YS Jagan Narasapuram Tour
-
ఇదేం కర్మ రా బాబూ..!
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన ప్రసంగం ధాటిని, ఘాటును ప్రతిపక్షాలకు చవిచూపించారు. నర్సాపురంలో జరిగిన సభలో జగన్ చేసిన ప్రసంగానికి సోషల్ మీడియాలోను, విశ్లేషకుల పరంగానూ వస్తున్న ప్రశంసలే ఇందుకు నిదర్శనంగా కనిపిస్తాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు తన కర్మకు తననే నిందించుకునేలా జగన్ స్పీచ్ సాగిందంటే అతిశయోక్తి కాదు. అధికార వైసీపీ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలన్న యోచనతో తెలుగుదేశం పార్టీ తలపెట్టిన ఇదేం కర్మ కార్యక్రమం ఆరంభం కాకముందే అభాసుపాలైంది. తామేదో అట్టహాసంగా ఇదేం కర్మ అని ప్రచారం చేయాలనుకుంటే ముఖ్యమంత్రి జగన్ ముందస్తుగానే తమను క్లీన్ బౌల్డ్ చేశారని ప్రతిపక్షం వాపోయే పరిస్థితి ఏర్పడింది. జగన్ తన ప్రసంగంలో చంద్రబాబు నాయుడే ఒక కర్మ అని, అప్పటి తెలుగుదేశం పార్టీ పాలనే ఒక కర్మ అని ప్రజలే అనుకుంటున్నారని చెప్పి ఈ టైటిల్ పెట్టడం తమ కర్మ అని ఆ పార్టీ వారే తలపట్టుకునేలా చేశారు. ఆత్మవిశ్వాసం వర్సెస్ ఏడుపుగొట్టు ప్రసంగం జగన్ ప్రసంగంలో వాడి, వేడితో పాటు ఒక ఆత్మ విశ్వాసం స్పష్టంగా కనిపించింది. చంద్రబాబు కాని, పవన్ కళ్యాణ్ ( సీఎం జగన్ పరిభాషలో దత్తపుత్రుడు) కానీ తాము ఏమి చేస్తామో చెప్పకుండా, తమను గెలిపించాలని ప్రజలను బెదిరిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. తాను ఎన్నికల మానిఫెస్టోలో 98 శాతం అమలు చేశానని, దానిని నమ్మితే తనను ఆశీర్వదించండని ఆయన ధైర్యంగా చెబుతున్నారు. గతంలో ఏ ముఖ్యమంత్రి ఇలా అనలేదు. ఇలా అనాలంటే సాహసం కావాలి. అయితే 2009 ఎన్నికల సమయంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ఒకటి, రెండు తప్ప కొత్త హామీలు ఏమీ ఇవ్వకుండా ప్రజలలోకి వెళ్లి గెలిచారు. అదే ధోరణిలో ఇప్పుడు జగన్ మరింత దూకుడుగా ఉన్నారని చెప్పాలి. అందుకే ప్రతిపక్ష వ్యూహాన్ని తుత్తినియలు చేయగలిగారు. వైఎస్ ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గడపగడపకు కార్యక్రమం నిర్వహించడం ఆ పార్టీకి ప్లస్ పాయింట్ గా మారిందని అంతా భావిస్తున్నారు. మొదట ఈ ప్రోగ్రాంను ఎలాగైనా ఫెయిల్ అయిందని ప్రొజెక్టు చేయాలని తెలుగుదేశం, ఆ పార్టీకి మద్దతు ఇచ్చే మీడియా తీవ్రంగా ప్రయత్నించాయి. కక్కలేక.. మింగలేక.. పచ్చప్రకోపం ప్రజలు గడపగడపకు వస్తున్న ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారని, నిరసన చెబుతున్నారని విమర్శలు చేశారు. టీడీపీ పత్రికలైన ఈనాడు, ఆంద్రజ్యోతిలు మరో అడుగు ముందుకేసి అబద్దాలు, సబద్దాలు పోగుచేసి ఆ కార్యక్రమానికి వ్యతిరేకంగా ప్రచారం చేశాయి. కాని టీడీపీ వ్యూహకర్తలు ఆ ప్రోగ్రాం సక్సెస్ అయిందని గమనించారు. దాంతో గడపగడపకు పోటీగా ఏదో ఒకటి నడపాలని భావించారు. అందులో భాగంగా టీడీపీ కార్యకర్తలు, నేతలు ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వంపై ఇదేం కర్మ అని ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఇక్కడే టీడీపీ బలహీనత బహిర్గతమైపోయింది. ఏ కార్యక్రమం అయితే వైసీపీ చేపట్టిందో, దానినే టీడీపీ కూడా మరో రూపంలో చేపట్టవలసి వచ్చింది. టీడీపీ థింక్ టాంక్ వైసీపీని కాపీ కొట్టవలసి వచ్చింది. ఈ నేపధ్యంలో టీడీపీవారు ఒక్క ఇంటికి వెళ్లక ముందే ఇదేం కర్మ బాబూ అంటూ చంద్రబాబు పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప్రజలంతా ఈ కర్మ తమకు వద్దని భావించే టీడీపీని ఓడించారని, అలాగే సొంతపుత్రుడు, దత్తపుత్రుడిని ఓడించారని జగన్ పేర్కొన్నారు. టీడీపీ ఓడిపోయిందని ఊరుకుంటే ఎలాగో సరిపెట్టుకోవచ్చు. కాని లోకేష్, పవన్ కళ్యాణ్ ల ఓటమిని గురించి కూడా ప్రస్తావించి చంద్రబాబును జగన్ ముల్లు పెట్టి పొడిచినట్లుగా ఉంది. దీనికి చంద్రబాబు మరీ ఎక్కువ బాధపడతారేమో తెలియదు. నిజంగానే ఇది బాబు కర్మ సాధారణంగా ఇదేం కర్మ బాబూ అన్న పదాన్ని ఎవరికి వారు వాడుకుంటారు. భాషలో ఉన్న మర్మం తెలియకో, తెలివితక్కువగానో ఇదేం కర్మ అని అనేసరికి వైసీపీకాని, ప్రజలు కాని ఆ పదాల చివర బాబూ అని తగిలిస్తున్నారు. దాంతో ఇదంతా చంద్రబాబుకు ఎదురుదెబ్బగా మారుతోంది. దీనికి తోడు జగన్ ఒకటికి నాలుగు ఉపమానాలు చెప్పి టీడీపీవారిని మరింతగా ఉడికించారు. చంద్రబాబును ఇంటిలో, పార్టీలో చేర్చుకున్నందుకు, మంత్రి పదవి ఇచ్చినందుకుగాను ఎన్.టి.ఆర్. ఇదేం కర్మ అని అనుకుని ఉంటారని జగన్ డైలాగు విసిరితే అంతా గొల్లున నవ్వారు. ఇక చంద్రబాబు కూడా కుప్పంతో సహా రాష్ట్రం అంతటా స్థానిక ఎన్నికలలో ఓడిపోయినందుకుగాను ఇదేం కర్మ అని తలపట్టుకుని కూర్చున్నారట. ఆయనను చూసి సొంత పుత్రుడు, దత్తపుత్రుడు ఇదేం కర్మ అని అనుకుంటున్నారట. వీళ్ల ధోరణి చూసి రాష్ట్ర ప్రజలంతా ఇదేం కర్మ అని అనుకుంటున్నారట. చమత్కారపూరకంగా జగన్ చేసిన ఈ ప్రసంగంతో టీడీపీ వారి ఇదేం కర్మ కార్యక్రమానికి గాలి తీసేసినట్లయింది. అంతా కర్మ సిద్ధాంతం అదే సమయంలో సెల్ టవర్ ఎక్కుతామని, పురుగు మందు తాగుతామని, రైలు కింద పడతామని బెదిరించేవారిలాగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించి ప్రజలలో వారిని చులకన చేయడంలో జగన్ సఫలం అయ్యారనిపిస్తుంది. కర్నూలులో చంద్రబాబు, మంగళగిరిలో పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాలకు జగన్ ప్రసంగానికి ఎంత తేడా ఉందో గమనించండి. చంద్రబాబు, పవన్‌లు బూతులు మాట్లాడే స్థాయికి దిగజారితే, జగన్ మాత్రం ఎక్కడా అభ్యంతరకర పదాలు వాడకుండా, అదే సమయంలో ప్రతిపక్షానికి ఎలా వాతలు పెట్టాలో చేసి చూపించి తన స్థాయిని మరింతగా పెంచుకున్నారని చెప్పాలి. విశేషం ఏమిటంటే కొందరు తెలుగుదేశం నేతలు కూడా ఇదేం కర్మ అన్న టైటిల్‌ను వ్యతిరేకించారట. అయినా చంద్రబాబు వినలేదని చెబుతున్నారు. ఇప్పుడు జగన్ ప్రసంగం తర్వాత నిజంగానేచంద్రబాబు ఇదేం కర్మ బాబూ అని ఆయనకు ఆయనే అనుకోవల్సిందేనేమో! హితైషి, పొలిటికల్ డెస్క్, సాక్షి డిజిటల్ feedback@sakshi.com -
బూతుల పార్టీ.. రౌడీ ‘సేన’
టీడీపీ అంటే.. తెలుగు బూతుల పార్టీగా మార్చేశారు. దత్తపుత్రుడి పార్టీని రౌడీసేనగా మార్చారు. వీరి పాలన రుచి చూసిన రాష్ట్ర ప్రజలంతా ‘ఇదేం ఖర్మరా బాబూ..’ అనుకోబట్టే, వారు చేసిన మోసాలను గుర్తించే 2019లోనే దత్తపుత్రుడిని, సొంత పుత్రుడిని అన్నిచోట్లా ఓడించి బైబై చెప్పారు. – సీఎం వైఎస్ జగన్ సాక్షి ప్రతినిధి, ఏలూరు: సొంత నియోజక వర్గమైన కుప్పం ప్రజలకు కూడా తన పాలనలో మంచి చేయని టీడీపీ చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు తామేం చేశారో చెప్పుకోలేక ఈమధ్య నోటికి ఎక్కువగా పని చెబుతున్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విమర్శించారు. అధికార భగ్న ప్రేమికుడు ఇటీవల రాష్ట్ర ప్రజలను బెదిరించేలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు తీరు చూస్తుంటే.. సెల్‌ఫోన్ టవర్ నుంచి దూకేస్తామని, రైలు కింద పడతామని, పురుగుల మందు తాగుతామని బెదిరించే వారిలా ఉందని వ్యాఖ్యానించారు. సోమవారం పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో నిర్వహించిన మత్స్యకార దినోత్సవం, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనల కార్యక్రమాల్లో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. నరసాపురం నియోజకవర్గంలో రూ.3,300 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనంతరం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. సీఎం జగన్ ప్రసంగం వివరాలివీ.. నరసాపురం సభకు భారీ ఎత్తున హాజరైన జనసందోహంలో ఓ భాగం భయం, నిస్పృహతోనే.. ఈమధ్య చంద్రబాబు తాను రాజకీయాల్లో ఉండాలంటే అసెంబ్లీకి వెళ్లాలని, వచ్చే ఎన్నికల్లో తనను ప్రజలు గెలిపించాలని, లేదంటే తనకు అవే చివరి ఎన్నికలవుతాయని ప్రజల్ని బెదిరిస్తున్నారు. కుప్పంలోనూ గెలవలేననే భయం, నిస్పృహ ఆయనలో కనిపిస్తోంది. ఏ మంచీ చేయని తమకు ఎవరైనా ఓటు ఎందుకు వేస్తారని, ఎందుకు ఓటు వేయాలనిగానీ చంద్రబాబు, దత్త పుత్రుడు చెప్పరు. ఎందుకంటే వారు చెప్పడానికీ ఏమీ లేదు. ఇలాంటి రాజకీయ నాయకులు నాలుగు పేపర్లు, నాలుగు టీవీలు ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ 5 లాంటి వారితో దోచుకో, పంచుకో, తినుకో అనే ఒప్పందం చేసుకుంటారు. ఇదే పెద్ద మనిషి అధికారంలో ఉంటే దోచుకున్నది వీరందరితో పంచుకుని తింటారు. అందువల్లే వారంతా ఆ పెద్ద మనిషి చంద్రబాబు గురించి ఏమీ మాట్లాడరు, చూపించరు, రాయరు. చివరికి ప్రశ్నిస్తాననేవారు కూడా నోరెత్తరు. ఇలాంటి వారందరినీ చూసినపుడు ఇదేం ఖర్మరా బాబూ.. ఈ రాష్ట్ర రాజకీయాలు ఇలా ఉన్నాయనిపిస్తుంది. బాబూ.. ఇదేం ఖర్మరా! ప్రజలు కుప్పం స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం టీడీపీని చిత్తుగా ఓడించి మరోసారి బైబై బాబూ అని చెప్పారు. అందుకే చంద్రబాబు ఇదేం ఖర్మరా బాబూ అని తల పట్టుకుని కూర్చుంటే.. ఆయన పుత్రుడు, దత్త పుత్రుడు ఇదేం ఖర్మరా బాబూ అనుకుంటున్నారు. 1995లో చంద్రబాబు చేతిలో వెన్నుపోటుకు గురైన ఎన్టీఆర్ కూడా ఇలాంటి మనిషికి తన ఇంట్లో, పార్టీలో, కేబినెట్లో స్థానం కల్పించినందుకు ఇదేం ఖర్మరా బాబూ అని అనుకునే ఉంటారు. వీళ్ల ధోరణి చూసి ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలంతా ఇదేం ఖర్మ బాబూ అనుకుంటున్నారు. ప్రతి ఇంటికీ మంచి జరిగిందా లేదా? మీ అందరికీ ఒకటే చెబుతున్నా.. ఒకే ఒక్కటి కొలమానంగా తీసుకోండి. ఇవాళ ప్రతి కుటుంబంలోనూ మంచి జరిగిందా లేదా? అన్నది కొలమానంగా చూడండి. మంచి జరిగితే మీ అన్నగా, తమ్ముడిగా, బిడ్డగా నాకు అండగా నిలబడండి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్తప్రుతుడిని నమ్మొద్దు. మా మేనిఫెస్టోలో చెప్పినవి 98 శాతం నెరవేర్చాం. మన ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధితో ప్రజలంతా ప్రతి ఉప ఎన్నికలోనూ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అండగా నిలబడి ఆశీర్వదించారు. అక్కున చేర్చుకున్నారు.. మత్స్యకారుల జీవితాల్లోకి ఇన్నాళ్లూ ఏ నాయకుడూ తొంగి చూసిన పరిస్థితి లేదు. మత్స్యకారుల తోలు తీస్తాం.. ఫినిష్ చేస్తాం అని గత సీఎం బెదిరిస్తే, సాదరంగా అక్కున చేర్చుకుని ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రిని ఇవాళ చూస్తున్నాం. ప్రతి హామీనీ నెరవేర్చిన సీఎం మన ముందున్నారు. మత్స్యకార భరోసా, డీజిల్ సబ్సిడీ, ఎక్స్‌గ్రేషియా అందిస్తూ వలస వెళ్లకుండా తొమ్మిది హార్బర్లు మంజూరు చేసిన ప్రభుత్వమిది. ఇప్పటికే నెల్లూరులో జువ్వలదిన్నె, బాపట్లలో నిజాంపట్నం, మచిలీ పట్నం, ఉప్పాడలో హార్బర్ నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. ఈ రోజు బియ్యపుతిప్ప హార్బర్ నిర్మాణం ప్రారంభమవుతోంది. కేంద్రం సహకారం అందించకుంటే పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో చేద్దామని సీఎం చెప్పారు. ఆక్వా రంగంలో ఒడిదుడుకులు అన్ని రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. జిల్లాలో ఆక్వా యూనివర్సిటీ మత్స్యకారుల జీవితాల్లో గొప్ప మార్పు తెస్తుంది. – సీదిరి అప్పలరాజు, పశు సంవర్ధక, మత్స్యశాఖ మంత్రి మాట ప్రకారం.. పాదయాత్ర సమయంలో నరసాపురం నియోజకవర్గానికి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి అడుగులు వేశారు. జిల్లా కేంద్రం చేయాలని కోరినప్పుడు నరసాపురం నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందు వరుసలో నిలబెడతామని సీఎం హామీ ఇచ్చారు. మాట ప్రకారం చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.3,300 కోట్ల ప్రాజెక్టులకు నరసాపురం నియోజకవర్గంలో శంకుస్థాపనలు నిర్వహించారు. నరసాపురం నియోజకవర్గ ప్రజలు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. – ముదునూరి ప్రసాదరాజు, ప్రభుత్వ చీఫ్ విప్ -
సీఎం జగన్ నరసాపురం పర్యటన షెడ్యూల్ ఇదే..
తాడేపల్లి : సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రేపు(సోమవారం) పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో పర్యటించనున్నారు. నరసాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. ఈమేరకు రేపటి సీఎం జగన్ నరసాపురం పర్యటన షెడ్యూల్ ఇలా ఉంది. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఉదయం 10.50 గంటలకు సీఎం జగన్ నరసాపురం చేరుకోనున్నారు. ఉదయం గం. 11:15ని.ల నుంచి గం. 12.50ని.లవరకు వివిధ అభివృద్ది కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు. అనంతరం బహిరంగ సభలో సీఎం జగన్ పాల్గొనున్నారు. అనంతరం మధ్యాహ్నం గం. 1.15ని.లకు బయలుదేరి 2.00 గంటలకు తాడేపల్లి చేరుకోనున్నారు సీఎం జగన్. -
నరసాపురం నవశకం.. ఉమ్మడి పశ్చిమలో సరికొత్త రికార్డు
సాక్షిప్రతినిధి, ఏలూరు: ఫిషింగ్ హార్బర్.. ఆక్వా యూనివర్సిటీ.. ఉప్పుటేరుపై రెగ్యులేటర్ నిర్మాణం.. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఒకేసారి 12 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగనున్నాయి. రికార్డు స్థాయిలో రూ.3,300 కోట్లకుపైగా వ్యయంతో నిర్వహించే పనులకు అన్ని అనుమతులు పూర్తయ్యాయి. అది కూడా మొత్తం ఒకే నియోజకవర్గంలో జరిగే పనులు కావడం విశేషం. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గతంలో ఎన్నడూలేని విధంగా నరసాపురం నియోజకవర్గంలో రూ.3,300 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులకు ఈనెల 21న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి నరసాపురం వస్తున్న ఆయనకు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు అపూర్వ స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రిటిష్ హయాంలోనే వెలుగు వెలిగి తర్వాత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిన చారిత్రక నేపథ్యం ఉన్న పట్టణం నరసాపురం. ఇన్నేళ్ల తర్వాత పూర్వవైభవాన్ని తెచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు హయాంలో వేల కోట్ల అభివృద్ధి పనులకు ఒకే రోజు బీజం పడనుంది. పక్కా జీఓలు, సాంకేతిక, ఆర్థికశాఖ అనుమతులతో పనులకు శ్రీకారం చుట్టడం జిల్లా చరిత్రలోనే ప్రథమం. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన పలువురు ఉద్దండులైన నేతల నిలయం నరసాపురం. అయినా వశిష్ట వంతెన, హార్బర్ వంటి దీర్ఘకాల ప్రాజెక్ట్‌లకు మోక్షం కలగలేదు. 19 కిలోమీటర్ల మేర సముద్ర తీరం, అపార మత్స్యసంపద ఉన్న ఈ ప్రాంత అభివృద్ధిపై ఏ నాయకుడు గతంలో దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. ఎన్నికల వాగ్దానాలతో సరిపెట్టడం తప్ప. అయితే జగన్ ప్రభుత్వం నవ చరిత్రకు, తీర ప్రాంత సమగ్ర అభివృద్ధికి ముందడుగు వేసింది. అభివృద్ధి పనులు రుస్తుంబాధలో రూ.13 కోట్లతో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అధునాతన వసతులతో నిర్మించారు. దీనిని సీఎం జగన్ ప్రారంభిస్తారు. రూ.4.80 కోట్లతో నరసాపురంలో పునర్మించిన బస్టాండ్ ప్రారంభోత్సవం. 2 వేల మంది రైతులకు ఉపయోగడేలా 1921 నుంచి ఉన్న దర్భరేవు కంపెనీ భూముల సమస్యను కొత్త జీవోతో తీర్చి తరతరాల నుంచి అనుభవిస్తున్న రైతులకు పట్టాల పంపిణీ. బ్రిటిష్ హయాం నుంచి సమస్యగా ఉన్న మొగల్తూరు మండలం కాళీపట్నం జమిందారీ భూముల పంపిణీ. శంకుస్థాపనలు ఇలా.. రూ.1,400 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన. గోదావరి ఏటిగట్లు పటిష్టం, స్లూయిజ్ పనులకు రూ.35 కోట్లు మంజూరు. రూ.429.43 కోట్లతో బియ్యపుతిప్ప, వేములదీవి వద్ద ఫిషింగ్‌హార్బర్, కార్గోపోర్టు నిర్మాణం. రూ.332 కోట్లతో సరిపల్లిలో దేశంలోనే నాల్గో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు, వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతుల నిర్వహణ. రూ.133 కోట్లతో నరసాపురంలోని రుస్తుంబాధలో 10 ఎకరాల స్థలంలో 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం. పట్టణంలో రూ.220 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనే జీ వ్యవస్థ నిర్మాణంలో భాగంగా మొదటి ఫేజ్‌లో ప్రభుత్వం విడుదల చేసిన రూ.87 కోట్లతో చేపట్టే పనులు ప్రారంభం. రూ.61.81 కోట్లతో మున్సిపల్ వాటర్ ప్రాజెక్టు. రూ.180.50 కోట్లతో మొగల్తూరు మండలం మోళ్లపర్రులో ఉప్పుటేరుపై రెగ్యులేటర్ నిర్మాణం. రూ.70 కోట్లతో కోతకు గురవుతున్న గోదావరి ఏటిగట్లు పటిష్ట పరిచే పనులు. రూ.31 కోట్లతో శేషావతారం వియర్ఛానల్ అభివృద్ధి పనులు. రూ.490 కోట్లతో నిర్మించనున్న గోదావరి జిల్లాల వాసుల చిరకాల కల వశిష్ట వారధిపై ప్రకటన. నియోజకవర్గంలో రూ.75 కోట్లతో 9 ప్రధాన రహదారుల నిర్మాణం, మరమ్మతులకు శంకుస్థాపన. రూ.8.80 కోట్లతో స్లూయిజ్ గేట్ల మరమ్మతులు, ఇతర పనులు. రూ.26.32 కోట్లతో నరసాపురంలో వశిష్ట రైట్ బ్యాంక్ నుంచి బుడ్డిగవానిరేవు వరకు రహదారి నిర్మాణ పనులు. ముమ్మర ఏర్పాట్లు నరసాపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సోమవారం నరసాపురంలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. హెలీప్యాడ్, 25వ వార్డులో సభావేదిక వద్ద పనులు దాదాపు పూర్తయ్యాయి. చినమామిడిపల్లిలో హెలీప్యాడ్ నుంచి స్టీమర్‌రోడ్డు మీదుగా సభాస్థలికి ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. అవసరమైన చోట్ల బారికేడ్లు ఏర్పాటుచేశారు. సీఎం పర్యటన ఏర్పాట్లను శనివారం ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు, కలెక్టర్ పి.ప్రశాంతి, జిల్లా ఎస్పీ రవిప్రకాష్ పరిశీలించారు. సభా వేదిక వద్ద తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. పర్యటనలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న ఉన్నారు. నూతన అధ్యాయం నరసాపురం చరిత్రలో నూతన అధ్యాయానికి సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికీ దక్కని అవకాశం మాకు దక్కింది. రూ.3,300 కోట్ల విలువైన పనులు ఏకకాలంలో శంకుస్థాపనలు చేస్తున్నారు. ప్రజల చిరకాలవాంఛగా ఉన్న వశిష్ట వారధి నిర్మాణం ప్రకటనతో సహా పలు కీలక పనులకు నాంది పలకనున్నారు. – ముదునూరి ప్రసాదరాజు, ప్రభుత్వ చీఫ్ విప్ ఇక్కడ కూడా చదవండి: సీఎం జగన్ నరసాపురం పర్యటన షెడ్యూల్ ఇదే..