గణనాధా...నువ్యైనా గమనించు | Tragic story of Young wrestler Devisingh | Sakshi
Sakshi News home page

గణనాధా...నువ్యైనా గమనించు

Published Tue, Sep 8 2015 12:39 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM

గణనాధా...నువ్యైనా గమనించు - Sakshi

గణనాధా...నువ్యైనా గమనించు

ప్రత్యర్థిని ‘పట్టు’ పట్టాల్సిన చేతులు మట్టి పిసుక్కుంటున్నాయి.
అంతర్జాతీయ యవనికపై మువ్వన్నెల జెండా రెపరెపలాడించిన క్రీడాకారుడు... పొట్ట కూటి కోసం రంగులు పట్టుకున్నాడు.
సాధించిన విజయాలకు గుర్తింపు లభిస్తే దర్జాగా జీవించాల్సిన ఆటగాడు... సాయం కోసం ఎదురు చూస్తున్నాడు.
ఒలింపిక్ పతకం లక్ష్యంగా నిర్దేశించుకున్న కుర్రాడు... పూట గడిచేందుకు వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నాడు.


హైదరాబాద్‌కు చెందిన యువ రెజ్లర్ దేవీసింగ్ ఠాకూర్ విషాద గాథ ఇది. ఇప్పటికే పేరు తెచ్చుకున్న క్రీడాకారులకు కోట్లాది రూపాయలు ఇచ్చే ప్రభుత్వాలు... ఇలాంటి మాణిక్యాలని మట్టిలోనే వదిలేస్తున్నాయి. మన వ్యవస్థలో ఉన్న లోపాలకు నిదర్శనం ఈ యువ క్రీడాకారుడి జీవితం...
 
- యువ రెజ్లర్ దేవీసింగ్ విషాద గాథ 
- ప్రపంచ స్థాయిలో పతకాలు
- ఆర్థిక భారంతో శిక్షణకు దూరం  
- వినాయక విగ్రహాల తయారీలో నిమగ్నం
సాక్షి, హైదరాబాద్:
దీక్షగా వినాయకుడి విగ్రహాన్ని తీర్చి దిద్దుతున్న ఈ 22 ఏళ్ల కుర్రాడి పేరు దేవీ సింగ్ ఠాకూర్... వినాయక చవితి సీజన్‌లో నాలుగు విగ్రహాలు తయారు చేస్తేగానీ ఆ కుటుంబానికి ఐదువేళ్లూ నోట్లోకి వెళ్లవు. హైదరాబాద్ పాతబస్తీలోని ధూల్‌పేట ప్రాంతంలో ఇలాంటి వాళ్లు చాలామందే ఉంటారు. ఈ సీజన్‌లో నాలుగు డబ్బులు సంపాదించుకోకపోతే... ఆ తర్వాత ఏడాదంతా ఇబ్బంది పడాలి. అందుకే రాత్రింబవళ్లు కష్టపడతారు. దేవీసింగ్ కూడా అదే పని చేస్తున్నాడు. అయితే అతను అంతర్జాతీయ స్థాయిలో అనేక పతకాలు తెచ్చిన రెజ్లర్. భారత్‌లో పెద్ద పెద్ద పేరున్న రెజ్లర్లను చిత్తు చేసిన వీరుడు. అతని దురదృష్టమో... వ్యవస్థలో లోపమో... కారణమేదైనా నైపుణ్యం ఉన్న ఓ గొప్ప క్రీడాకారుడు పేదరికాన్ని జయించడానికి తన కెరీర్‌ను త్యాగం చేశాడు. పతకాలు తేవాల్సిన ఆటగాడు పని కోసం వెతుక్కుంటున్నాడు.
 
ఛత్రశాలలో శిక్షణ
పాతబస్తీలో రెజ్లింగ్ చాలా ఫేమస్. ఇక్కడ చిన్నప్పుడే పిల్లలు ఈ ఆటపై మక్కువ పెంచుకుంటారు. దేవీసింగ్ కూడా అలా చిన్నతనంలోనే ఈ క్రీడ పట్ల ఆకర్షణ పెంచుకున్నాడు. మిగిలిన వాళ్లలా టైమ్‌పాస్ చేయకుండా బాగా కష్టపడి రాష్ట్ర స్థాయిలో వరుస విజయాలు సాధించాడు. ఆ తర్వాత ఢిల్లీలోని ప్రఖ్యాత ఛత్రశాల స్టేడియంలో సెలక్షన్స్‌కు వెళ్లి జాతీయ స్థాయిలో ఆకట్టుకున్నాడు. సుశీల్ కుమార్, యోగేశ్వర్‌దత్ సహా దేశంలో ప్రఖ్యాత రెజ్లర్లంతా ఇక్కడ శిక్షణ పొందినవారే.

అక్కడ శిక్షణకు ఎంపికైతే భవిష్యత్‌లో అంతర్జాతీయ పతకాల వర్షం ఖాయం. ఎంతో పోటీ ఉండే ఆ సెలక్షన్స్‌లో దేశవ్యాప్తంగా వచ్చిన రెజర్లను ఓడించి దేవీసింగ్ శిక్షణకు ఎంపికయ్యాడు. అక్కడ  శిక్షణ ఉచితం. కానీ భోజనం, బస, ఇతర ఖర్చులకు సొంతంగా డబ్బు సమకూర్చుకోవాలి. స్నేహితులు, తెలిసిన వారి సాయంతో గత ఏడాది వర కు అక్కడ శిక్షణ తీసుకున్నాడు. తనలో ఉన్న సహజ నైపుణ్యానికి మెరుగులు దిద్దడంతో దేవీసింగ్ అనతికాలంలోనే తన ఉనికిని చాటుకున్నాడు. జాతీయ స్థాయిలో పదుల సంఖ్యలో పతకాలు సాధించాడు. అంతర్జాతీయ స్థాయిలో పెద్ద రెజ్లర్లు ఆశ్చర్యపోయే ఫలితాలు సాధించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు.
 
ఇంటికి వెళ్లొస్తానని చెప్పి...
ఓ వైపు పతకాలు సాధిస్తున్నా ఎక్కడా ప్రోత్సాహం మాత్రం దొరకలేదు. రోజులు గడుస్తున్నకొద్దీ  శిక్షణ భారంగా మారింది. ఇక్కడ కుటుంబ ఆర్థిక పరిస్థితి దిగజారింది. తండ్రి ఆరోగ్యం బాగోవడం లేదు. ఇద్దరు అక్కలకు పెళ్లి చేయాలి. ఈ స్థితిలో ఏమీ పాలుపోక గతేడాది హైదరాబాద్ రెలైక్కాడు. ఇంటికి వెళ్లొస్తా అని చెప్పిన దేవీసింగ్ మళ్లీ ఢిల్లీ ముఖం చూడలేదు. ఛత్రశాల నుంచి కోచ్‌లు ఫోన్‌లు చేస్తూనే ఉన్నారు. కానీ వెళ్లలేని పరిస్థితి. కానీ అసలు కారణం మాత్రం ఆర్థిక ఇబ్బందులు. అత్యుత్తమ రెజ్లర్‌గా మారేందుకు శిక్షణతో పాటు ఫిట్‌నెస్ కోసం తగిన డైట్, ప్రొటీన్లతో కూడిన ఆహారం వంటివి ఎంతో అవసరం. ఎలా చూసుకున్నా అక్కడి ఖర్చును తాను అందుకోలేకపోతున్నాడు. దీంతో రెజ్లింగ్‌ను వదిలేశాడు. కుటుంబ పోషణ కోసం వినాయక విగ్రహాలు తయారు చేస్తున్నాడు.
 
దేవీసింగ్ సాధించిన ముఖ్య ఘనతలు
2011: ఆసియా క్యాడెట్ రెజ్లింగ్  చాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం (థాయ్‌లాండ్)
2011: ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం (హంగెరీ)
2012: ఆసియా జూనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో కాంస్యం (కజకిస్తాన్)

 
స్థానిక పోటీలకే పరిమితం
ఒలింపిక్ స్థాయి ఆటగాళ్లతో పోటీ పడిన ఆ కుర్రాడు ఇప్పుడు స్థానిక కుస్తీ పోటీలకే పరిమితమవుతున్నాడు. ఇందులో చాలా వాటిలో విజేతలకు దక్కే ప్రైజ్‌మనీ రూ. 10 వేలు మాత్రమే. కొంత మంది నిర్వాహకులు అది కూడా ఎగ్గొడతారు. ‘హింద్ కేసరి’లాంటి పోటీల సమయంలో మాత్రం కాస్త హడావుడి ఉంటుంది. ఇక్కడ విజేతకు ప్రైజ్‌మనీగా బైక్ ఇస్తారు. ఇలా ఐదు బైక్‌లు తను గెలుచుకున్నాడు. కానీ ఆర్థిక ఇబ్బందులతో వాటిని అమ్ముకున్నాడు. నిజానికి దేవీసింగ్‌కు అనేకసార్లు కార్పొరేటర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీల స్థాయిలో ఎంతో మంది ఎన్నో హామీలు ఇచ్చారు. కానీ ఎవరూ నెరవేర్చలేదు. రెజ్లింగ్ పోటీల ముగింపు వేడుకలకు వచ్చి బహుమతి ఇచ్చి పొగడ్తలు కురిపిస్తున్నారు. ప్రభుత్వ సాయం ఇప్పిస్తామంటున్నారు. కానీ మళ్లీ తనని ఎవరూ కనీసం తిరిగి పలకరించిన పాపాన పోలేదు.
 
బజరంగ్‌నే భయపెట్టాడు
రెజ్లర్‌గా దేవీసింగ్‌లో అపార ప్రతిభ ఉంది. దీనిని గుర్తించే ఛత్రశాలలో అతడిని అందరూ ప్రోత్సహించారు. అక్కడ రెజ్లర్ల మధ్య హోరాహోరీగా బౌట్‌లు జరుగుతాయి. ఇటీవల ‘అర్జున అవార్డు’ గెలుచుకున్న బజరంగ్ కుమార్ కూడా అక్కడే ప్రాక్టీస్ చేస్తాడు. దేవీసింగ్ ఏకంగా మూడుసార్లు బజరంగ్‌ను చిత్తుగా ఓడించాడు. 2012 లండన్ ఒలింపిక్స్‌కు ముందు భారత రెజ్లింగ్ జట్టుకు అమెరికాలో శిక్షణ కార్యక్రమం జరిగింది. అక్కడకు సీనియర్లతో పాటు దేవీసింగ్ కూడా వెళ్లాడు.


ప్రాక్టీస్ సమయంలో దేవీసింగ్ లాంటి నైపుణ్యం ఉన్న కుర్రాడు కావాలని సుశీల్‌కుమార్ లాంటి స్టార్ రెజ్లర్ కోరుకున్నాడ ంటే... తన నైపుణ్యం ఎంతో గ్రహించవచ్చు. ఇక మరో స్టార్ యోగేశ్వర్ దత్... దేవీ సింగ్‌ను సొంత తమ్ముడిలా చూసుకున్నాడు. ఒక దశలో తన ఖర్చులు కూడా భరించాడు. ఇప్పుడు కూడా ఢిల్లీ రమ్మని యోగేశ్వర్ చెబుతున్నాడు. కానీ ‘అన్న’లా ఆదరిస్తున్న మనిషి మీద ఎంతకాలం భారం వేస్తామనే ఆలోచన ఈ కుర్రాడిది. ఒకవేళ వెళ్లి శిక్షణ తీసుకున్నా... ఇక్కడ కుటుంబం ఎలా గడవాలి? ధూల్‌పేటలో ఎక్కడో మూలన మురికివాడలో దేవీసింగ్ ఇల్లు ఉంది. కానీ యోగేశ్వర్, సుశీల్ ఎవరు వచ్చినా అక్కడికి వెళ్లి వస్తారు. ఈ కుర్రాడిని భారత రెజ్లింగ్ ప్రపంచం ఎంత ఇష్టపడుతుందో చెప్పడానికి ఇదే నిదర్శనం.
 
సాధించగలననే నమ్మకం ఉంది

ఉద్యోగం కోసం చేయని ప్రయత్నం లేదు. ప్రాక్టీస్ మానుకుని చాలామంది పెద్దల వెంట తిరిగాను. కానీ ఎవరి నుంచి ఎలాంటి సహాయం, సహకారం రాలేదు. యోగేశ్వర్ భయ్యా రమ్మంటున్నాడు. కానీ నేను నా స్వార్థం చూసుకుని వెళ్లిపోతే ఇక్కడ నా కుటుంబం గడవదు. పైగా భయ్యాకు కూడా భారమే అవుతా. కొంత ఆర్థిక వెసులుబాటు ఉంటే రెజ్లింగ్‌పై దృష్టిపెట్టొచ్చు. నా వయసు ఇంకా 22 ఏళ్లే. కాబట్టి కచ్చితంగా ఇంకా చాలా సాధించగలననే నమ్మకం ఉంది.’     - దేవీసింగ్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement