youngster missing
-
అదృశ్యమై.. వ్యవసాయ బావిలో శవమై
సైదాపూర్: అదృశ్యమైన ఓ వ్యక్తి వ్యవసాయ బావిలో శవమై తేలాడు. పోలీసులు, గ్రామస్తుల వివరాల ప్రకారం.. సైదాపూర్ మండలంలోని లస్మన్నపల్లికి చెందిన కొట్టె శ్రీకాంత్‌రెడ్డి(34) భార్య ప్రణీత, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆమె పిల్లలతో కలిసి తన పట్టింటికి వెళ్లింది. శ్రీకాంత్‌రెడ్డి సోమవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లాడు. రాత్రయినా తిరిగి రాలేదు. అయితే, అతను కనిపించడం లేదని సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. వెన్నంపల్లికి చెందిన రైతు ప్రభాకర్‌రెడ్డి మంగళవారం తన వ్యవసాయ బావిలో నీళ్లు ఏ మేరకు ఉన్నాయోనని తొంగి చూశాడు. అతనికి అందులో శ్రీకాంత్‌రెడ్డి మృతదేహం కనిపించింది. పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని బయటికి తీయించారు. బహిర్భూమికి వెళ్లి, ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందినట్లు మృతుడి భార్య ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఆరోగ్యం తెలిపారు. -
గోదావరిలో ముగ్గురు యువకుల గల్లంతు
బూర్గంపాడు: భద్రాద్రి జిల్లా బూర్గంపాడు మండలం నాగినేనిప్రోలు రెడ్డిపాలెం గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు గోదావరి నదిలో గల్లంతయ్యారు. గ్రామానికి చెందిన కుందూరు శ్రీనివాసరెడ్డి(21), కారంపూడి శేషు(24), తిరుమలరెడ్డి శివారెడ్డి (23) మరో ముగ్గురు మిత్రులతో కలసి గోదావరి వద్దకు వెళ్లారు. మిత్రుడు గాదె విజయ్‌రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా అక్కడ విందు ఏర్పాటు చేసుకున్నారు. శ్రీనివాసరెడ్డి, శేషు, శివారెడ్డి స్నానం చేసేందుకు నదిలోకి కొంతదూరం వెళ్లాక ఒక్కసారిగా కేకలు వేస్తూ మునిగిపోయారు. మిగిలినవారు రక్షించేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. బూర్గంపాడు, కుక్కునూరు పోలీసులు గాలింపు చేపట్టినా ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. -
ఈతకు వెళ్లి యువకుడు గల్లంతు
సాక్షి, ధర్మవరం: చెరువులో ఈతకు వెళ్లి ఒక యువకుడు గల్లంతయ్యాడు. ఈ సంఘటన అనంతపురం జిల్లా ధర్మవరంలో జరిగింది. పీఆర్టీ వీధికి చెందిన విజయ్(25) స్థానిక చెరువులో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. ఈతగాళ్ల సాయంతో ఇతని కోసం స్థానికులు, పోలీసులు గాలిస్తున్నారు. -
గోదావరిలో యువకుడి గల్లంతు
పలిమెల: ఛత్తీస్‌గఢ్ నుంచి పిక్నిక్ కోసం వచ్చిన బృందంలోని ఓ యువకుడు గోదావరి నదిలో గల్లంతయ్యాడు. ఈ సంఘటన మండలంలోని దమ్మూరు గ్రామం సమీపంలో శుక్రవారం జరగగా ఆలస్యంగా వెలుగుచూసింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ బ్లాక్ కాలనీకి చెందిన ఖుజూర్ అభిషేక్(22) ఐటీఐ చదువుతున్నాడు. అతడు తన మిత్రులతో కలిసి తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాలను విడదీస్తూ మూడు నదుల సంగమ ప్రాంతానికి వచ్చాడు. అప్పటివరకు ఎంతో ఆనందంగా గడిపిన అభిషేక్ స్నానం కోసం నదిలోకి దిగాడు. ఈ క్రమంలో ఒక్కసారిగా నీటి అడుగున ఉన్న ఇసుకలో దిగబడిపోయాడు. ఈత రాని అతడు బయటకు రావడానికి ప్రయత్నించినప్పటికీ ప్రవాహ ఉధృతికి నీటిలో కొట్టుకుపోయాడు. పక్కనే ఉన్న అతడి స్నేహితులకు సైతం ఈత రాకపోవడంతో అభిషేక్‌ను కాపాడే సాహసం చేయలేకపోయారు. వారు కేకలు వేయగా సమీపంలోని జాలర్లు అక్కడికి చేరుకునేలోపే అభిషేక్ కనిపించకుండా పోయాడు. యువకుడి గల్లంతుపై సమాచారం అందుకున్న ఛతీస్‌గఢ్‌లోని భద్రకాళి పోలీసులు అక్కడికి వచ్చి జాలర్లకు సహాయాన్ని అందిస్తున్నారు. రెండు రోజులుగా గాలించినప్పటికీ అభిషేక్ ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు, స్నేహితులు శోకసంద్రంలో మునిగిపోయారు. తెలంగాణ ప్రభుత్వం తమ కుమారుడి ఆచూకీ కనిపెట్టేందుకు సహకరించాలని వేడుకుంటున్నారు. -
వంతెన దాటబోయాడు.. వరదలో కొట్టుకుపోయాడు!
అత్యుత్సాహం ఓ యువకుడి ప్రాణాల మీదకొచ్చింది. దాటగలనన్న ధీమా, దాటే ప్రయత్నానికి మధ్య తీసుకోవాల్సిన చిన్న నిర్ణయంలో తొందరపడ్డాడు. ఫలితంగా భారీ వరదల్లో కొట్టుకుపోయాడు. మధ్యప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షాలకు నదులు, చెరువులు పొంగి పొర్లుతున్నాయి. ఈ భారీ వరదల్లో ఓ యువకుడు కొట్టుకుపోయిన సంఘటన బేతుల్ ప్రాంతంలో చోటు చేసుకుంది. అప్పటికే విపరీతమైన ఉధృతితో పొంగుతున్న ఓ నది వంతెనపై బైక్‌పై వెళ్లడానికి సిద్ధంగా ఉన్న యువకుడు.. వరద ప్రవాహాన్ని తక్కువ అంచనా వేశాడు. ముందు కాస్త తటపటాయించినా ఆ తర్వాత అనాలోచితంగా బైక్‌ని ముందుకు పోనిచ్చాడు. క్షణాల్లో ముంచెత్తిన వరదతో బైక్‌తో సహా కొట్టుకుపోయాడు. ఆ తర్వాత ఎక్కడా అతడి జాడ తెలియకపోవడంతో అతను చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు.