నరసాపురంలో ముఖ్యమంత్రి సభావేదిక వద్ద ఏర్పాట్లు
సాక్షిప్రతినిధి, ఏలూరు: ఫిషింగ్ హార్బర్.. ఆక్వా యూనివర్సిటీ.. ఉప్పుటేరుపై రెగ్యులేటర్ నిర్మాణం.. ఇలా ఒకటి కాదు రెండు కాదు ఒకేసారి 12 అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరుగనున్నాయి. రికార్డు స్థాయిలో రూ.3,300 కోట్లకుపైగా వ్యయంతో నిర్వహించే పనులకు అన్ని అనుమతులు పూర్తయ్యాయి. అది కూడా మొత్తం ఒకే నియోజకవర్గంలో జరిగే పనులు కావడం విశేషం. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో గతంలో ఎన్నడూలేని విధంగా నరసాపురం నియోజకవర్గంలో రూ.3,300 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పనులకు ఈనెల 21న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి నరసాపురం వస్తున్న ఆయనకు స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు అపూర్వ స్వాగతం పలికేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.
బ్రిటిష్ హయాంలోనే వెలుగు వెలిగి తర్వాత పాలకుల నిర్లక్ష్యంతో వెనుకబడిన చారిత్రక నేపథ్యం ఉన్న పట్టణం నరసాపురం. ఇన్నేళ్ల తర్వాత పూర్వవైభవాన్ని తెచ్చేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు హయాంలో వేల కోట్ల అభివృద్ధి పనులకు ఒకే రోజు బీజం పడనుంది. పక్కా జీఓలు, సాంకేతిక, ఆర్థికశాఖ అనుమతులతో పనులకు శ్రీకారం చుట్టడం జిల్లా చరిత్రలోనే ప్రథమం. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన పలువురు ఉద్దండులైన నేతల నిలయం నరసాపురం. అయినా వశిష్ట వంతెన, హార్బర్ వంటి దీర్ఘకాల ప్రాజెక్ట్‌లకు మోక్షం కలగలేదు. 19 కిలోమీటర్ల మేర సముద్ర తీరం, అపార మత్స్యసంపద ఉన్న ఈ ప్రాంత అభివృద్ధిపై ఏ నాయకుడు గతంలో దృష్టి పెట్టిన దాఖలాలు లేవు. ఎన్నికల వాగ్దానాలతో సరిపెట్టడం తప్ప. అయితే జగన్ ప్రభుత్వం నవ చరిత్రకు, తీర ప్రాంత సమగ్ర అభివృద్ధికి ముందడుగు వేసింది.
అభివృద్ధి పనులు
- రుస్తుంబాధలో రూ.13 కోట్లతో 50 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా అధునాతన వసతులతో నిర్మించారు. దీనిని సీఎం జగన్ ప్రారంభిస్తారు.
- రూ.4.80 కోట్లతో నరసాపురంలో పునర్మించిన బస్టాండ్ ప్రారంభోత్సవం.
- 2 వేల మంది రైతులకు ఉపయోగడేలా 1921 నుంచి ఉన్న దర్భరేవు కంపెనీ భూముల సమస్యను కొత్త జీవోతో తీర్చి తరతరాల నుంచి అనుభవిస్తున్న రైతులకు పట్టాల పంపిణీ.
- బ్రిటిష్ హయాం నుంచి సమస్యగా ఉన్న మొగల్తూరు మండలం కాళీపట్నం జమిందారీ భూముల పంపిణీ.
శంకుస్థాపనలు ఇలా..
- రూ.1,400 కోట్లతో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుకు శంకుస్థాపన.
- గోదావరి ఏటిగట్లు పటిష్టం, స్లూయిజ్ పనులకు రూ.35 కోట్లు మంజూరు.
- రూ.429.43 కోట్లతో బియ్యపుతిప్ప, వేములదీవి వద్ద ఫిషింగ్‌హార్బర్, కార్గోపోర్టు నిర్మాణం.
- రూ.332 కోట్లతో సరిపల్లిలో దేశంలోనే నాల్గో ఆక్వా యూనివర్సిటీ ఏర్పాటు, వచ్చే విద్యాసంవత్సరం నుంచి తరగతుల నిర్వహణ.
- రూ.133 కోట్లతో నరసాపురంలోని రుస్తుంబాధలో 10 ఎకరాల స్థలంలో 220 కేవీ విద్యుత్ సబ్‌స్టేషన్ నిర్మాణం.
- పట్టణంలో రూ.220 కోట్లతో అండర్‌గ్రౌండ్ డ్రైనే జీ వ్యవస్థ నిర్మాణంలో భాగంగా మొదటి ఫేజ్‌లో ప్రభుత్వం విడుదల చేసిన రూ.87 కోట్లతో చేపట్టే పనులు ప్రారంభం.
- రూ.61.81 కోట్లతో మున్సిపల్ వాటర్ ప్రాజెక్టు.
- రూ.180.50 కోట్లతో మొగల్తూరు మండలం మోళ్లపర్రులో ఉప్పుటేరుపై రెగ్యులేటర్ నిర్మాణం.
- రూ.70 కోట్లతో కోతకు గురవుతున్న గోదావరి ఏటిగట్లు పటిష్ట పరిచే పనులు.
- రూ.31 కోట్లతో శేషావతారం వియర్‌ఛానల్ అభివృద్ధి పనులు.
- రూ.490 కోట్లతో నిర్మించనున్న గోదావరి జిల్లాల వాసుల చిరకాల కల వశిష్ట వారధిపై ప్రకటన.
- నియోజకవర్గంలో రూ.75 కోట్లతో 9 ప్రధాన రహదారుల నిర్మాణం, మరమ్మతులకు శంకుస్థాపన.
- రూ.8.80 కోట్లతో స్లూయిజ్ గేట్ల మరమ్మతులు, ఇతర పనులు.
- రూ.26.32 కోట్లతో నరసాపురంలో వశిష్ట రైట్ బ్యాంక్ నుంచి బుడ్డిగవానిరేవు వరకు రహదారి నిర్మాణ పనులు.
ముమ్మర ఏర్పాట్లు
నరసాపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నరసాపురంలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. హెలీప్యాడ్, 25వ వార్డులో సభావేదిక వద్ద పనులు దాదాపు పూర్తయ్యాయి. చినమామిడిపల్లిలో హెలీప్యాడ్ నుంచి స్టీమర్‌రోడ్డు మీదుగా సభాస్థలికి ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గాన్ని సుందరంగా తీర్చిదిద్దారు. అవసరమైన చోట్ల బారికేడ్లు ఏర్పాటుచేశారు. సీఎం పర్యటన ఏర్పాట్లను శనివారం ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, ప్రభుత్వ చీఫ్‌విప్ ముదునూరి ప్రసాదరాజు, కలెక్టర్ పి.ప్రశాంతి, జిల్లా ఎస్పీ రవిప్రకాష్ పరిశీలించారు. సభా వేదిక వద్ద తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. పర్యటనలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ పెండ్ర వీరన్న ఉన్నారు.
నూతన అధ్యాయం
నరసాపురం చరిత్రలో నూతన అధ్యాయానికి సోమవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీకారం చుడుతున్నారు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గానికీ దక్కని అవకాశం మాకు దక్కింది. రూ.3,300 కోట్ల విలువైన పనులు ఏకకాలంలో శంకుస్థాపనలు చేస్తున్నారు. ప్రజల చిరకాలవాంఛగా ఉన్న వశిష్ట వారధి నిర్మాణం ప్రకటనతో సహా పలు కీలక పనులకు నాంది పలకనున్నారు.
– ముదునూరి ప్రసాదరాజు, ప్రభుత్వ చీఫ్ విప్
ఇక్కడ కూడా చదవండి: సీఎం జగన్ నరసాపురం పర్యటన షెడ్యూల్ ఇదే..
Comments
Please login to add a commentAdd a comment