదు. ఈ నేపథ్యంలో సుశీల్ మామ, సీనియర్ కోచ్ సత్పాల్ సింగ్‌ను పోలీసులు విచారించారు. ‘సుశీల్ మామ సత్పాల్ సింగ్, అతని బావమరిదిలను సుమారు రెండు గంటల పాటు విచారించాం. మంగళవారం స్టేడియం పార్కింగ్ ఏరియా వద్ద జరిగిన గొడవలో సుశీల్, అజయ్, ప్రిన్స్ దలాల్, సోనూ మహల్, సాగర్ అమిత్ భాగంగా ఉన్నారని మా విచారణలో తేలింది. సుశీల్, అతని సహచరులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలతో వెతుకుతున్నాం’ అని అడిషనల్ డీసీపీ గురిక్బాల్ సింగ్ వెల్లడించారు. మరోవైపు అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ జితేంద్ర సింగ్ రాసిన ఎఫ్ఐఆర్ కాపీలో ‘సుశీల్ పహిల్వాన్, అతని సహచరులు ఈ నేరం చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది’ అని రాసి ఉంది. 1982 ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించిన సత్పాల్ సింగ్‌కు కేంద్ర ప్రభుత్వం నుంచి అర్జున అవార్డు, ద్రోణాచార్య అవార్డు, పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలు కూడా లభించాయి. కెరీర్ తొలినాళ్ల నుంచి సత్పాల్ సింగ్ వద్ద శిక్షణ తీసుకున్న సుశీల్ 2010లో సత్పాల్ సింగ్ కూతురు సావీని పెళ్లి చేసుకున్నాడు. -
రెజ్లర్ సుశీల్ కుమార్‌పై కేసు
న్యూఢిల్లీ: భారత మేటి రెజ్లర్ సుశీల్ కుమార్‌పై కేసు నమోదైంది. సుశీల్‌కు చెందిన ఛత్రశాల్ స్టేడియం లోపల మంగళవారం రాత్రి జరిగిన గొడవలో 23 ఏళ్ల సాగర్ అనే రెజ్లర్ మృతి చెందాడు. దాంతో ఈ కేసుకు సంబంధించి 37 ఏళ్ల సుశీల్ కుమార్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఢిల్లీ సీనియర్ పోలీసు ఆఫీసర్ కుమార్ తెలిపారు. సుశీల్ ప్రస్తుతం అందుబాటులో లేడని, అతని కోసం గాలిస్తున్నామని కుమార్ తెలిపారు. 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్యం, 2012 లండన్ ఒలింపిక్స్‌లో రజతం గెలిచిన సుశీల్ కుమార్ ఒలింపిక్స్ చరిత్రలో భారత్ తరఫున రెండు వ్యక్తిగత పతకాలు గెలిచిన ఏకైక క్రీడాకారుడిగా గుర్తింపు పొందాడు. -
నగరాన్ని స్నేహానికి వారధిని చేద్దాం
న్యూఢిల్లీ: కుటుంబ సభ్యులతో ఏవిధంగా సన్నిహితంగా ఉంటామో అదేవిధంగా జాతీయ రాజధానిని సైతం స్నేహానికి వారధిని చేయాలంటూ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్ స్థానికులకు హితవు పలికారు. స్థానిక ఛత్రసాల్ స్టేడియంలో ఆదివారం త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ఆయన గణతంత్ర వేడుకల పరేడ్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘వచ్చే నెల ఏడో తేదీన నగరవాసులంతా తమ తమ ఆవాసాలను వీడి పోలింగ్ బూత్‌ల వద్దకు వచ్చి ఓటు వేయాలి. మనమంతా కొత్త ప్రభుత్వం కోసం ఎదురుచూస్తున్నాం. అందువల్ల ఎంతో ఉత్సాహంతో అంతా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలి. ఇది అందరి బాధ్యత’ అని విన్నవించారు. గూడులేనివారికి ఆవాసాలు నగరంలోని గూడులేని వారికి ఆవాస వసతి కల్పనకు తమ ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యమిస్తుందని జంగ్ పేర్కొన్నారు. నిరాశ్రయులకు నైట్ షెల్టర్లను నిర్మించ డం కూడా అందులో భాగమేనన్నారు. ‘దేశం ఎంతో పురోగమిస్తోంది. అయితే ప్రతిరోజూ కొత్త కొత్త సవా ళ్లు ఎదురవుతున్నాయి. చేయాల్సింది ఇంకా ఎంతో ఉంది’ అని అన్నారు. ప్రపంచ రూపురేఖలు శరవేగంగా మారిపోతున్నాయని, కొత్త కొత్త సవాళ్లను అధిగమించాల్సి ఉందని అన్నారు. దీంతోపాటు మనం కూడా శరవేగంగా అభివృద్ధి చెందాల్సి ఉందన్నారు. 20 శాతం పచ్చదనం నగరాన్ని సతతహరితంగా ఉంచాల్సిన అవసరం ఉందని జంగ్ పేర్కొన్నారు. నగరంలోని 20 శాతం ప్రాంతంలో పచ్చదనం పరిఢవిల్లుతోందన్నారు. నగరంలో దాదాపు 20 వేల పార్కులు ఉన్నాయని, ఇందువల్ల కొంతమేర కాలుష్య నియంత్రణ జరుగుతుందన్నారు. కాగా గణతంత్ర వేడుకలను పురస్కరించుకుని సాయుధ , పారామిలిటరీ, పోలీసు బలగాలకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు.