Sagar Rana Murder Case: Shocking Reasons Behind Wrestler Sushil Kumar Involvement - Sakshi
Sakshi News home page

భూ తగాదాలు... గ్యాంగ్‌స్టర్‌లు... ప్రాణభయం

Published Tue, May 25 2021 4:07 AM | Last Updated on Tue, May 25 2021 9:31 AM

Wrestler-criminal nexus reason behind Olympic champion Sushil Kumar murder case - Sakshi

వేదిక రెజ్లింగ్‌ స్టేడియమే కావచ్చు... కానీ అది రెజ్లర్ల మధ్య గొడవ మాత్రమే కాదు... దాని వెనక బయటకు కనిపించని అనేక చీకటి కథలున్నాయి... దేశంలో ఎవరికీ సాధ్యంకాని రీతిలో రెండు ఒలింపిక్‌ మెడల్స్‌ను సాధించిన దిగ్గజం తనది కాని బాటలో వెళ్లి తప్పుడు మనిషిగా తేలిన వైనమిది... ఎన్నో ఏళ్ల పాటు శ్రమించి సాధించిన కీర్తి ప్రతిష్టలను పణంగా పెడుతూ సాధారణ గల్లీ గూండాలతో చేసిన స్నేహం, ఆపై శత్రుత్వం సుశీల్‌ కుమార్‌ను పతకాలు సాధించే స్థాయి నుంచి పతనం వైపు నడిపించింది.   

న్యూఢిల్లీ: యువ రెజ్లర్‌ సాగర్‌ రాణా హత్య కేసులో సుశీల్‌ కుమార్‌ అరెస్ట్‌ అయిన తర్వాత దీనికి సంబంధించి పలు అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. మే 4న ఈ ఘటన జరిగిన రోజున వచ్చిన సమాచారాన్ని బట్టి చూస్తే... ఛత్రశాల్‌ స్టేడియంలో రెజ్లింగ్‌ ప్రాక్టీస్‌ చేసే కొందరి మధ్య వాదోపవాదాల తర్వాత క్షణికావేశంలో జరిగిన ఉదంతంలా కనిపించింది. కానీ ఇప్పుడు దానికి సంబంధించి అనేక విషయాలు బయటపడుతున్నాయి. ఆస్తి, భూ తగాదాలు ప్రాథమిక కారణం కావడంతో పాటు రౌడీల భాగస్వామ్యం కూడా ఇందులో ఉంది. నిజానికి 18 రోజులపాటు సుశీల్‌ తప్పించుకు తిరిగింది పోలీసుల భయం వల్ల కాదని... గ్యాంగ్‌స్టర్‌లు తనను చంపేస్తారనే భయంతోనే అతను ఆ పని చేసినట్లు తెలుస్తోంది.  

నేపథ్యమిదీ...
ఢిల్లీలోని మోడల్‌ హౌస్‌ ప్రాంతంలో కోట్లాది రూపాయల విలువైన ఒక ఫ్లాట్‌ వివాదానికి ప్రధాన కారణంగా మారింది. తన భార్య పేరిట ఉన్న ఈ ఫ్లాట్‌ను సందీప్‌ అలియాస్‌ కాలా జఠేడి అనే వ్యక్తి భాగస్వామ్యంతో కలిసి సుశీల్‌ కొన్నాడు. సుశీల్‌ స్నేహం చేసిన  ఈ కాలా జఠేడి న్యూఢిల్లీలో గ్యాంగ్‌స్టర్‌లలో ఒకడు. అతనిపైన పెద్ద సంఖ్యలో పోలీసు కేసులు ఉన్నాయి. ఢిల్లీ పరిసరాల్లో భూ కబ్జాల్లో అతని పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. చాలా మంది రెజ్లర్లతో పాటు క్రిమినల్స్‌ కూడా ఈ ఇంటికి వస్తూ పోతూ ఉండేవారు. ఇందులో కొన్నాళ్లుగా జఠేడి మేనల్లుడి వరుస, అత్యంత ఆత్మీయుడైన రెజ్లర్‌ సోనూ మహల్, మరో రెజ్లర్‌ సాగర్‌ రాణా ఉంటున్నారు. రెజ్లర్‌ సోనూపై కూడా పలు క్రిమినల్‌  కేసులు ఉన్నాయి. సమభాగస్వామ్యం ఉన్న ఈ ఫ్లాట్‌ను జఠేడి అమ్మాలని భావించగా, అందుకు సుశీల్‌ అంగీకరించలేదు. దానిని అమ్మి తన డబ్బులు ఇవ్వాలంటూ సుశీల్‌పై జఠేడి ఒత్తిడి పెంచగా... ఫ్లాట్‌లో ఉంటున్న సోనూ, సాగర్‌ ఖాళీ చేయాలంటూ సుశీల్‌ మరోవైపు చెబుతూ వచ్చాడు.  

గుణపాఠం చెప్పాలని...
సుశీల్‌ గత కొంత కాలంగా జఠేడి ప్రత్యర్థి అయిన మరో గ్యాంగ్‌స్టర్‌ నీరజ్‌ బవానా, నవీన్‌ బాలిలతో స్నేహం పెంచుకోవడం కూడా జఠేడి ఆగ్రహానికి కారణమైంది. ఫ్లాట్‌ ఖాళీ చేయించేందుకు ప్రయత్నిస్తున్న సుశీల్‌పై సోనూ తదితరులు బహిరంగంగా దుర్భాషలాడటం మొదలు పెట్టారు. దాంతో వారికి గుణపాఠం చెప్పాలని సుశీల్‌ నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో మే 4న స్టేడియం ముందు వీరంతా ఎదురెదురుగా తలపడ్డారు. అప్పటికే నీరజ్‌కు సంబంధించిన గూండాలను సుశీల్‌ తన కోసం పిలిపించుకున్నాడు. జఠేడి భయంతో సుశీల్‌ తనను ఏమీ చేయడని సోనూ భావించినా... నీరజ్‌ గూండాలు వారిని చితకబాదారు. ఆవేశపరుడైన సుశీల్‌ కూడా తాను ఓ చేయి వేశాడు. పైగా తనేంటో అందరికీ తెలియాలని, వారిలో భయం ఉండాలంటూ ఈ ఘటనను వీడియో షూట్‌ చేయమని తనవారికి సూచించాడు. తీవ్రంగా గాయపడిన సాగర్‌ తర్వాతి రోజు ఆసుపత్రిలో మరణించడంతో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది.

వేర్వేరు చోట్ల నుంచి తప్పించుకుంటూ...
తన మేనల్లుడు సోనూపై దాడి సహజంగానే జఠేడికి కోపం తెప్పించింది. దాంతో సుశీల్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు అతను సిద్ధమయ్యాడు. అనూహ్య ఘటన తర్వాత బెదిరిన సుశీల్‌ ఆ రోజు నుంచి ఎవరికీ దొరక్కుండా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. తనకు ప్రాణహాని ఉందంటూ ముందస్తు బెయిల్‌ కోసం చేసిన దరఖాస్తులో కూడా పేర్కొన్నాడు. ఈ క్రమంలో ఢిల్లీ నుంచి మొదలు పెట్టి యూపీ, ఉత్తరాఖండ్, పంజాబ్, హరియాణాల్లో దాక్కున్నాడు. తనను క్షమించమంటూ చివరకు జఠేడిని ఫోన్‌లో కోరేందుకు కూడా సుశీల్‌ ప్రయత్నించినట్లు సమాచారం. పోలీసుల చేతికి చిక్కిన తర్వాత కూడా అతను హత్య కేసుకంటే కూడా తనకు రౌడీల నుంచి రక్షణ కల్పించమంటూ అతను కోరాడని తెలిసింది.   

సస్పెండ్‌ చేయనున్న రైల్వేస్‌
హత్య కేసులో నిందితుడిగా ఉన్న సుశీల్‌ కుమార్‌ను ఉద్యోగం నుంచి తొలగించాలని రైల్వే శాఖ భావిస్తోంది. నార్తర్న్‌ రైల్వేలో సుశీల్‌ సీనియర్‌ కమర్షియల్‌ మేనేజర్‌ హోదాలో ఉన్నాడు. అయితే ప్రాథమిక స్థాయిలో క్రీడలను తీర్చిదిద్దే బాధ్యతలతో 2015 నుంచి అతను ఢిల్లీ ప్రభుత్వం వద్ద డిప్యుటేషన్‌ మీద ఆఫీసర్‌ ఆన్‌ స్పెషల్‌ డ్యూటీ హోదాలో పని చేస్తున్నాడు. ఈ ఏడాది కూడా కొనసాగింపు కోరినా ఢిల్లీ ప్రభుత్వం అందుకు అనుమతించకపోవడంతో రైల్వేస్‌కు వెళ్లిపోయాడు. నిబంధనల ప్రకారం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏదైనా నేరాల్లో నిందితుడిగా ఉంటే దర్యాప్తు ముగిసేవరకు సస్పెండ్‌ చేస్తామని, సుశీల్‌ విషయంలో కూడా అదే జరుగుతుందని రైల్వే అధికారులు చెప్పారు. మరోవైపు సుశీల్‌పై ఇప్పటికిప్పుడు ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని భారత రెజ్లింగ్‌ సమాఖ్య ప్రకటించింది. ప్రస్తుతం అతనిపై పోలీసు దర్యాప్తు కొనసాగుతోందని... చట్ట పరంగా విచారణ తర్వాత ముగిసి తీర్పు వచ్చిన తర్వాతే దానిపై మాట్లాడతామని స్పష్టం చేసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement